కేంద్ర ప్రభుత్వం కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిరసన ప్రచార ఉద్యమం
న్యూస్ తెలుగు/ వినుకొండ : భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జాతీయ సమితి పిలుపుమేరకు మంగళవారం నాడు పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని ఎనిమిదో వార్డులో సురేష్ మహల్ రోడ్డు,లాయర్స్ స్ట్రీట్, అరుణ హాల్, మెయిన్ బజార్ తదితర వీధులలో సిపిఐ వినుకొండ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు మాట్లాడుతూ. బిజెపి కేంద్రంలో అధికారంలోకి వచ్చింది మొదలుకొని ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుటలో పూర్తిగా విఫలమైందని సామాన్యుడు వాడుకొనే నిత్యావసర సరుకులు, ఎలక్ట్రానిక్స్ మొదలుకొని పెట్రోల్, డీజిల్, గ్యాస్ లాంటి సామాన్య ప్రజలు రైతులు కొనుగోలు చేసే అన్నివస్తువుల రేట్లు విపరీతంగా పెరిగి ప్రజలు కొనుగోలు శక్తి పడిపోయింది సామాన్యుల కుటుంబాలు నడవడం భారంగా మారిందన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానన్న మోడీ మాట మార్చి రాష్ట్ర ప్రజలను మోసగించి ప్రత్యేక హోదా ఇవ్వకపోగా ప్రత్యేక ప్యాకేజీ కూడా ఇవ్వలేదని విభజనచట్టం ప్రకారం మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు కూడా ఇవ్వలేదని ఆంధ్ర రాష్ట్రాన్ని దివాలా ఆంధ్ర రాష్ట్రంగా తయారు చేశారని విమర్శించారు. దేశంలో మతోన్మాదం పెచ్చరిల్లిపోతోందని దళితులు మైనారిటీ బలహీన వర్గాల ప్రజల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను అంబానీ అదాని లాంటి కార్పొరేట్ కోటీశ్వరులకు కారు చౌకగా అమ్మి వేస్తున్నారని దుయ్యబట్టారు. కేంద్రంలోని పెద్దలు అంబానీ అదాని లాంటి పెద్దలకు మేలు చేస్తున్నారే తప్ప పేద ప్రజల గోడు పట్టించుకోవడంలేదని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీలను వశపరచుకోవడానికి ఈ.డి, సిబిఐ, ఇలాంటి వ్యవస్థలను రాజకీయంగా ఉపయోగించుకుని ప్రతిపక్ష రాజకీయ నాయకులను అధికారంలో ఉన్న బిజెపి యేతర పార్టీలను అక్రమ కేసులు బనాయించి జైల్లో ఇరికిస్తున్నారని తమ పార్టీ బిజెపి తీర్థం పుచ్చుకున్న వారు ఎంతటి అవినీతిపరులైన పునీతులు అవుతారని ఆయన తీవ్రంగా దుయ్యబట్టారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో తాత్సార వైఖరి వైఖరి అవలంబిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలైన సూపర్ సిక్స్ పథకాలను వెంటనే అమలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు.
రాష్ట్రంలోని ఇల్లు లేని ఇంటి స్థలాలు లేని నిరుపేదలకు పట్టణాలలో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాలలో మూడు సెంట్లు ఇళ్ల స్థలాలు ఇచ్చి గృహాల నిర్మాణాలకు ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ విధానాలపై ప్రజా వ్యతిరేక విధానాలపై కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు పిన్నబోయిన వెంకటేశ్వర్లు, రాయబారం వందనం, కొప్పరపు మల్లికార్జున, దారి వేముల మరియ బాబు, రమేష్, షేక్ మస్తాన్, జల్లి వెంకటేశ్వర్లు, లక్ష్మయ్య, ఆర్ రంగా, పి. సుబ్బారావు, కోటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. (Story : కేంద్ర ప్రభుత్వం కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిరసన ప్రచార ఉద్యమం)