మాతా శిశు మరణాల్ని సున్నా శాతానికి చేర్చడమే లక్ష్యం
వినుకొండ నియోజకవర్గస్థాయి వైద్య ఆరోగ్య శాఖపై చీఫ్ విప్ జీవీ సమీక్ష
న్యూస్ తెలుగు / వినుకొండ : వినుకొండ నియోజకవర్గంలో మాతా శిశు మరణాలు సున్నాస్థాయికి చేర్చడమే అందరి లక్ష్యం కావాలని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు అన్నారు. ఆ దిశగా నియోజకవర్గంలో ఎక్కడా ఒక్కటి కూడా మాతాశిశు మరణాలు నమోదు కావడానికి వీల్లేదని, ఆ మేరకు వైద్యారోగ్యశాఖ సిబ్బంది పటిష్ఠ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆ లక్ష్యం చేరుకునే దిశగా స్థానిక ప్రభుత్వ వైద్యులంతా హెడ్‌క్వార్టర్స్‌లోనే ఉండాలని, ఆస్పత్రుల విధుల్లో సమయపాలన పాటించాలని, కాన్పులన్నీ ఆస్పత్రుల్లోనే జరిగేలా చర్యలు తీసుకోవాలని, ఎక్కడైనా ఇంటి వద్ద ప్రసవం జరిగిందని తెలిస్తే ఊరుకునే ప్రసక్తి లేదని అధికా రులకు స్పష్టం చేశారాయన. వినుకొండ నియోజకవర్గస్థాయి వైద్య ఆరోగ్య శాఖపై మంగళవారం వినుకొండలోని తన కార్యాలయంలో ఈ మేరకు అధికారు లతో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజవర్గంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అన్నింటిలో యాంటీ ర్యాబిస్ టీకాలు, యాంటీ వీనమ్ ఇంజెక్షన్లు ఉండి తీరాలన్నారు. సీహెచ్‌సీలతో గుండెపోటు సమయంలో ఇచ్చే రూ.40 వేల విలువైన ఇంజెక్షన్లు కూడా ఉండాలని దిశానిర్దేశం చేశారు. హెచ్‌డీఎస్ నిధులు కూడా సక్రమంగా ఖర్చు చేయాలన్నారు. ఆ విభాగం సిబ్బంది కూడా హెచ్‌డీఎస్ ప్రధాన కేంద్రంలోనే ఉండి సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో డీఎంహెచ్ఓ రవికుమార్, వినుకొండ సామాజిక ఆరోగ్య కేంద్రం సూపరింటెండెంట్ అబ్దుల్ రజాక్, ఈపూరు సామాజిక ఆరోగ్య కేంద్రం సూపరింటెండెంట్ హేమలత, 5 మండలాల వైద్య అధికారులు పాల్గొన్నారు. (Story : మాతా శిశు మరణాల్ని సున్నా శాతానికి చేర్చడమే లక్ష్యం)