ఎల్‌ఆర్ఎస్ నిధులతో వినుకొండలో అభివృద్ధి పనులు
వినుకొండలో రూ.1.20 కోట్లతో అభివృద్ధి పనులకు చీఫ్ విప్ జీవీ శంకుస్థాపన
న్యూస్ తెలుగు / వినుకొండ : కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మున్సిపాలిటీలకు ఎల్‌ఆర్ఎస్ నిధులు ఇవ్వడం, ఇందులో భాగంగా వినుకొండ పట్టణానికి వచ్చిన రూ.3 కోట్ల అభివృద్ధి పనులకు మోక్షం లభించిందని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. అలానే పెండింగ్ ప్రాజెక్టులు కూడా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఆ క్రమంలోనే గత తెలుగుదేశం ప్రభుత్వంలోనే నిధులు వస్తే, జగన్ ప్రభుత్వం పక్కన పెట్టిందన్నారు. వినుకొండ పట్టణం శాశ్వత తాగునీటి పథకం పనులు తిరిగి ప్రారంభించామని, త్వరలోనే పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. పట్టణ ప్రజల దాహార్తి తీర్చడం కోసం రూ.161 కోట్లు నాడు తీసుకుని వస్తే జగన్ ప్రభుత్వంలో దానిని కనీసం పట్టిం చుకోలేదన్నారు. వినుకొండ పురపాలక సంఘం పరిధిలోని 23, 31, 32 వార్డుల్లో రూ.1.2 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. విష్ణుకుండిన నగర్, తారకరామ నగర్, రెడ్డి నగర్, కోట్నాల్సా బజార్ లో సీసీ రహదారులు, డ్రైనేజీ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. శిలాఫలకాలు ఆవిష్కరించి భూమిపూజ చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం వినుకొండ మున్సిపాలిటీ అభివృద్ధికి పెద్దఎత్తున నిధులు మంజూరు చేసిందని, పురపాలక శాఖ మంత్రి నారాయణ సహకారంతో వినుకొండ పట్టణానికి రూ.3 కోట్ల నిధులు తీసుకురావడం జరిగిందని అన్నారు. ప్రస్తుతం రూ. కోటీ 2 లక్షల 60వేల విలువైన పనులు ప్రారంభించామని.. జనవరి 28న ప్రజల సమస్యలు విన్నామని, స్వల్ప వ్యవధిలోనే పరిష్కారాలు చూపిస్తున్నామన్నారు. 32వ వార్డు గాయత్రీ నగర్‌లో రెండు సీసీ రోడ్లకు 45 లక్షలు, విష్ణుకుండిని నగర్ డ్రైనేజీకి రూ. 12 లక్షలు, తారకరామనగర్ నగర్‌లో రెండు డ్రైన్లకు రూ. 28లక్షల పనులకు శంకుస్థాపనలు చేశామన్నారు. 23వ వార్డులో రోడ్, డ్రైన్ కోసం రూ. 17.6 లక్షలు పనులకు శంకుస్థాపనలు చేశామన్నారు. మున్సిపల్ ఛైర్మన్ దస్తగిరి, మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ చేస్తున్న అభివృద్ధి ప్రయత్నాలకు పూర్తి మద్దతు ఉంటుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కూడా 20వేల కిలోమీటర్లు గుంతలు పూడ్చుతున్నామని.. ఇప్పటికే రూ. 861 కోట్లతో 19వేల కిలోమీటర్ల మరమ్మతులు పూర్తయ్యాయన్నారు. ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ 30వేల పనులకు శ్రీకారం చుట్టా రని, రూ. 4వేల 800కోట్లలతో గ్రామగ్రామాన అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. గ్రామాల్లో ఇప్పటికే 3వేల కి.మీ సీసీ రోడ్లు పూర్తి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, మున్సిపల్ ఛైర్మన్ డా.దస్తగిరి, కమిషనర్ సుభాష్ చంద్రబోస్, పట్టణ అధ్యక్షులు ఆయబ్ ఖాన్, 32వ వార్డు కౌన్సిలర్ వాసిరెడ్డి లింగమూర్తి, పీవీ సురేష్ బాబు, కూటమి నేతలు యార్లగడ్డ లెనిన్ కుమార్, నాగ శ్రీను రాయల్, నిశంకర్ శ్రీనివాసరావు, కౌన్సిలర్ వాసిరెడ్డి లింగమూర్తి, అలాగే టిడిపి సీనియర్ నాయకులు వాసిరెడ్డి హనుమంతరావు, పెమ్మసాని నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. (Story : ఎల్‌ఆర్ఎస్ నిధులతో వినుకొండలో అభివృద్ధి పనులు)