వినుకొండ ఉపాధ్యాయినికి డాక్టరేట్
న్యూస్ తెలుగు / వినుకొండ : స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయిని వి.పద్మ కు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రధానం చేసింది. తెలుగు ప్రాచ్య భాషా విభాగాధిపతి ఆచార్య ఎన్.వి. కృష్ణారావు పర్యవేక్షణలో ” సలీం కథాసాహిత్యానుశీలన ” అనే అంశంపై చేసిన పరిశోధనకు గాను విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రధానం చేసింది. 2005లో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా చేరిన ఆమె డాక్టరేట్ సాధించాలనే లక్ష్యంతో చదువును కొనసాగించారు. యూజీసీ నెట్, ఏపీసెట్ వంటి అర్హతా పరీక్షలలో విజయం సాధించి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో తెలుగు ప్రాచ్య భాషా విభాగంలో పరిశోధన చేపట్టారు. రెండు అంతర్జాతీయ, ఐదు జాతీయ సదస్సుల్లో పాల్గొని ఆమె పరిశోధనా పత్రాలను సమర్పించారు. ఇప్పటి వరకు ఆమె రాసిన ఏడు పరిశోధన పత్రాలు యూజీసీ కేర్ లిస్టెడ్ జర్నల్స్ లో ప్రచురితమయ్యాయని తెలిపారు. ఉద్యోగం చేస్తూనే వివిధ సదస్సుల్లో పాల్గొంటూ పరిశోధన బోధనా మెలకువలు నేర్చుకుని విద్యార్థులకు తెలుగు భాష బోధించడం ద్వారా ఆమె బోధించిన పదవ తరగతి విద్యార్థులు నూరు శాతం ఫలితాలను సాధించారని చెప్పారు. వి. పద్మ డాక్టరేట్ సాధించడం పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కె.నాగలక్ష్మీ , సహోపాధ్యాయులు, సిబ్బంది అభినందనలు తెలిపారు. (Story:వినుకొండ ఉపాధ్యాయినికి డాక్టరేట్)