వృత్తి నైపుణ్యానికే పోలీస్ మొబిలైజేషన్
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్
న్యూస్‌తెలుగు/విజయనగరంః ఆర్మ్డ్ రిజర్వు పోలీసులకు 14రోజులపాటు నిర్వహించే పునశ్చరణ తరగతులను (మొబిలైజేషన్) జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ పోలీసు పరేడ్ గ్రౌండులో ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ – పోలీసు విధులను నిర్వహించే సమయంలో నిష్పక్షపాతంగా, అంకిత భావం, నిజాయితీతో వ్యవహరించి, ప్రజలకు మరింత చేరువ కావాలన్నారు. విధుల్లో నైపుణ్యాన్ని సాధించేందుకు ఆర్మడ్ రిజర్వు పోలీసులకు ప్రతీ ఏడాది 14రోజులపాటు నిర్వహించే పున:శ్చరణ తరగతులు (మొబిలైజేషను)ను పోలీసు సిబ్బంది సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ పునశ్చరణ తరగతులను ఫిబ్రవరి 10 నుండి 24 వరకు నిర్వహిస్తామన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో ఆర్మ్ డ్ రిజర్వు పోలీసులు ఎంతో బలమైన శక్తిగా జిల్లా పోలీసుశాఖకు వెన్నుముకగా నిలుస్తున్నారన్నారు. యూనిఫాం ధరించిన తరువాత ప్రజల ధన, మాన, ప్రాణాల రక్షణకే పోలీసులు పునరంకితం కావాలని పోలీసు అధికారులు, సిబ్బందికి జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు. ప్రస్తుత పరిస్థితులు, అవసరాల దృష్ట్యా ఈ మొబిలైజేషనులో ఆర్మ్డ్ పోలీసులకి ఒత్తిడిని జయించేందుకు యోగా, వ్యక్తిత్వ వికాసాన్ని, ఆరోగ్యాన్ని, ఆర్ధిక స్థితులను మెరుగుపర్చేందుకు ప్రణాళికాయుతంగా కొన్ని కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. వీటితోపాటు రిజర్వు పోలీసుల వృత్తిపరమైన నైపుణ్యాన్ని పెంపొందించేందుకు శారీరక దారుఢ్యం పెంచేందుకు, వివిధ ఆయుధాల ఉపయోగాలను, ముఖ్యమైన బందోబస్తు విధులను ఏవిధంగా నిర్వహించాలో, ఫైరింగు ప్రాక్టీసు, బాంబు స్క్వాడ్ పనితీరు ఏవిధంగా చేపట్టాలో, మస్కట్రీ శిక్షణను, అత్యవసర పరిస్థితుల్లో సి.పి.ఆర్. ఏవిధంగా చేయాలన్న విషయాలపై ప్రత్యేకంగా మొబిలైజేషను కార్యక్రమంలో శిక్షణ అందించనున్నట్లుగా జిల్లా ఎస్పీ తెలిపారు. అంతేకాకుండా, పోలీసుల సంక్షేమానికి చేపడుతున్న కార్యక్రమాల పట్ల కూడా పోలీసు సిబ్బందికి అవగాహన కల్పిస్తామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఎఆర్ అదనపు ఎస్పీ జి.నాగేశ్వర రావు, ఆర్ఐలు ఎన్.గోపాల నాయుడు, ఆర్.రమేష్ కుమార్, టి.శ్రీనివాసరావు, ఆర్ఎస్ఐలు బి.సూర్యనారాయణ, ఎ.రామకృష్ణ, కె.వర ప్రసాద్, టి.రామారావు, ఎస్.వి.ఆర్. పాత్రుడు, సిహెచ్.మహేష్, పలువురు ఎఆర్ఎస్ఐలు, ఎఆర్ హెచ్సీలు, ఎఆర్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. (Story: వృత్తి నైపుణ్యానికే పోలీస్ మొబిలైజేషన్)