డబుల్ బెడ్రూం కాలనీల్లో మౌలిక వసతులు కల్పించాలి
జిల్లా కలెక్టర్ కు కాలనీవాసుల విజ్ఞప్తి
న్యూస్‌తెలుగు/వనపర్తి : డబుల్ బెడ్రూం కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ కు కాలనీవాసులు విజ్ఞప్తి చేశారు. ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని చిట్యాల రోడ్డులో ఉన్న డబుల్ బెడ్రూం కాలనీలో సురేంద్రబాబు అధ్యక్షతన కాలనీవాసుల ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పీర్లగుట్ట, పెద్దగూడెం, రాజపేట, అప్పాయిపల్లి డబుల్ బెడ్రూం కాలనీ వాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ గత ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి లబ్ధిదారులకు అప్పగించిందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కాలనీలో నెలకొన్న మౌలిక సదుపాయాలు కల్పించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. చిట్యాల రోడ్డులో ఉన్న డబుల్ బెడ్రూం కాలనీలో రోడ్లు, వీధిలైట్లు, మంచినీరు తదితర సమస్యలతో ప్రజలు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. జిల్లా కలెక్టర్ డబుల్ బెడ్రూం కాలనీలో నిజమేనా లబ్ధిదారులు నివాసం ఉండడం లేదని, అద్దెలకు ఇచ్చారని, డబుల్ బెడ్రూంలు అమ్ముకున్నారని, అటువంటి వారిపై విచారణ నిర్వహించి చర్యలు తీసుకోవాలని చెప్పడం బాధాకరమన్నారు. డబుల్ బెడ్రూం కాలనీలో మౌలిక వసతులు కల్పిస్తే ప్రజలు వచ్చి నివాసం ఉంటారని, ఎటువంటి సౌకర్యాలు కల్పించని ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లు తిరిగి ఎలా తీసుకుంటారని వారు ప్రశ్నించారు. చిట్యాల రోడ్డులో ఉన్న డబుల్ బెడ్రూం కాలనీలో 11వ బ్లాక్ వరకే మిషన్ భగీరథ నీళ్లు వస్తాయని, మిగతా బ్లాక్ లకు నీటి సరఫరా లేదని, ఉన్న మూడు బోర్లలో నీరు తగ్గిందని, దీంతో ప్రజలు గొడవలు పడుతున్నారని వారన్నారు. సిసి రోడ్లు మంజూరైన ఇప్పటివరకు పని ప్రారంభించలేదని, చాలా సమస్యలు ఈ కాలనీలో ఉన్నాయని వారు గుర్తు చేశారు. జిల్లా కలెక్టర్ స్పందించి అప్పాయిపల్లి, పీర్లగుట్ట, పెద్దగూడెం, రాజపేట, చిట్యాల రోడ్డులో ఉన్న డబుల్ బెడ్రూం కాలనీలో మౌలిక వసతులు కల్పించి ప్రజలు డబుల్ బెడ్రూం ఇండ్లలో నివాసం ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండ్ల రాజు, గోపాలకృష్ణ, జర్నలిస్ట్ నిరంజన్, వినోద్, తిరుపతయ్య, పెద్ద ఖాజా, సిద్దయ్య, సుధాకర్ రెడ్డి, మోహన్, మైను, శ్రీనివాసులు, సలీం, వెంకటేష్, రాధా, ఆబిద్, శ్రీనివాసులు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. (Story : డబుల్ బెడ్రూం కాలనీల్లో మౌలిక వసతులు కల్పించాలి)