పరిసరాల పరిశుభ్రత తోనే వ్యాధుల నుండి రక్షణ
జిల్లా మలేరియా అధికారి ఓబులు
న్యూస్‌తెలుగు/ అనంతపురం : నగరపాలక సంస్థ పరిధిలోని మరువకొమ్మ కాలనీలో జిల్లా మలేరియా నివారణ అధికారి ఓబులు సహాయ మలేరియా అధికారితో కలిసి ఫ్రైడే డ్రై డే డే కార్యక్రమాన్ని తనిఖీ చేశారు. ఇంటి పరిసరాలలో మంచినీటిని నిలువ చేసే డ్రమ్ములు,నీటి తొట్టెలు, పూల కుండీలు మరియు డ్రైనేజీలలో లార్వా కొరకు వెతికారు. అక్కడక్కడ నీటి తొట్టెలు మరియు డ్రమ్ములలో లార్వాను కనుగొని వారానికి ఒకసారి తాగునీటి వనరులను శుభ్రపరచుకొని లార్వా లేకుండా చూసుకోవాలని స్థానిక ప్రజలకు అవగాహన కల్పించారు. ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని కట్టుదిట్టంగా చేసి దోమ లార్వాల గురించి ప్రజలకు మంచి అవగాహన కల్పించి దోమల పెరుగుదలను అరికట్టి దోమల వల్ల వచ్చే మలేరియా డెంగ్యూ వంటి జబ్బులకు అడ్డుకట్ట వేయాలని సిబ్బందికి సూచించారు. ఈ కాలనీలో లార్వా పెరిగేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఇక్కడ స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ప్రజలకు మరింత అవగాహన కల్పించవలసిన అవసరం ఉందని అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా మలేరియా సిబ్బందికి సూచించారు. అనంతరం ఫైలేరియాతో ఇబ్బంది పడుతున్న ఆయేషా అనే మహిళకు మార్పిడిటీ మేనేజ్మెంట్ మరియు డిఫార్మటీ ప్రివెన్షన్ కిట్టును అందజేశారు. ఈ కార్యక్రమంలో సహాయ మలేరియా అధికారి సత్యనారాయణ, అర్బన్ మలేరియా సబ్ యూనిట్ అధికారి అబ్దుల్ మునాఫ్, మద్దయ్య, మలేరియా సూపర్వైజర్ శ్రీధర్ మూర్తి, వార్డు సచివాలయ ఆరోగ్య కార్యదర్శి కల్పన ఆశా కార్యకర్త శ్రీదేవి పాల్గొన్నారు. (Story : పరిసరాల పరిశుభ్రత తోనే వ్యాధుల నుండి రక్షణ)