ఏపీ ప్రజలు జగన్‌ను ఎప్పుడో బాయ్‌కాట్ చేశారు
శాసనసభ సమావేశాలకు హాజరైన అసెంబ్లీ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు
న్యూస్ తెలుగు /వినుకొండ : ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైకాపాను ఎప్పుడో బాయ్‌కాట్ చేసిన సంగతి మరిచి రాని ప్రతిపక్ష హోదా కోసం వృథా ప్రయాసను, ఆ పేరిట డ్రామాలను ఇకనైనా ఆపాలని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అసెంబ్లీలో జగన్‌కు హితవు పలికారు. హాజరు కోసం రెండు నిమిషాలు సభకు ఇలా వచ్చి… అలా పారిపోయే వ్యక్తికి ఆ ఎమ్మెల్యే పదవి మాత్రం ఎందుకని ప్రశ్నించారాయన. ప్రజాస్వామ్యంపై, వ్యవస్థలపై వీసమెత్తు గౌరవం లేని జగన్ ఇంకా 30ఏళ్లు రాజకీయాల్లో ఉంటే మాత్రం రాష్ట్రానికికి, ప్రజలకు ఒరిగేదేముంటుందని చురకలు వేశారు. సోమవారం నుంచి ప్రారంభమైన శాసనసభ సమావేశాల అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ చీఫ్ విప్ హోదాలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, శాసన సభాపతి అయ్యన్నపాత్రుడికి ఆయన స్వాగతం పలికారు. తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నజీర్ ప్రసంగించిన అనంతరం సభ రేపటికి వాయిదా వేశారు. శాసనసభాపతి అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన నిర్వహించిన బీఏసీ సమావేశంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, భాజపా నేత విష్ణుకుమార్ రాజుతో కలిసి పాల్గొన్నారు. ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలను మార్చి 21 వరకూ నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. అనంతరం మాట్లాడిన చీఫ్ విప్ జీవీ.. జగన్ ప్రతిపక్ష నేతగా కూడా పనికిరాడని ప్రజలే తిరస్కరించిన తర్వాత ఇంకా వైకాపాకు ఆ హోదా ఎక్కడి నుంచి వస్తుందని ఎద్దేవా చేశారు. కేవలం అనర్హత భయంతోనే ఒక్కరోజు వచ్చి ముఖం చూపించి వెళ్లిపోయారని, అలాంటి వ్యక్తి ఎమ్మెల్యేగా అయినా గెలవడం ప్రజలు చేసుకున్న దురదృష్టంగా భావిస్తున్నామన్నారు. (Story : ఏపీ ప్రజలు జగన్‌ను ఎప్పుడో బాయ్‌కాట్ చేశారు)