ఉద్యాన పంటలకు రాష్ట్రంలో ఇకపై మరింత ప్రోత్సాహం
తిమ్మాయపాలెంలో ఉద్యాన పంటలు పరిశీలించిన జీవీ ఆంజనేయులు
న్యూస్ తెలుగు/వినుకొండ : రాష్ట్రంలో ఉద్యాన పంటలకు కూటమి ప్రభుత్వం రూపంలో ఇకపై మరింత ప్రోత్సాహం లభించనుందని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను కూడా అనుసంధానం చేసి పండ్లతోటల రైతులకు మేలు చేయాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యంగా పేర్కొన్నారు. ఆ దిశగానే పండ్ల తోటల పెంపకానికి ఉద్యానశాఖ ప్రోత్సాహకాలు అందిస్తోందని, సమీకృత ఉద్యాన మిషన్ పథకం ద్వారా వివిధ రకాల తోటలు, కూరగాయలకు రాయితీని అందిస్తూ ఔత్సాహికులను ముందుకు తీసుకెళ్తుందన్నారు. వినుకొండ మండలం తిమ్మాయపాలెంలో గురువారం డ్రాగన్, జమ సాగును చీఫ్ విప్ జీవీ సందర్శించారు. రైతు అడపాల రామకృష్ణ సాగు చేసిన డ్రాగన్ ఫ్రూట్, జమచెట్లు పరిశీలించి వివరాలు తెలుసుకున్నా రు. సంప్రదాయ పంటలు పక్కనపెట్టి… కొందరు రైతులు పండ్ల తోటలతో మంచి లాభాలు పొం దడం చూస్తే సంతోషంగా ఉందన్నారు. మరీ ముఖ్యంగా డ్రాగన్ ఫ్రూట్, తైవాన్ లెమన్, దానిమ్మ, బత్తాయి, మామిడి, జామ, బొప్పాయి వంటి వాటికి ప్రభుత్వం రాయితీ ఇస్తోందని… మార్కెట్లో కూడా వీటికి డిమాండ్ ఎక్కువ ఉందన్నారు. ఈ అనుభవాల నేపథ్యంలో ఉద్యాన పంటలను మరింత ప్రోత్సాహిస్తామన్న చీఫ్‌విప్ జీవీ ఉపాధిహామీ పథకం ద్వారా ఈ రంగంలోని రైతులకు చేయూతనిస్తామన్నారు. తక్కువ నీటి యాజమాన్యంతో ఎర్రనేలల్లో ఈ పంటల సాగు కి బాగా అనువుగా ఉంటుందని తెలిపారు. సీజనల్ పండ్లు పండే విధంగా రైతులు ప్రణాళిక చేసుకుంటే సంప్రదాయ వ్యవసాయం కంటే వీటిపై రైతులకు ఎక్కువ ఆదాయం వస్తుందన్నారు. (Story : ఉద్యాన పంటలకు రాష్ట్రంలో ఇకపై మరింత ప్రోత్సాహం)