Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ప్రభుత్వానికి హెచ్చరికగా ఫిబ్రవరి 5 ఫీజు పోరు

ప్రభుత్వానికి హెచ్చరికగా ఫిబ్రవరి 5 ఫీజు పోరు

ప్రభుత్వానికి హెచ్చరికగా ఫిబ్రవరి 5 ఫీజు పోరు

వైఎస్‌ జగన్‌ పాలనలో విద్యారంగానికి రూ.73 వేల కోట్లు ఖర్చు చేశాం
విద్యార్థులకు తోడుగా ఫిబ్రవరి 5 జిల్లా కేంద్రంలో ర్యాలీ
వైసీపీ జిల్లా అధ్యక్షుడు, జిల్లా పరిషత్ చైర్మన్,
భీమిలి అసెంబ్లీ ఇన్చార్జి. మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను)

న్యూస్‌తెలుగు/ విజయనగరం : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యార్థుల ఫీజులు చెల్లించడం లేదని, వారికి అండగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నిలుస్తుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను)స్పష్టం చేశారు. ప్రభుత్వానికి హెచ్చరికగా ఫిబ్రవరి 5 న జిల్లా కేంద్రంలో ‘ఫీజుపోరు’ చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. సోమవారం వైసీపీ జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ నేతలు మాజీ ఎమ్మెల్యే ఆలజంగి జోగారావు, ముఖ్య నాయకులుతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్న శ్రీను మాట్లాడుతూ పేదరికం అనేది ఉన్నత చదువులకు అడ్డంకి కాకూడదన్న ఆలోచనతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ఈ పథకం వల్ల ఎంతో మంది పేదలు ఇంజనీరింగ్, మెడిసిన్‌ అభ్యసించి జీవితంలో స్థిరపడ్డారని తెలిపారు. వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి సీఎం అయ్యాక 1వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు అమ్మ ఒడి పథకం అమలు చేశారన్నారు. ఉన్నత విద్య అభ్యసిస్తున్న వారి కోసం విద్యాదీవెన, వసతిదీవెన పథకాలు తెచ్చారని చెప్పారు. ఐదేళ్ల జగన్‌ పాలనలో విద్యారంగానికి రూ.73 వేల కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. 2019లో వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యేనాటికి అప్పటి చంద్రబాబు ప్రభుత్వం రూ.1780 కోట్లు ఫీజురీయింబర్స్‌మెంట్‌ బకాయిలు పెట్టిందన్నారు. ఆ బకాయిలను రాజకీయ కోణంలో చూడకుండా చెల్లించిన ఘనత వైఎస్‌ జగన్‌దని తెలిపారు. ఏ ప్రభుత్వాలు మారినా కొన్ని పథకాలకు సంబంధించి బకాయిలు ఉంటాయని చెప్పారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గత ఏడాది మార్చిలోనే రూ.708 కోట్లు విడుదల చేశామని, కానీ అదే సమయంలోనే ఎన్నికల కోడ్‌ రావడంతో చెల్లింపుల ప్రక్రియ నిలిసిపోయిందన్నారు. పోలింగ్‌ తర్వాత కొందరి ఖాతాల్లో జమ అయ్యిందని, అంతలో కూటమి అధికారంలోకి రావడంతో హఠాత్తుగా చెల్లింపులు ఆగిపోయాయన్నారు.రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతోందని, త్వరలోనే అకాడమిక్‌ ఇయర్‌ కూడా ముగుస్తుందన్నారు. ఇప్పటికే చాలా చోట్ల ఫీజుల కోసం కళాశాలల యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నట్లు తెలిపారు. ఇటీవల రూ.700 కోట్లు విడుదల చేస్తామని చెప్పినా ఇప్పటి వరకు ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు. దీని వల్ల కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నారన్నారు. ఫీజు చెల్లిస్తేనే పరీక్షలకు కూర్చొబెడతామని అంటున్నారని ఇప్పటికే ఉత్తీర్ణత సాధించి ఉన్నత చదువుల కోసం ఎదురుచూస్తున్న వారు,ఉద్యోగాలకు ఎంపికైన వారు కూడా సర్టిఫికెట్ల కోసం ప్రదక్షిణలు చేస్తున్నారని తెలిపారు. ప్రతి సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా గ్రీవెన్స్‌లలో విద్యార్థులు వినతిపత్రాలు అందిస్తున్నారన్నారు. విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నా ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి 11 సీట్లే వచ్చినా బలమైన ప్రతిపక్షంగా ప్రజల తరఫున పోరాటం చేస్తామని తెలిపారు. అధికారం మాత్రమే పరమావధిగా చేసుకుని వెళ్లే పార్టీ వైసీపీ కాదని స్పష్టం చేశారు. ఇప్పటికే రైతు సమస్యలు, విద్యుత్‌ చార్జీల పెంపుపై ఆందోళన చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.3900 కోట్లు చెల్లించాలని, ఇదే డిమాండ్‌తో ఫిబ్రవరి 5వ తేదీన విజయనగరం జిల్లా కేంద్రంగా ఫీజు పోరు చేపట్టనున్నట్లు తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు భాగస్వాములు కావాలని, ఎవరూ ఆందోళన చెందొద్దని కోరారు.

సూపర్‌ సిక్స్‌ హామీల అమలుకు ఉద్యమిస్తాం

సూపర్‌ సిక్స్‌ హామీల అమలు కోసం ప్రభుత్వం మెడలు వంచడానికి ఉద్యమిస్తామని మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను)* స్పష్టం చేశారు. చంద్రబాబు సీఎం అయ్యాక పింఛన్లు మాత్రమే అందిస్తున్నారని, అందులోనూ కోతలకు సిద్ధమవుతున్నారని మండిపడ్డారు. ఆర్థిక సమస్యలు అంటూ సూపర్‌ సిక్స్‌ హామీలను ఎగ్గొట్టడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో సూపర్‌ సిక్స్‌ హామీలు ఇచ్చినప్పుడే అప్పటి సీఎం జగన్‌ ఆర్థిక పరిస్థితులను బేరీజు వేసుకుని తాను ఇస్తున్న పథకాల కంటే ఎక్కువగా చంద్రబాబు సంక్షేమ పథకాలను ఇవ్వలేరని చెప్పారని తెలిపారు. కానీ 14 ఏళ్లు సీఎంగా, ఎన్టీఆర్‌ క్యాబినెట్‌లో ఆర్థిక మంత్రిగా పని చేసిన చంద్రబాబుతో పాటు బీజేపీ నేతలు, పవన్‌ కళ్యాణ్‌లు ‘మేమున్నాం సూపర్‌ సిక్స్‌ అమలు చేస్తాం’ అంటూ ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టారని తెలిపారు. ఆ నాడు జగన్‌ అప్పులు చేశారని చెబుతూనే సంపద సృష్టించి సూపర్‌ సిక్స్‌ హామీలు అమలు చేస్తామంటూ చంద్రబాబు అన్నారన్నారు. ఎంతో అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు.. తీరా ఇప్పుడు ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. సమావేశంలో పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు,స్టూడెంట్ వింగ్ అధ్యక్షులు కరుమజ్జి సాయి, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు గదుల సత్యలత, జిల్లా మేధావి వర్గం అధ్యక్షులు శ్రీనివాస కుమార్, ఎస్సీ సెల్ అధ్యక్షులు జై హింద్ కుమార్, జడ్పీటీసీ వర్రి నరసింహ మూర్తి,జడ్పీటీసీ కెళ్ళ శ్రీనివాసరావు,మాజీ డీసీఎంఎస్ చైర్మన్ రమణ రాజు, రాష్ట్ర కార్యదర్శి పులి రాజు, పతివాడ అప్పల నాయుడు, టౌన్ పార్టీ ప్రెసిడెంట్ ఆశపు వేణు, కార్పొరేటర్ రాజేశ్వర రావు, బంగారు నాయుడు, భాను మూర్తి తదితరులు పాల్గొన్నారు. (Story : ప్రభుత్వానికి హెచ్చరికగా ఫిబ్రవరి 5 ఫీజు పోరు)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Jacqueline Fernandez Latest Pics