వైసీపీ హాయంలో రాష్ట్రాన్ని అధోగతి పాలుచేశారు
న్యూస్ తెలుగు /వినుకొండ : అరాచకాలు, దుర్మార్గాలు, అవినీతి, దోపిడీ పాలన సాగించిన వైకాపా ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించినా జగన్ బుద్ధి మారడం లేదని ప్రభుత్వ చీఫ్ విప్ , వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు నిప్పులు చెరిగారు. 2014-19 మధ్య చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి, ఆదాయం, ఉద్యోగాల కల్పనలో నెంబర్-1 గా నిలిపితే, జగన్ ఐదేళ్లలో పదిన్నర లక్షల కోట్లు అప్పులు, అవినీతితో అధోగతి పాల్జేశారని మండిపడ్డారు. ఎన్డీయే ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్ పెట్టి పోయిన రూ.22వేల కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లించామని, అయినా ఇంకా తమపై బురదజల్లాలని చూడడం దుర్మర్గామని చురకలు వేశారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో జివి మాట్లాడుతూ. జగన్ చేసిన అప్పులు, పెట్టిన పెండింగ్ బకాయిల గురించి వివరించారు. సూపర్‌సిక్స్‌లో భాగంగా ప్రకటించిన ప్రతిపథకం అమలు చేస్తామన్నారు. సీఎంగా చంద్రబాబు ఉన్నారుకాబట్టి జగన్ చేసిన ఆర్థిక విధ్వంసాన్ని తట్టుకుని తిరిగి సంక్షేమం, అభివృ ద్ధికి బాటలు వేస్తున్నారన్నారు. జగన్‌కు నిజంగా సిగ్గుశరం ఉంటే.. డిగ్రీ విద్యార్థులకు రూ. 2,832 కోట్లు, చిక్కీలు, కోడిగుడ్లకు రూ.256కోట్లు, వసతి దీవెనకు రూ. 989 కోట్లు, ఆరోగ్య శ్రీకి రూ.1800 కోట్లు, ధాన్యానికి రూ. 1600 కోట్లు, ఉద్యోగులకు రూ.20వేల కోట్లు, సాగునీటి కాంట్రాక్టర్లకు రూ. 19వేల కోట్లు, గృహనిర్మాణానికి రూ. 7,800 కోట్లు, ఉపాధి హామీకి రూ. 2, 100 కోట్లు ఎందుకు బకాయి పెట్టారని నిలదీశారు. జగన్ కేవలం తన స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం సృష్టించాడని, విధ్వంసకర ఆర్థిక విధానాలతో రాష్ట్రాన్ని రుణాల విష వలయంలోకి నెట్టేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ రుషికొండ ప్యాలెస్ కోసం రూ.వందల కోట్లు ఖర్చు పెట్టారని, సొంత పత్రిక, టీవీకి యాడ్లకు, వైకాపా కార్యకర్తలు, సోషల్ మీడియా టీమ్, సాక్షి ఉద్యోగులకు రూ.వేల కోట్లు ఖర్చు పెట్టి దోచుకున్నారని, కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల పిల్లల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఇవ్వలేక పోయారన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, పౌరసేవల సిబ్బందికి నెలల తరబడి జీతాలు చెల్లించకుండా పస్తులు ఉండేలా చేశారని, వైసీపీ కార్యకర్తలు, సోషల్ మీడియా సిబ్బందికి మాత్రం జీతాలు చెల్లించారని, దీనికి ఏమని సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఫలితంగానే రాష్ట్ర బడ్జెట్ మొత్తమే 3 లక్షల కోట్లు అయితే జగన్ చేసిన అప్పులకు ఏడాదికి 71వేల కోట్లు చెల్లించాల్సి వస్తుందని తెలిపారు. తెచ్చిన లక్షల కోట్ల అప్పుల్లోనూ కేవలం కాగితాలపై ఖర్చులు చూపించి దారి మళ్లించు దోచుకున్నారని , అందుకే జగన్‌రెడ్డి చరిత్రహీనుడిగా మిగిలిపోయారని ఎద్దేవా చేశారు. మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పెద్దఎత్తున నిర్వహిస్తూ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోందని, రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఎంతో తాపత్రయ పడుతున్నారని తెలిపారు. దావోస్ యాత్ర చూసిన తర్వాత ప్రతిఒక్కరికీ అర్థమవుతుందని, మన గురించి మనం గొప్పలు చెప్పుకోవడం కాదని, పక్కన ఉన్న తెలంగాణ మంత్రి శ్రీధర్‌బాబు చెబుతున్నారని, ఆయన చెప్పిన వాస్తవాలను తెలుగురాష్ట్రాల్లో ఉన్న ప్రజలంతా గమనిస్తున్నారని జివి అన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జున రావు, టిడిపి పట్టణ అధ్యక్షులు పి. అయూబ్ ఖాన్, మీసాల మురళి యాదవ్ పాల్గొన్నారు. (Story : వైసీపీ హాయంలో రాష్ట్రాన్ని అధోగతి పాలుచేశారు)