గెలిచినా, ఓడినా..నిరంతరం ప్రజల్లోనే ఉన్నాం, ఉంటాం
శివశక్తి లీలా అండ్ అంజన్ ఫౌండేషన్, తెదేపా ఆధ్వర్యంలో చలివేంద్రాల ఏర్పాటు
చలివేంద్రాలు ప్రారంభించిన జీవీ ఆంజనేయులు, లీలావతి దంపతులు
న్యూస్ తెలుగు /వినుకొండ : దాదాపు మూడు దశాబ్దాలుగా గెలుపు ఓటములతో సంబంధం లేకుండా సేవాకార్యక్రమాల్తో ప్రజల మధ్యనే ఉన్నామని, ఇక నుంచి తమ ఫౌండేషన్ సేవలు మరింత విస్తృతం చేస్తామని చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, ఆయన సతీమణి, శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ లీలావతి అన్నారు. ఇప్పటికే తమ సంస్థ తరఫున నిర్వహిస్తున్న ఉపకార వేతనాలు, వైద్య శిబిరాలు, నైపుణ్యాభివృద్ధి, ఇతర కార్యక్రమాలకు అదనంగా సివిల్స్ కోచింగ్‌కు చేయూతను కూడా ఇవ్వాలని నిర్ణయించామన్నారు. శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్, తెలుగుదేశం ఆధ్వర్యంలో బుధవారం వినుకొండ పట్టణంలోని శివయ్య స్తూపం సెంటర్, బస్టాండ్ సెంటర్ వద్ద చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, శివశక్తి లీలా అండ్ అంజన్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ లీలావతి ప్రారంభించారు. ఈ సందర్భంగానే వారివురూ శివశక్తి ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగుతాయని, ప్రజలకు మంచి జరిగేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్బంగా జీవీ మాట్లాడుతూ. 27 సంవత్సరాలుగా ఫౌండేషన్ చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. ఈ ఏడాది నుంచి పల్నాడు జిల్లాలో నిరుపేదలు, దళితులు, వెనకబడినవర్గాలకు సివిల్స్ కోచింగ్ కు సాయం చేస్తామన్నారు. ఇళ్లు లేని ఎస్టీలు, చెంచులు, యానాదులకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం ద్వారా కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, పట్టణ తాగునీటి పథకం కోసం 161 కోట్లు కాదు, 190 కోట్లైనా తెచ్చి మూడేళ్లలో ఇంటింటికీ మంచినీరు అందిస్తామన్నారు. నాలుగేళ్లలో పల్నాడు వాటర్ గ్రిడ్ ద్వారా నీటి సమస్య పూర్తిగా పరిష్కరిస్తామన్నారు. రామలింగేశ్వర స్వామి గుడికి ఘాట్ రోడ్డు పనులు ఈ వారంలో ప్రారంభించి చేస్తామన్నారు. తర్వాత బీటీ రోడ్, మెట్లదారి, ఆలయాభివృద్ధిని కూడా పరుగులు పెట్టిస్తామన్నారు. అనంతరం శివశక్తి ఫౌండేషన్ మేనేజింగ్ డైరెక్టర్ లీలావతి మాట్లాడుతూ. చలివేంద్రాలు ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉందన్నారు. కళ్లజోళ్ల పంపిణీ, కంటి శుక్లాల ఆపరేషన్లు, ఉపకార వేతనాలు నిరంతరంగా అందిస్తామన్నారు. కూటమి ప్రభుత్వంతో ప్రజలకు ఎంతో మంచి జరిగిందని, రాబోయే పదేళ్లలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, మున్సిపల్ ఛైర్మన్ దస్తగిరి, జనసేన నాయకులు నాగశ్రీను రాయల్, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు. (Story: గెలిచినా, ఓడినా..నిరంతరం ప్రజల్లోనే ఉన్నాం, ఉంటాం)