మురుగు కాలవపై బండలు వేయించాలని ఎమ్మెల్యేని చుట్టుముట్టిన మహిళలు..
న్యూస్ తెలుగు / వినుకొండ : స్థానిక ఓబయ్య కాలనీ ఫస్ట్ లైన్ లో మంగళవారం నాడు పెన్షన్లు పంపిణీ కార్యక్రమానికి చీఫ్ విప్. ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి, కూటమి నేతలు, అధికారులు వెళ్లారు. పింఛన్ పంపిణీ కార్యక్రమం ముగించుకొని బయలు దేరుతుండగా ఒక్కసారిగా మహిళలు ఎమ్మెల్యే జీవి ని మరి కొంతమంది మహిళలు చైర్మన్ దస్తగిరిని చుట్టుముట్టి తమ గోడును వారికి వివరించారు. లోతట్టుగా ఉన్న ఓబయ్య కాలనీ ఫస్ట్ లైన్ నుండి వెల్లటూరు రోడ్డు ఎక్కే చప్టా అధ్వానంగా ఉన్న కారణంగా మనుషులు జారిపడుతూ కాళ్లు చేతులు విరుగుతున్నాయని, తక్షణం వృద్ధులు కూడా రోడ్డుపైకి ఎక్కేందుకు చప్టా బాగు చేయించాలని కోరారు. అలాగే దిగువ భాగంలో మురుగు కాలవపై బండలు లేని కారణంగా కాలువ దాటే క్రమంలో మనుషులు పడి దెబ్బలు తగులుతున్నాయంటూ, గాయపడ్డ ఓ వృద్ధురాలు చైర్మన్ దస్తగిరికి మొరపెట్టుకుంది. స్పందించిన దస్తగిరి 10 రోజుల్లో సమస్య లను పరిష్కరిస్తామని, డ్రైనేజీపై బండలు వేయించి చప్ట ను కూడా మరమ్మత్తులు చేయించుతామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా చైర్మన్ దస్తగిరి మాట్లాడుతూ. గత ప్రభుత్వ హయాంలో ఎటువంటి అభివృద్ధి పనులు జరగలేదని అంత మాయాజాలంగా ప్రభుత్వ నడిచిందని, నేడు ఎమ్మెల్యే జీవీ అభివృద్ధి పనులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారని, ప్రజా సమస్యలు తక్షణం పరిష్కరించే దిశగా ముందుకు సాగుతున్నారని మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి అన్నారు. (Story : మురుగు కాలవపై బండలు వేయించాలని ఎమ్మెల్యేని చుట్టుముట్టిన మహిళలు.. )