ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి గెలుపు ఏకపక్షం కావాలి
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారంపై కూటమి నాయకులకు జీవీ దిశానిర్దేశం
న్యూస్ తెలుగు/వినుకొండ : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి గెలుపు ఏకపక్షం కావడంలో ఎలాంటి సందేహం లేదని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. యువతకు చేసింది చెప్పడం, నేతల మధ్య సమన్వయమే అందుకు కీలకమని గుర్తుంచుకోవాలన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, కూటమి నాయకుల సమన్వయంపై ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. తెలుగుదేశం పార్టీ క్లస్టర్, యూనిట్, బూత్, సెక్షన్ ఇన్ ఛార్జులతో పాటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ విజయానికి కూటమి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎక్కువ శాతం ఓట్లు పోలయ్యేలా ప్రతి ఒక్కరు ప్రత్యేక శ్రద్ధతో కృషి చేయాలన్నారు. ఇంటింటికి వెళ్లి పట్టభద్రులను కలసి ఓట్లను అభ్యర్థించాలని సూచించారు. నియోజకవర్గంలోని 5 మండలాల్లో సుమారు 7,600 పట్టభద్రుల ఓట్లు ఉన్నాయని, వాటిల్లో సింహభాగం కూటమి అభ్యర్థికే పడేలా కూటమి నాయకులు బాధ్యత తీసుకోవాలన్నారు. సాధారణ ఎన్నికలను ఎంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నామో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను కూడా అంతే సీరియస్‌గా తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. ప్రతి ఓటరును పార్టీ శ్రేణులు నేరుగా కలవాలని, సోషల్ మీడియాను పెద్ద ఎత్తున వినియోగించుకోవాలని, పట్టణ ప్రాంతాల్లో ఉండే పట్టభద్రులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జీవీ సూచించారు. ప్రజా ప్రభుత్వం ఏర్పాటైన తరువాత జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పట్టభద్రులకు వివరించాలన్నారు. ఏడేళ్ల తరువాత ప్రజా ప్రభుత్వం ప్రకటించిన మెగా డీఎస్సీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం, విద్యా వ్యవస్థలో తీసుకొస్తున్న మార్పులు, ఉన్నత విద్యను గాడిన పెట్టేందుకు వీసీల నియామకం, రిక్రూట్‌మెంట్, తదితర అంశాల గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని జీవీ ఆంజనేయులు సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.(Story : ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి గెలుపు ఏకపక్షం కావాలి )