బ్యాలెట్ బాక్స్‌లు జరభద్రం!
పటిష్టమైన భద్రత కల్పించాల్సిందిగా ఏలూరు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశాలు
ఏలూరు సి. ఆర్. రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో బ్యాలెట్ బాక్స్ ల స్వీకరణ కేంద్రం పరిశీలన
న్యూస్‌తెలుగు/ఏలూరు: ఉమ్మడి తూర్పు పశ్చిమగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ బాక్స్ లకు పటిష్టమైన భద్రత కల్పించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక సి.ఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో బ్యాలెట్ బాక్స్ లను భద్రపరిచే స్ట్రాంగ్ రూములను గురువారం సాయంత్రం అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రి సెల్వి మాట్లాడుతూ ఉమ్మడి తూర్పు పశ్చిమగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబందించి ఆరు జిల్లాలలో పోలింగ్ ప్రక్రియ పూర్తి అయిందని, అనంతరం బ్యాలెట్ బాక్సులు ఏలూరు లోని కౌంటింగ్ సెంటర్ కి చేరుకుంటాయని, మార్చి మూడో తేదీన కౌంటింగ్ జరగనున్న దృష్ట్యా అప్పటివరకు స్ట్రాంగ్ రూములలో బ్యాలెట్ బాక్స్ లకు పటిష్టమైన భద్రత కల్పించాలన్నారు. మార్చి 3 తేదీ ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుందన్నారు. బ్యాలెట్ బాక్స్ ల స్వీకరణ కేంద్రంలోని సిబ్బంది బ్యాలెట్ బాక్స్ ల స్వీకరణ సమయంలో బాక్స్ లకు ఉన్న సీళ్లను నిశితంగా పరిశీలించాలని అనంతరం స్ట్రాంగ్ రూమ్ సిబ్బంది వాటిని నిర్దేశించిన ప్రదేశంలో చేర్చాలన్నారు. బ్యాలెట్ బాక్సులు అందించేందుకు పోలింగ్ స్టేషన్ల వారీగా కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని, కౌంటర్లలో సిబ్బంది వారికి కేటాయించిన బ్యాలెట్ బాక్సులను మాత్రమే తీసుకోవాలన్నారు. ఇందుకోసం హెల్ప్ డెస్క్ లను కూడా ఏర్పాటుచేయడం జరిగిందన్నారు. బ్యాలెట్ బాక్సుల స్వీకరణ కేంద్రంలో సిబ్బందికి అవసరమైన త్రాగునీటిని అందుబాటులో ఉంచాలని, ఆహరం, అల్పాహారాలను ఎప్పటికప్పుడు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆహరం, అల్పాహారం తయారీ ప్రదేశంలో అగ్ని ప్రమాద నియంత్రణకు ముందస్తుగా ఏర్పాట్లు చేయాలని, పారిశుద్యం తప్పనిసరిగా ఉండాలన్నారు. అనంతరం కౌంటింగ్ కేంద్రంలో భద్రతకు ఏర్పాటుచేసిన సిసి పర్యవేక్షణ కేంద్రాన్ని, కౌంటింగ్ ప్రక్రియకు ఏర్పాటుచేసిన టేబుళ్ల ఏర్పాట్లను కలెక్టర్ వెట్రిసెల్వి పరిశీలించారు.
జాయింట్ కలెక్టర్ పి . ధాత్రిరెడ్డి, డిఆర్ ఓ వి. విశ్వేశ్వరరావు, ఆర్డీఓలు అచ్యుత్, అంబరీష్, రమణ, ఏలూరు నగరపాలక సంస్థ కమీషనర్ భానుప్రతాప్, ప్రభృతులు పాల్గొన్నారు. (Story: బ్యాలెట్ బాక్స్‌లు జరభద్రం!)