చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు
న్యూస్ తెలుగు/చింతూరు : చింతూరు లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం మొదటి వార్షికోత్సవం, తృతీయ సంవత్సరం విద్యార్థినీ,విద్యార్థులకు వీడ్కోలు సభ ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా చింతూరు గిరిజన అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు ఆఫీసర్, సబ్ కలెక్టర్ అపూర్వ భరత్, గౌరవ అతిథిగా చింతూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ షేక్.నాగుల్ మీరా విచ్చేశారు. తొలుత జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమైనది. సభకు అధ్యక్షత వహించిన ప్రిన్సిపాల్ డాక్టర్.కె రత్న మాణిక్యం మాట్లాడుతూ కళాశాల ప్రారంభమైనప్పటి నుండి కళాశాలలో అందుబాటులో ఉన్న కోర్సులు, కళాశాల అభివృద్ధిని వివరించారు. కళాశాల అభివృద్ధికి అవసరమైన అదనపు స్థలం కొరకు కృషి చేస్తున్న చింతూరు ఐ.టి.డి.ఏ పి.ఓ, డీ.ఎఫ్.ఓ, ఎఫ్.ఆర్.ఓ, చింతూరు తహసిల్దార్ తదితరులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఇటీవల ప్రధానమంత్రి ఉచ్చితార్ శిక్ష అభియాన్ నుండి మంజూరైన రూ. 5 కోట్లు సంబంధించిన వివరనాత్మక ప్రాజెక్టు నివేదికను సమర్పించి, పరిపాలన అనుమతుల కొరకు వేచి చూస్తున్నట్లు తెలియజేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఐటిడిఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ అపూర్వ భరత్ మాట్లాడుతూ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థినీ విద్యార్థులను అభినందించారు. కళాశాల అభివృద్ధికి కృషి చేయుటకు హామీ ఇచ్చారు 2021- 2024 బ్యాచ్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని,విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు, నగదు బహుమతులు అందజేశారు. గౌరవ అతిథిగా విచ్చేసిన జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ షేక్.నాగుల్ మీరా మాట్లాడుతూ విద్యార్థినీ విద్యార్థులు జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు.వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహించిన క్రీడలు, పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభ చాటిన వారికి ప్రశంసా పత్రాలు,బహుమతులను అందజేశారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. కళాశాల సాంస్కృతిక విభాగ కార్యకర్త జి.హారతి వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో జి.వెంకటరావు, ఎం.శేఖర్ ఎన్.రమేష్ తదితర అధ్యాపక , అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. (Story : చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు)