లింగ నిర్ధారణ పరీక్షల నిరోధక చట్టం కట్టుదిట్టం
అనవసరంగా సిజేరియన్ ఆపరేషన్‌లు జరగకుండా చర్యలు
విజయనగరం జిల్లాస్థాయి కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్.అంబేద్కర్ ఆదేశాలు
న్యూస్‌తెలుగు/విజయనగరం: జిల్లాలో స్త్రీ, పురుష నిష్పత్తిలో వ్యత్యాసం అధికంగా వుంటున్నదని, దీనిని తగ్గించేందుకు గర్భస్థ శిశు లింగ నిర్ధారణ చట్టాన్ని పకడ్బందీగా అమలుచేసి స్కానింగ్ కేంద్రాలపై గట్టి నిఘా వుంచాల్సిన అవసరం వుందని జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్.అంబేద్కర్ చెప్పారు. జిల్లాలో వున్న 110 స్కానింగ్ కేంద్రాల ద్వారా రోజువారీ జరుగుతున్న స్కానింగ్‌ల సమాచారాన్ని సేకరించాలని ఆదేశించారు. ముఖ్యంగా గర్భిణీలకు అవసరం వున్నా లేకపోయినా సిజేరియన్ చికిత్సలకు డాక్టర్లు సిఫారసు చేస్తూ పేద కుటుంబాలపై అనవసర ఆర్ధిక భారం మోపుతున్నారని దీనిని నివారించే దిశగా చర్యలు చేపట్టాలని చెప్పారు. జిల్లాలో నమోదైన గర్భిణీలు, వారిలో జరుగుతున్న సాధారణ ప్రసవాలు, సిజేరియన్ చికిత్స ద్వారా జరిగిన ప్రసవాలు, ఆయా నెలలో జరిగిన అబార్షన్‌లకు సంబంధించిన సమాచారాన్ని సేకరించాలని వైద్య ఆరోగ్య అధికారులను ఆదేశించారు. సిజేరియన్ చికిత్సలు ఎన్ని జరుగుతున్నాయి, ఏయే ప్రాంతాల్లో జరుగుతున్నాయనే సమాచారం అందజేయాలని, దీని ఆధారంగా విశ్లేషణ చేయాలన్నారు.
గర్భస్థ శిశు లింగ నిర్ధారక పరీక్షల నిరోధక చట్టం జిల్లా స్థాయి కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్.అంబేద్కర్ అధ్యక్షతన సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. అదేవిధంగా అబార్షన్‌లపై కూడా పూర్తి సమాచారం వుండాలని అవి చట్టబద్దంగా జరుగుతున్నాయా లేదా అక్రమంగా జరుగుతున్నాయా అనే సమాచారం సేకరించాలన్నారు.
జిల్లా స్థాయిలో స్కానింగ్ కేంద్రాల తనిఖీ విషయంలో పకడ్బందీగా చర్యలు చేపట్టాలన్నారు. రెవిన్యూ డివిజనల్ అధికారులు కూడా స్కానింగ్ కేంద్రాలు తనిఖీ చేయాలని చెప్పారు. జిల్లాలో వున్న మొత్తం 115 కేంద్రాలకు గాను ఇప్పటివరకు 47 కేంద్రాల తనిఖీ పూర్తయినట్టు వైద్య ఆరోగ్య అధికారులు వివరించారు. మొక్కుబడిగా స్కానింగ్ కేంద్రాల తనిఖీ చేయడం వల్ల ప్రయోజనం వుండదని, తనిఖీల ద్వారా ఫలితాలు కనిపించాలన్నారు.
సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా.జీవనరాణి, టిబి నియంత్రణ అధికారి డా.రాణి, ప్రోగ్రాం అధికారి డా.బాలసుబ్రహ్మణ్యం, సిఐ నరసింహమూర్తి, జిల్లా మాస్ మీడియా అధికారి చిన్నతల్లి, ఆర్.డి.ఓ. కార్యాలయ ఏ.ఓ. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. (Story: లింగ నిర్ధారణ పరీక్షల నిరోధక చట్టం కట్టుదిట్టం)