ముకునూరు గ్రామాన్ని మొత్తం జాబితాలో చేర్చాలి
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు
న్యూస్ తెలుగు /చింతూరు : పోలవరం ప్రాజెక్టు ప్రభావంతో ముంపుకు గురవుతున్న ముకునూరు గ్రామంలో 121 గృహాలు ముంపులో ఉన్నట్లు జాబితాలో ప్రకటించి 49 గృహాలను ముంపు లేనట్లుగా పోలవరం అధికారులు ప్రకటించడం దుర్మార్గమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు. ముకునూరు గ్రామస్తులు కార్యదర్శి దరఖాస్తు చేస్తూ గత వరదల్లో గ్రామం మొత్తం ముంపుకు గురైందని పడవలు కూడా నడిచాయని బాధను వెళ్లబుచ్చారు. నిర్వాసిత బాధితులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రాజెక్టు పట్ల శ్రద్ధచూపినంతగా నిర్వాసిత ప్రజానీకానికి పునరావాసం ప్యాకేజీ కల్పించడంలో అశ్రద్ధ వహిస్తుందన్నారు. గతంలో కేవలం ఎకరాకు లక్ష 15 వేలు మాత్రమే చెల్లించిందని ఆపై ఎటువంటి పరిహారం అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఇంటి నిర్మాణ స్ట్రక్చర్ వేల్యూ మూడు వంతులు పరిహారం చెల్లించాలని అలాకాకుండా కేవలం ఇంటి స్ట్రక్చర్ వేల్యూ మాత్రమే ప్రకటించడం అన్యాయమన్నారు. దీనిపై నిర్వాసిత బాధితులతో కలిసి ప్రభుత్వంపై పోరాటం చేస్తామన్నారు. నిర్వాసితుల పట్ల తమ పార్టీ ఎల్లవేళలా సహకారం అందిస్తుందని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బీరబోయిన సత్యకుమారి, జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్, మండల కార్యదర్శి పల్లపు వెంకట్, సీసం సురేష్, నాయకులు లక్ష్మణ్, పెద్ద రాములు, నాగేష్ తదితరులు పాల్గొన్నారు. (Story : ముకునూరు గ్రామాన్ని మొత్తం జాబితాలో చేర్చాలి )