టిడిపి పాలనలో గిరిజన తండాల అభివృద్ధి
హోలీ వేడుకల్లో పాల్గొన్న చీఫ్ విప్ జీవి
న్యూస్ తెలుగు /వినుకొండ : గత టిడిపి పాలనలోనే గిరిజన తండాల అభివృద్ధి జరిగిందని ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. వినుకొండ పట్టణంలోని వెల్లటూరు రోడ్డులో గల సేవాలాల్ సంత్ మహారాజ్ గుడి వద్ద శుక్రవారం జరిగిన హోలీ వేడుకల్లో చీఫ్ విప్ జీవి పాల్గొన్నారు. సుగాలి సోదరులతో కలిసి హోలీ పండుగ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడుతూ. 2014-19 టిడిపి హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా ఎస్సి, ఎస్టీ, బీసీ కాలనీలను అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. గిరిజన తండాల్లో ప్రతి వీధికి సిసి, రోడ్లు డ్రైనేజీ, వీధి లైట్లు తదితర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. బొల్లాపల్లి మండలంలో గిరిజన తండాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ముఖ్యంగా ఆర్. ఎస్. ఆర్ కు పైబడిన భూముల్లో ఎంతోమంది ఎస్సీ ఎస్టీ బీసీలు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని, వారికి భూమి హక్కు పట్టాలు లేవని, అర్హులైన వారందరినీ గుర్తించి ఆరు నెలల్లో పట్టాలు ఇప్పించడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం సూర్యకాంతి పథకం ద్వారా సోలార్ విద్యుత్ సౌకర్యం తీసుకువచ్చి ఎస్సీ ఎస్టీలకు ఉచిత విద్యుత్తును ఇవ్వనున్నట్లు తెలిపారు. జలజీవన్ పథకం ద్వారా ఇంటింటికి మంచినీటి కొళాయిలు ఏర్పాటు చేయించి శాశ్వతంగా త్రాగునీటి సమస్యను పరిష్కరిస్తానని తెలిపారు.
రంగుల పండుగ హోలీ, అందరి జీవితాలను రంగులతో నింపాలని, కష్టాలన్నీ తొలగించాలని, ప్రజల జీవితం ఆనందమయం కావాలని, ఈ హోలీ రంగులు ఇంటింటా వసంతంగా కురవాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యంతో ముందుకు సాగాలని ఆయన కోరారు. సేవాలాల్ మహారాజ్ దేవాలయం నిర్మాణానికి తన సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, టిడిపి నాయకులు నాగేశ్వరరావు, పివి సురేష్ బాబు, కూటమి నాయకులు, సుగాలి పెద్దలు పాల్గొన్నారు. (Story : టిడిపి పాలనలో గిరిజన తండాల అభివృద్ధి)