ఇందిరమ్మ లబ్ధిదారులు నిర్మాణాలు ప్రారంభించుకోవాలి
న్యూస్‌తెలుగు/వనపర్తి : ఇందిరమ్మ ఇండ్లకు ఎంపికై, మంజూరు పత్రాలు అందిన లబ్ధిదారులు వెంటనే ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి విజ్ఞప్తి చేశారు. బుధవారం శ్రీరంగాపూర్ మండల పరిధిలోని నాగసానిపల్లి, పెబ్బేరు మండల పరిధిలోని ఈర్లదిన్నె గ్రామాల్లోని గ్రామపంచాయతీ కార్యాలయాల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో వేర్వేరు సమావేశాలు నిర్వహించారు. నాగసాని పల్లిలో 156 మంది లబ్ధిదారులు గ్రామ సభ ద్వారా ఇందిరమ్మ ఇండ్లకు ఎంపిక కాగా, ఈర్లదిన్నె గ్రామంలో 72 మంది లబ్ధిదారులు గ్రామ సభ ద్వారా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణంపై పలు సూచనలు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లకు ఎంపికై, మంజూరు పత్రాలు అందిన లబ్ధిదారులు వెంటనే ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇంటి నిర్మాణానికి ముగ్గు పోసే సమయంలో పంచాయతీ కార్యదర్శి ఫోటోలు తీసి యాప్ లో అప్లోడ్ చేయాల్సి ఉంటుందని, కాబట్టి స్థానిక పంచాయతీ కార్యదర్శికి సమాచారం అందించి వెంటనే నిర్మాణం ప్రారంభించుకోవాలని సూచించారు. ఇంటి నిర్మాణం ప్రారంభించిన తర్వాత దశలవారీగా నగదు లబ్ధిదారులకు అందుతుందని చెప్పారు. ఇల్లు నిర్మాణం ప్రారంభించిన తర్వాత అనుమతులు ఇతరత్రా వాటికోసం ఎవరైనా డబ్బులు కావాలని డిమాండ్ చేస్తే అధికారులకు తెలియజేయాలని, అలాంటి వారిని నమ్మి మోసపోవద్దని చెప్పారు. 400 నుంచి 500 చదరపు అడుగులలో లబ్ధిదారులు తమకు నచ్చిన రీతిలో ఇంటిని నిర్మించుకోవచ్చు అని చెప్పారు. అన్ని మండల కేంద్రాల్లో రూ. 5 లక్షలతో నమూనా ఇందిరమ్మ ఇంటిని నిర్మించడం జరుగుతుందని, లబ్ధిదారులు కూడా దానిని చూసి 5 లక్షల లోపు ఇంటి నిర్మాణం పూర్తి చేసుకోవచ్చని చెప్పారు. ఇంటి నిర్మాణం ప్రారంభించుకునే వారికి వెంటనే అనుమతులు ఇవ్వాలని పంచాయతీ కార్యదర్శులకు ఆదేశించారు. ఇక ఇల్లు కట్టుకునేవారు ఇసుక కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ట్రాన్స్పోర్ట్ చార్జీలు భరించుకొని తహసిల్దార్ అనుమతితో ఉచితంగా ఇసుక పొందవచ్చు అని కలెక్టర్ లబ్ధిదారులకు చెప్పారు. కొత్తగా ఇళ్ల నిర్మాణం ప్రారంభించే వారికి మాత్రమే ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా నగదు లబ్ధి చేకూరుతుందని, ఇదివరకే నిర్మించిన ఇళ్లను మరమ్మతులు చేయడం వంటివి చేసే వారికి వర్తించదని చెప్పారు. ఈ సందర్భంగా కలెక్టర్ రెండు గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లకు ఎంపికైన పలువురు లబ్ధిదారుల ఇళ్లను సందర్శించారు. నాగసాని పల్లి గ్రామంలో గోవిందమ్మ ఇంటి స్థలాన్ని, ఈర్లదిన్నె గ్రామంలో వరలక్ష్మమ్మ ఇంటి స్థలాన్ని పరిశీలించారు. సమావేశంలో శ్రీరంగాపూర్ తహసిల్దార్ మురళి, పెబ్బేరు తహసిల్దార్ లక్ష్మి, పెబ్బేరు ఎంపీడీవో రవీంద్ర, శ్రీరంగాపూర్ ఎంపీడీవో, స్థానిక పంచాయతీ కార్యదర్శులు, ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.(Story ; ఇందిరమ్మ లబ్ధిదారులు నిర్మాణాలు ప్రారంభించుకోవాలి)