సహకార బ్యాంకులకు స్వర్ణయుగంగా కూటమి పాలన
డీసీసీబీ ఛైర్మన్ మక్కెన ప్రమాణస్వీకారంలో పాల్గొన్న అచ్చెన్నాయుడు, జీవీ
న్యూస్ తెలుగు/ వినుకొండ : సహకార బ్యాంకులకు స్వర్ణయుగంగా కూటమి పాలన సాగుతోందని మంత్రి అచ్చెన్నాయుడు, ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పేర్కొన్నారు. రైతులకు, ప్రభుత్వానికి వారధిగా సహకార బ్యాంకు వ్యవస్థ ఉందని, అన్నదాతలకు వ్యవసాయ పెట్టుబడి ఖర్చులకు రుణసాయం అందించడంలో సహకార బ్యాంకులదే కీలకపాత్ర అని తెలిపారు. గుంటూరు బ్రాడీపేటలోని డీసీసీబీ కార్యాలయంలో గురువారం ఛైర్మన్‌గా మక్కెన మల్లికార్జునరావు ప్రమాణస్వీకారం చేశారు. శుభ ముహూర్తాన డీసీసీబీ ఛాంబర్‌లో సంతకం చేసి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మంత్రి అచ్చెన్నాయుడు, చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, భాష్యం ప్రవీణ్, తదితరులు హాజరయ్యారు. మక్కెనకు పుష్పగుచ్ఛాలు అందించి అచ్చెన్నాయుడు, జీవీ ఆంజనేయులు అభినందనలు తెలిపారు. డీసీఎంఎస్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన వడ్రాణం హరిబాబుకు చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు అభినందనలు తెలిపారు. అనంతరం డీసీసీబీ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ. మక్కెన మల్లికార్జునరావు డీసీసీబీ ఛైర్మన్ కావడంtb చాలా ఆనందంగా ఉందన్నారు. లక్షలాది మంది రైతులకు మక్కెన అత్యుత్తమ సేవలు అందించగలరని, ఆయనకు ఆ సమర్ధత, నైపుణ్యం ఉందని, డీసీసీబీ ఛైర్మన్ పదవికి వన్నె తెస్తారని పేర్కొన్నారు. రైతులకు ఉత్తమ సేవలు అందించేలా మక్కెనకు ఆశీస్సులు అందించాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నట్లు చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వంలో లాగా లూటీలు, దోపిడీలు లేకుండా అడ్డుకట్ట వేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకును దేశంలోనే అత్యుత్తమ సహకార బ్యాంకుగా నిలిపేలా పనిచేస్తారని, అధికారులు, ఉద్యోగుల సహకారంతో బ్యాంకును లాభాల బాటలో నడిపిస్తారని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. డీసీసీబీ బ్యాంకు ఘనమైన విజయాలు సాధించడానికి ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలమంతా అండగా ఉండి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని జీవీ ఆంజనేయులు తెలిపారు. అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో దివంగత నందమూరి తారకరామారావు సహకార వ్యవస్థను తీసుకొచ్చారని, అందుకు అనుగుణంగా రాష్ట్రంలోని రైతులకు మేలు చేయాలన్నారు. పేరు ప్రఖ్యాతలు ఖండించిన ఈ వ్యవస్థను గత ఐదేళ్లు పూర్తిగా అవినీతిలో కూరుకుపోయే విధంగా వ్యవహరించారన్నారు. గుంటూరు, కృష్ణా డీసీసీబీల్లో జరిగిన అవినీతికి అంతులేదన్నారు. అందుకే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గుంటూరు, కృష్ణా డీసీసీబీల్లో ఎక్కడెక్కడ అవినీతి జరిగింది, దొంగ పాసుపుస్తకాలు పెట్టి రికార్డులు తారుమారు చేసి కొన్ని వందల కోట్ల అవినీతి చేశారో వారందరిపై విచారణ కూడా చేయిస్తున్నామని తెలిపారు. అందులో భాగంగా గుంటూరు డీసీసీబీలో అవకతవకలపై విచారణ కూడా పూర్తయిందని, ఎవరెవరు బాధ్యులో ప్రభుత్వానికి నివేదిక కూడా వచ్చిందన్నారు. ఆ నివేదికను క్షుణ్ణంగా పరిశీలించి వారి నుంచి రికవరీ చేయించడంతో పాటుగా క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధపడుతుందన్నారు. ఇదే విషయాన్ని గత శాసనసభ సమావేశాల్లో రాష్ట్రంలో ఉన్న శాసనసభ్యులు లేవనెత్తారని చెప్పారు. గుంటూరు, కృష్ణా జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో అన్నిచోట్ల ఎన్నికలు జరపకుండా త్రిసభ్య కమిటీని నియమించుకుని కనీసం ఎక్కడా ఆడిట్ లేకుండా విపరీతంగా దోపిడీ జరిగిందని శాసనసభలో ఎమ్మెల్యేలంతా ఆందోళన చెందిన సందర్భంలో ప్రభుత్వ సహకారంతో శాసనసభాపతి హౌస్ కమిటీని నియమించారన్నారు. ఇప్పటికే ఆ కమిటీ విచారణ జరిపి నివేదిక కూడా సమర్పించిందని ఈ సందర్భంగా తెలిపారు. సహకార వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టాలనే ఉద్దేశంతో ఇటీవల ఛైర్మన్, త్రిసభ్య కమిటీని నియమిస్తున్నామని చెప్పారు. వైసీపీ పాలన 6 నెలల్లో సభ్యత్వాలను అన్యాయంగా చేర్పించుకున్నారని, అర్హత కలిగిన వారికి సభ్యత్వం ఇవ్వలేదని, మళ్లీ సభ్యత్వాలన్నీ సరిచేసుకుని వీలైనంత త్వరగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపి ఈ వ్యవస్థను బలోపేతం చేయాలని ప్రభుత్వం దృఢమైన సంకల్పంతో ఉందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే సహకార వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చామని, వైసీపీ పాలనలో ఈ వ్యవస్థలో ఎక్కడా కూడా పారదర్శకత లేదని, ఎవరికి రుణాలు ఇచ్చారో, ఏ సందర్భంలో ఇచ్చారో కూడా తెలియదని, రుణాలు ఎవరు కట్టారో కూడా తెలియని పరిస్థితి నెలకొందన్నారు.అందుకనే ఎంతమంది వ్యతిరేకించినా కేంద్ర ప్రభుత్వ సహకారంతో అన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులను కంప్యూటరైజ్డ్ చేయడం జరిగిందన్నారు. దాదాపు 98 శాతం అన్ని సహకార బ్యాంకులను కంప్యూటరైజ్డ్ చేయడం జరిగిందని, అవినీతికి తావులేకుండా ఈ వ్యవస్థను నడపటానికి అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ నెల నుంచి సహకార వ్యవస్థలో మొత్తం ఆన్‌లైన్ లావాదేవీలు జరపాలని స్పష్టంగా ఆదేశాలు కూడా ఇచ్చారన్నారు. సహకార బ్యాంకుల ద్వారా ఖరీఫ్ సాగుకు రైతులకు పెద్దఎత్తున రుణాలు ఇవ్వాలని లక్ష్యాలు కూడా నిర్దేశించామన్నారు. దీనికి తోడు ఈసారి పీఏసీఎస్ పరిధిలో ప్రతి కౌలు రైతుకు సభ్యత్వం ఇచ్చి తప్పనిసరిగా నూటికి నూరుు శాతం ఈ బ్యాంకుల ద్వారా రుణాలు ఇవ్వాలని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చామన్నారు. వ్యవసాయం చేసే ప్రతి కౌలు రైతుకు తప్పనిసరిగా రుణాలిచ్చి వారికి సహకరించడానికి బ్యాంకుల ద్వారా అన్నివిధాల చర్యలు తీసుకుంటామని తెలిపారు. (Story:సహకార బ్యాంకులకు స్వర్ణయుగంగా కూటమి పాలన)

