త్వరలోనే పెండింగ్‌లోని ఉపాధి హామీ పథకం బిల్లులు
రూ.148.22 కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లించేలా ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ చొరవ
న్యూస్ తెలుగు / వినుకొండ : 2014-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వంలో పనులు చేసి ఇంతకాలం బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్న వారందరికీ త్వరలోనే న్యాయం జరుగుతుందని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు భరోసా ఇచ్చారు. పెండింగ్ బిల్లులు చెల్లించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అందుకోసం వినుకొండ నియోజకవర్గం పరిధిలో వైకాపా ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన, ఆన్‌లైన్ నుంచి తొలగించిన వివరాలు మొత్తం క్రోడీకరించి న్యాయం చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. మంగళవారం అందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో వినుకొండ నియోజకవర్గంలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు మొత్తం రూ. 148.22 కోట్లు విడుదల చేయించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందుకు సంబంధించి ఎంపీడీవోల ద్వారా మండలాల వారీగా కూడా వివరాలు సేకరించి పల్నాడు జిల్లా డ్వామా పీడీ సిద్ద లింగమూర్తికి పంపించామన్నారు. వినుకొండలో 249 పనులకు రూ.19.29కోట్లు, నూజెండ్లలో 336 పనులకు రూ.32.73 కోట్లు, ఈపూరులో 342 పనులకు రూ.30.60 కోట్లు, బొల్లాపల్లిలో 150 పనులకు రూ.16.57కోట్లు, శావల్యాపురంలో 323 పనులకు రూ.49.03కోట్లు చెల్లించాల్సి ఉన్నట్లు తేలిందన్నారు. కేవలం రాజకీయ కక్షతో ఆ బిల్లులన్నీ ఆపేసిన వైకాపా ప్రభుత్వం వాటిల్లో కొన్నింటిని ఆన్‌లైన్ నుంచి కూడా తొలగించి అకౌంట్‌లు క్లోజ్ చేసిందన్నారు. ఇప్పుడు డ్వామా పీడీ ద్వారా ఆ వివరాలన్నీ రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్‌కు పంపామని, అక్కడి నుంచి ఫైల్ దిల్లీకి పంపి మళ్లీ వివరాలన్నీ ఆన్‌లైన్‌కు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి సహాయ మంత్రి డా.పెమ్మసాని చంద్రశేఖర్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సహాయ సహకారాలతో త్వరలోనే పెండింగ్ బిల్లులు చెల్లిందుకు అవకాశం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. (Story :త్వరలోనే పెండింగ్‌లోని ఉపాధి హామీ పథకం బిల్లులు)