మహిళా రిజర్వేషన్ చట్టాన్ని సవరించాలి..
కేసన శంకరరావు
న్యూస్ తెలుగు / వినుకొండ : దేశ, రాష్ట్ర శాసనసభలలో మహిళా భాగస్వామ్యాన్ని మూడోవంతు కు పెంచేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ చట్టానికి, ఓబీసీ మహిళలకు సబ్ కోటా నిస్తూ సవరణ చేసిన తరువాత మాత్రమే అమలు జరపాలని, ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకరరావు పునరుద్ఘాటించారు. స్థానిక పల్నాడు రోడ్డు లోని డాక్టర్ చలపతిరావు హాస్పిటల్ లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో నూతన పార్లమెంటు భవనంలో మొట్టమొదటి రోజున ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి, ” నారీ శక్తి వందన్ – 2023″ పేరిట చట్టసభలలో 33 శాతం మహిళలకు రిజర్వేషన్లు కేటాయిస్తూ చట్టం చేయడం, దేశ రాజకీయాలలో ఒక చారిత్రాత్మకఘట్టమన్నారు. కానీ ఆ చట్టం బీసీ మహిళకు సబ్ కోటానిస్తూ రూపొందించకపోవడం దురదృష్టకరమన్నారు. ఇప్పటికైనా భారత రాజకీయ వ్యవస్థ తన తప్పును సరిదిద్దుకునేలా, మహిళా రిజర్వేషన్ చట్టానికి సవరణ చేసి, ఆపై దేశవ్యాప్తంగా అమలు జరపాలన్నారు. ఈ దేశంలో అనాదిగా అన్ని విధాల అన్యాయానికి గురై, అట్టడుగు వర్గాలుగా ఉన్న వెనుకబడిన తరగతులకు చెందిన ఓబీసీ లతో పాటు, సహజంగానే ఓబీసీ మహిళలు కూడా సామాజిక అణచివేతకు ఆర్థిక దోపిడీకి, అన్ని రంగాలలో అన్ని విధాల అన్యాయానికి గురై అణగారిన వర్గం గానే ఉన్నారన్నారు. 1996 నుండి 2023 వరకు రాజ్యాంగాన్ని నాలుగుసార్లు సవరించి, వరుసగా ప్రధానులైన దేవెగౌడ, వాజ్ పాయ్, మన్మోహన్ సింగ్ లు పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టారన్నారు. కానీ ఓసీ మహిళలతో బీసీ మహిళలు పోటీపడి ఒక్కరు కూడా పార్లమెంటులో అడుగుపెట్టలేరనే కారణంగానే ములాయం- శరద్ – లాలూ ప్రసాద్ యాదవ్ లు తప్పనిసరిగా ఓబీసీ మహిళలకు సబ్ కోటానిస్తూ మాత్రమే మహిళా రిజర్వేషన్ చట్టం చేయాలని, ఎట్టి పరిస్థితులలో ప్రస్తుత బిల్లును ఆమోదింపనీయమని, ఈ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాపిత మహిళా ఉద్యమాన్ని నిర్మిస్తామంటూ యాదవ త్రయం బెదిరించడంతో నిలిచిపోయిందన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు 30 ఏళ్ల పాటు ఆమోదం పొందకపోవడానికి యాదవ త్రయమే కారణమంటూ, ఆనాటి ఆదిపత్యకుల పెత్తందారి పాలకులు-ప్రతిపక్ష పార్టీలు నిందలు వేయడం దుర్మార్గమన్నారు. కేవలం యాదవ త్రయం మహిళా రిజర్వేషన్ బిల్లు లో బీసీ మహిళకు సబ్ కోటా ఉండేలా బిల్లు సవరించమన్నారే తప్ప, మహిళా రిజర్వేషన్ బిల్లుకు తాము వ్యతిరేకం కాదనడం గమనించాలన్నారు. అంతేగాక ఐదు సంవత్సరములకు ఒకసారి మహిళా రిజర్వేషన్ రొటేషన్ పద్ధతిలో మారుతుంది కాబట్టి, తమ నియోజకవర్గం ఎక్కడ మహిళా రిజర్వేషన్ లో పోతుందనే భయంతో, ఎవరికివారు పురుషాధిపత్య అగ్రకుల పెత్తందారీ వర్గాల సభ్యులంతా, ఈ చట్టం అమలు ఎంత దూరం జరిగితే అంత మంచిదనుకుంటున్నారన్నారు. ఒకపక్క చట్టసభలలో ఓబీసీలకు రిజర్వేషన్లు కావాలని దేశవ్యాప్తంగా దశాబ్దాలుగా ఓబీసీ సంఘాలు ఉద్యమిస్తుంటే, మరోవంక ఓబీసీ మహిళకు సబ్ కోటానివ్వకుండానే మహిళా రిజర్వేషన్ చట్టం అమలు చేయాలనుకోవడాన్ని, దేశంలోని మొత్తం ఓబీసీ సమాజం, ముఖ్యంగా ఓబీసీ మహిళా లోకం, ముక్తకంఠంతో ఖండిస్తున్నదని శంకరరావు ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన అధ్యక్షులు కుమ్మరి క్రాంతి కుమార్, రాష్ట్ర అధికార ప్రతినిధి బాదుగున్నల శ్రీనివాసరావు, నియోజకవర్గ అధ్యక్షులు లాయర్ సిద్దయ్య, నియోజకవర్గ బీసీ నాయకులు లాయర్ సైదారావు, మల్లెల సాంబశివరావు, పాశం నాగమల్లేశ్వరరావు, మీసాల మురళీకృష్ణ, శివ, కొండలరావు, కే. వెంకటేశ్వర్లు, కనికరపు శ్రీను, మీసాల శ్రీనివాసరావు, మరియు నియోజకవర్గ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. (Story : మహిళా రిజర్వేషన్ చట్టాన్ని సవరించాలి..)