వినుకొండలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాకు వినతి
శ్రీశైలం పర్యటనకు వెళ్తూ వినుకొండలో ఆగిన హోంమంత్రి అనితకు జీవీ స్వాగతం
చీఫ్ విప్ జీవీ నివాసంలో అల్పాహారం స్వీకరించిన హోంమంత్రి
న్యూస్‌తెలుగు/వినుకొండ: పల్నాడు జిల్లా వినుకొండకు అగ్నిమాపక కేంద్రాన్ని మంజూరు చేసి త్వరితగతిన ఏర్పాటు చేయాలని హోంమంత్రి వంగలపూడి అనితకు ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు విజ్ఞప్తి చేశారు. అవసరమైన స్థలం కూడా సిద్ధంగా ఉందని, కావాల్సిన ఏర్పాట్లను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తానని, హోంశాఖ తరఫున త్వరితగతిన అనుమతులు ఇప్పించాలని కోరారు. జీవీ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన హోంమంత్రి అనిత.. పరిశీలించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. సోమవారం శ్రీశైలం వెళ్తూ మార్గమధ్యంలో వినుకొండలో ఆగిన హోంమంత్రి అనితకు ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. జీవీ ఆంజనేయులు ఆహ్వానం మేరకు కొత్తపేటలోని ఆయన నివాసానికి వెళ్లారు. జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఆమెకు సాదర స్వాగతం పలికారు. జీవీ ఇంట్లో అల్పాహారం స్వీకరించారు. వంగలపూడి అనితను ఘనంగా సత్కరించి వేంకటేశ్వరస్వామి ప్రతిమను బహూకరించారు. ఈ సందర్భంగా పలు ముఖ్యమైన అంశాలపై చర్చించారు. వినుకొండలో పోలీసులకు కల్పించాల్సిన మౌలిక వసతులు, సౌకర్యాలపై కూడా చర్చకు వచ్చాయి. అనంతరం శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్షించేందుకు హోంమంత్రి అనిత బయలుదేరి వెళ్లారు. (Story: వినుకొండలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాకు వినతి)