మూగజీవాల దాహం తీర్చేందుకు నీటితొట్టెలు
ఉపాధి పనుల కింద నాగులవరంలో నీటితొట్టెల పనులు ప్రారంభించిన జీవీ
న్యూస్ తెలుగు / వినుకొండ : మండువేసవికాలం దృష్ట్యా ఎక్కడా కూడా మూగజీవాలు ఇబ్బంది పడకూడదని పెద్దఎత్తున నీటి తొట్టెలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వచీఫ్‌విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తెలిపారు. గేదెలు, ఆవులు, మేకలు, గొర్రెల సంపదల పరిరక్షణ కోసం ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నామ న్నారు. వినుకొండ మండలం నాగులవరంలో ఉపాధి హామీ పథకం కింద మూగజీవాల కోసం నీటితొట్టెల నిర్మాణ పనుల్ని మంగళవారం ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. వేసవిలో పశువులకు తాగునీరు, గడ్డి కొరత లేకుండా చూసేందుకు ఎన్డీయే ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. అవసరమైన చోట్ల ఈ తొట్టెలను నిర్మిస్తున్నామని, ఒక్కో తొట్టిని రూ.33,200తో సిమెంట్‌తో పక్కాగా నిర్మిస్తున్నామని తెలిపారు. బోరు మోటర్ ద్వారా తొట్టెలు ఎప్పటికప్పుడు నీటితో నింపుతామమన్నారు. ఒక్కో తొట్టికి 5,200 లీటర్ల నీరు అవసరమని, రక్షిత నీటి సరఫరా కోసం చర్యలు చేపడుతున్నామన్నా రు. వీటిద్వారా అడవులు, పొలాల నుంచి తిరిగి వచ్చే పశువులకు ఇబ్బందులు తప్పుతాయన్నా రు. పల్నాడు జిల్లాలో 317 నీటి తొట్టెలు రూ.1.05 కోట్లతో నిర్మించేందుకు ఏర్పాట్లు చేశామని, వినుకొండ నియోజకవర్గంలో 55 తొట్టెలకు రూ.18.26 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం ఇటీవలే 12,138 నీటి తొట్టెలు మంజూరు చేసిందని, 15 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించిందని తెలిపారు. ఇప్పటికే ఉన్న 9,044 తొట్టెలకు ఇవి అదనంగా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసన సభ్యులు మక్కెన మల్లికార్జున రావు, మండల పార్టీ అధ్యక్షులు మాదినేని ఆంజనేయులు, మక్కెన కొండలు, చిరంజీవి, బ్రహ్మం, వీరగంధం ఆనంద్, తదితరులు పాల్గొన్నారు. (Story : మూగజీవాల దాహం తీర్చేందుకు నీటితొట్టెలు)