Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌శివశక్తి ద్వారా రాజకీయాలు, కులమతాలకు అతీతంగా సేవలు

శివశక్తి ద్వారా రాజకీయాలు, కులమతాలకు అతీతంగా సేవలు

శివశక్తి ద్వారా రాజకీయాలు, కులమతాలకు అతీతంగా సేవలు

శివశక్తి ఫౌండేషన్ కంటి శుక్లాల వైద్య శిబిరానికి విశేష స్పందన

న్యూస్ తెలుగు/వినుకొండ  : శివశక్తి ఫౌండేషన్ ద్వారా రాజకీయాలు, కులాలు, మతాలకు అతీతంగా సేవలు అందిస్తున్నామని ప్రభుత్వ చీఫ్‌ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. భవిష్యత్తులోనూ ఈ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని, శివశక్తి లీలా అండ్ అంజన్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ లీలావతి సేవా కార్యక్రమాలు విస్తరించాలని ప్రణాళిక రూపొందించారన్నారు. సెంటు భూమి, ఇల్లు లేని ఎస్టీలకు శివశక్తి ఫౌండేషన్ సేవలందిస్తుందని అన్నారు. వినుకొండ గంగినేని కల్యాణ మండపంలో శివశక్తి లీలా అండ్ అంజన్ ఫౌండేషన్, పెదకాకానిలోని శంకర కంటి ఆస్పత్రి, జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి శుక్లాల వైద్య శిబిరాన్ని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ప్రారంభించారు. ఇక్కడ పరీక్షలు నిర్వహించి శస్త్రచికిత్సలకు ఎంపిక చేసిన వారికి శంకర కంటి ఆస్పత్రిలో ఆపరేషన్లు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన చీఫ్‌విప్ జీవీ ఆంజనే యులు ఇప్పటి వరకు తమ ఫౌండేషన్ ద్వారా 40 వేలమందికిపైగా కంటి శుక్లాల శస్త్రచికిత్సలు నిర్వహించామన్నారు. ఇకపైనా కూడా ఈ శిబిరాలు పెద్దఎత్తున నిర్వహిస్తామన్నారు. శుక్లాల శస్త్రచికిత్సతో పాటు కంటి పొరలు తొలగించే చికిత్సలు చేయిస్తామన్నారు. 1998లో సేవా భావంతో జన్మభూమి రుణం తీర్చుకుందామని ఈ సేవా కార్యక్రమాలను మొదలుపెట్టినట్లు తెలిపారు. అలానే పేదరకంలో ఉండి ప్రతిభ ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉన్నత విద్య, సివిల్స్, గ్రూపు పరీక్షలకు సిద్ధమయ్యేందుకు కూడా శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఆర్థికసాయం, ప్రోత్సాహకం అందిస్తామన్నారు. మనప్రాంతం నుంచి ఎక్కువమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా, గ్రూప్-1 అధికారులుగా దేశవ్యాప్తంగా సేవలు అందించే స్థాయికి వినుకొండ, పల్నాడు నుంచి ఎదగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవలో ఉన్న అన్నింటికీ వినుకొండలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి చికిత్సలు అందిస్తామన్నారు. భవిష్యత్తులో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, మిత్రులందరి సహకారంతో మంచినీటి పథకానికి నిధులు తీసుకొస్తామని, వినుకొండ పట్టణంలో ఇంటింటికి కుళాయి కనెక్షన్ ఇచ్చి మంచినీళ్లు ఇస్తామన్నారు. కొత్త పైప్‌లైన్లు వేయిస్తామని, నాగార్జునసాగర్ నీటిని ఎన్నెస్పీ కాల్వ నుంచి అండర్‌ గ్రౌండ్ పైప్‌లైన్ వేసి కలుషితం లేకుండా మూడు చెరువులను అనుసంధానంతో పెద్దచెరువు చేసి 365 రోజులు నీళ్లిచ్చే విధంగా భవిష్యత్తులో శాశ్వత మంచినీటి పథకం తీసుకొస్తామన్నారు. గత ప్రభుత్వం చేసిన పాపాల వలన రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కార్పొరేషన్ల రుణాలు ఇవ్వకుండా నిలిపివేశారని, ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో సీసీ రోడ్లు కూడా వేయలేదని, ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులు ఏమయ్యాయో కూడా తెలియని పరిస్థితి ఉందన్నారు. త్వరలోనే కొత్త పింఛన్లు, రేషన్‌కార్డులు మంజూరు చేసేందుకు ప్రభుత్వం షెడ్యూల్ ఇవ్వబోతుందని, అర్హత ఉన్న ప్రతిఒక్కరికీ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, పెమ్మసాని నాగేశ్వరరావు, పివి సురేష్ బాబు, గంగినేని రాఘవ, దాసరి కోటేశ్వరరావు,శంకర కంటి ఆస్పత్రి వైద్యులు, జిల్లా అంధత్వ నివారణ సంస్థ వైద్యులు, ఆర్.ఎం.పి డాక్టర్లు, అధికారులు, కూటమి నాయకులు, శివశక్తి ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.(Story : శివశక్తి ద్వారా రాజకీయాలు, కులమతాలకు అతీతంగా సేవలు )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!