వనపర్తి జిల్లాలోని చంద్రగడ్ కోట, దేవాలయ ప్రాచుర్యాన్ని, చరిత్రను వెలికి తీసేందుకు చర్యలు
న్యూస్‌తెలుగు/వనపర్తి : పురావస్తు శాఖ ద్వారా అధ్యయనం జరిపించి వనపర్తి జిల్లాలోని చంద్రగడ్ కోట, దేవాలయ ప్రాచుర్యాన్ని, చరిత్రను వెలికి తీసేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర అబ్కారి, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.ఆదివారం అమరచింత మండల పరిధిలోని చంద్రగడ్ గ్రామంలో ఉన్న చంద్రగడ్ కోటను మక్తల్ శాసనసభ్యులు వాకిటి శ్రీహరితో కలిసి మంత్రి సందర్శించారు. చంద్రగడ్ కోటపై ఉన్న రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకున్నారు. మంత్రి మాట్లాడుతూ జిల్లాలోని పురావస్తు శాఖ ద్వారా అధ్యయనం జరిపించి వనపర్తి జిల్లాలోని చంద్రగడ్ కోట, దేవాలయ ప్రాచుర్యాన్ని, చరిత్రను వెలికి తీసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. చంద్రగడ్ కోట వద్దా మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు రూ. 25 లక్షలు ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. కోట ఇప్పటికే చెక్కు చెదరకుండా కనిపిస్తోందని, ఇందుకు సంబంధించిన చరిత్రను పూర్తిస్థాయిలో పురావస్తు శాఖ ద్వారా వెలికి తీసిన అనంతరం మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మక్తల్ శాసనసభ్యులు వాకిటి శ్రీహరి మాట్లాడుతూ చరిత్రలోనే తొలిసారి చంద్రగడ్ కోటను సందర్శించి, శివుడిని దర్శించుకున్న మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు అని కొనియాడారు. చంద్రగడ్ కోట ప్రచుర్యాన్ని వెలికి తీయడమే కాకుండా, ఇక్కడ అభివృద్ధి చేయాలని మంత్రికి విన్నవించారు. ఆత్మకూరు మండల కేంద్రంలోని చర్ల పరమేశ్వర స్వామి దేవాలయాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు, స్థానిక శాసనసభ్యులు వాకిటి శ్రీహరితో కలిసి దర్శించుకున్నారు. పరమేశ్వర స్వామి ఆలయంతో పాటు, చెరువు కట్టపై అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే మంత్రికి విన్నవించగా, ఆలయ అభివృద్ధికి ఏమేం కావాలో అన్నీ సమగ్రంగా ప్రతిపాదనలు పంపిస్తే వాటన్నిటిని నెరవేర్చి ఆలయాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నట్లు మంత్రి హామీ ఇచ్చారు. ఆర్డీవో సుబ్రహ్మణ్యం, డీఎస్పీ వెంకటేశ్వర్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు, ఇతర అధికారులు తదితరులు ఉన్నారు. (Story : వనపర్తి జిల్లాలోని చంద్రగడ్ కోట, దేవాలయ ప్రాచుర్యాన్ని, చరిత్రను వెలికి తీసేందుకు చర్యలు)