ఉపాధి హామీ పనుల్లో అపశృతి.. తల్లీకూతురు మృతి
బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం..
– మంత్రులు పొన్నం,సీతక్క..
న్యూస్ తెలుగు/సిద్దిపేట క్రైమ్: సిద్దిపేట జిల్లాలో విషాదం నెలకొంది.వివరాల్లోకి వెళ్ళితే..అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామంలో ఓ ఇద్దరు ఉపాధి హామీ కూలీలు మృతి చెందగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.గ్రామానికి చెందిన కొంత మంది కూలీలు ఉపాధి హామీ పనుల్లో భాగంగా గ్రామ శివారుకు వెళ్లారు. అక్కడ పనులు చేస్తుండగా.. ఉన్నట్టుండి మట్టి దిబ్బ కూలిపోయింది. ఈ మట్టి దిబ్బల కింద పడి ఇద్దరు కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. జేసీబీ సహాయంతో శిథిలాలను తొలగించి, మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఏసీపీ వాసాల సతీష్ వెల్లడించారు. మృతులను కందారపు సరోజన(52), ఆమె కూతురు అన్నాజీ మమత(25)గా గుర్తించినట్లు పేర్కొన్నారు.
బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం..
– మంత్రులు పొన్నం,సీతక్క..
గోవర్ధనగిరి గ్రామంలో మట్టిరోడ్లు మరమ్మతుల పనుల నేపథ్యంలో ఇద్దరి ఉపాధి హామీ కూలీలు మృతి చెందడంతో మంత్రులు పొన్నం ప్రభాకర్,ధనసరి అనసూయ (సీతక్క) తీవ్ర ద్రిగ్బాంతి వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించిన కారణాలపై జిల్లా కలెక్టర్ మను చౌదరితో మాట్లాడారు.
ఉపాధి హామీలో ఇద్దరి మృతికి కారణమైన ఘటనపై జిల్లా అధికారులను విచారణకు ఆదేశించారు. గాయపడిన వారికి నాణ్యమైన వైద్యం అందించాలని సూచించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్, సీతక్క భరోసానిచ్చారు.
( ప్రత్యేక కథనం: న్యూస్ తెలుగు సిద్దిపేట జిల్లా ప్రతినిధి – నారదాసు ఈశ్వర్ )