UA-35385725-1 UA-35385725-1

పైలట్ గ్రామాల్లో ఫైటింగ్.. ఉన్నోళ్లకే ఇండ్లు

పైలట్ గ్రామాల్లో ఫైటింగ్.. ఉన్నోళ్లకే ఇండ్లు

– పైలట్‌ గ్రామాల్లోనూ పేదలకు అందని ప్రభుత్వ పథకాలు

– ఎంపిక చేసిన వారిలో సింహభాగం అనర్హులే..

– గ్రామసభల్లో పేదలు అభ్యంతరం చెప్పినా పెద్దలకే పైకాల జమలు

న్యూస్ తెలుగు/ సిద్దిపేట జిల్లా ప్రతినిధి:
నాలుగు పథకాల పేరిట కాంగ్రెస్‌ ప్రభుత్వం మరోసారి కూడా నాటకం ఆడినట్లుగానే కన్పిస్తోంది. పథకాల అమలు పేరుతో మాటలు మారుస్తూ, గడువులు పెంచుతూ వచ్చిన రేవంత్‌ సర్కారు.. ఎట్టకేలకు ఈ నెల 26న నాలుగు పథకాల ఫలాలను లబ్ధిదారుల చెంతకు చేరుస్తున్నట్లు ఎంతో ఆర్భాటంగా ప్రకటించింది. అదే రోజున పైలట్‌ గ్రామాల్లో సభలు పెట్టింది. ఎంపిక చేసిన లబ్ధిదారులకు మంజూరు పత్రాలు కూడా అందజేసింది. కానీ వాటికి సంబంధించిన నగదు మాత్రం కొందరికే జమ చేసింది. దీంతో ఓవైపు పైలట్‌ గ్రామాల కింద ఎంపిక కాని లక్షలాది మంది ప్రజల ఆశలపై ఆదిలోనే నీళ్లు చల్లింది. మరోవైపు పైలట్‌ గ్రామాల్లోని లబ్ధిదారుల్లోనూ సింహభాగం మందికి పంగనామాలు పెట్టింది. దీంతో 26న గానీ, ఆ తరువాత గానీ ప్రభుత్వం చెప్పినట్లుగా పథకాల పైకాలు జమ కాని పేదలందరూ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. పైగా పథకాలన్నింటికీ అనర్హులను ఎంపిక చేశారంటూ గ్రామసభల్లో గగ్గోలు పెట్టినా వారికే పథకాల పైకాలను జమ చేయడంతో అర్హులందరూ రగిలిపోతున్నారు.
‘హనుమంతుడి పెళ్లి ఎప్పుడు?’ అంటే ‘రేపే?’ అనే మాదిరిగా.. పాలనా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి పథకాల అమలు గడువును పొడిగించుతూ వచ్చింది కాంగ్రెస్‌ ప్రభుత్వం. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌ కార్డులు, రైతుభరోసా, ఆత్మీయ భరోసా వంటి పథకాలను తమ అధినేత్రి సోనియాగాంధీ పుట్టిన రోజైన, తమ ప్రభుత్వం కొలువుదీరిన డిసెంబర్‌ 9 నుంచి అమలు చేస్తామంటూ ఆరు నెలల క్రితమే ప్రకటించింది కాంగ్రెస్‌ ప్రభుత్వం. ఆ తరువాత ఆ గడువును సంక్రాంతికి పొడిగించింది. ఆ తరువాత దానిని గణతంత్ర దినోత్సవమైన జనవరి 26కు మార్చింది. ఆ తరువాత అర డజను కారణాలు చెబుతూ మార్చి 31 వరకూ మార్చివేసింది.


అనర్హులకే పథకాలు..
– న్యూస్ తెలుగు ఫోకస్: చివరికి మరో మోసానికి తెర తీస్తూ.. జనవరి 26న ఇంకో ప్రకటన చేసింది. మండలానికి ఒక పైలట్‌ గ్రామాన్ని ఎంపిక చేస్తామని, 26న ఆ గ్రామంలోని నాలుగు పథకాల లబ్ధిదారులకు పథకాల ఫలాలను అందజేస్తామని వెల్లడించింది. అర్హుల అభ్యంతరాల మధ్య అనర్హుల పేర్లతో కూడిన జాబితాలనే ఆమోదించింది. వాటిల్లోని అనర్హులకు, అర్హులకే ఆ రోజున మంజూరు పత్రాలు అందించింది. రైతు భరోసా, ఆత్మీయ భరోసా పథకాల లబ్ధిదారులకు (అందులో సింహభాగం అనర్హులే) జనవరి 27న రూ.6 వేల చొప్పున జమ చేసింది. కానీ అందులో చాలామంది నిజమైన లబ్ధిదారులకు పథకాల పైకాలు జమ కాలేదు. న్యూస్ తెలుగు ప్రతినిధి సిద్దిపేట జిల్లా పరిధి క్షేత్రస్థాయి పరిశీలనలో ఇదే విషయం తేటతెల్లమైంది. తమకు అర్హత ఉన్నప్పటికీ, జాబితాలో తమ పేరు ఉన్నప్పటికీ రైతు భరోసా, ఆత్మీయ భరోసా నగదు జమ కాలేదని అనేకమంది పేదలు, లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక తాము నిరుపేదలమైనా తమకు ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌ కార్డులు మంజూరు చేయలేదని వాపోయారు.
నిరుపేదలకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం.. అర్హులెవరికీ ఇవ్వలేదు. పైగా అనర్హులకే ఇచ్చింది. నాలుగు పథకాల్లోనూ (ఇందిరమ్మ ఇళ్లు, ఆత్మీయ భరోసా, రైతుభరోసా, రేషన్‌కార్డులు) అలాగే చేసింది.

అనర్హులకే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారు..
– పొన్నబోయిన శ్రీనివాస్ ( హుస్నాబాద్/ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు)


-పైలట్‌ గ్రామంగా ఎంపిక చేసిన గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లను మాత్రం అనర్హులకే మంజూరు చేశారు. ఏకంగా వారికి మంజూరు పత్రాలను కూడా అందజేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్ నియోజక వర్గ గ్రామాల్లో అర్హులు చాలామంది ఉన్నప్పటికీ వారిలో అత్యధికులకు ఇందిరమ్మ ఇళ్లు రాలేదు. ఉండేందుకు వారికి ఇల్లు కూడా లేదు. సాగుచేసుకునేందుకు సెంటు భూమి కూడా లేదు. కూలీ పనిచేసుకొని బతుకుతున్నా. అయినా ప్రభుత్వం వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయలేదు. గ్రామాల్లో మళ్లీ ప్రభుత్వం పూర్తిస్థాయిలో సర్వే చేసి అర్హులకు మాత్రమే పథకాలు వర్తింపజేయాలి.

ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో పేదలకు అన్యాయం

– మార్కోలం అరుణ – రాజు గౌడ్ ( అక్కన్నపేట )


మాకు పెళ్ళై 10 ఏండ్లు అవుతుంది. ఇద్దరు పిల్లలున్నారు. గుంట జాగా కూడా లేదు.అద్దె ఇంట్లో కాలం వెళ్లదీస్తున్నాం. ఇప్పుడన్నా  ఇల్లు కట్టుకుందామని గత బీఆర్ఎస్‌ పాలనలో ధరఖాస్తు చేసిన.అప్పుడు ఇల్లు కట్టుకొమ్మని మంజూరుపత్రం ఇస్తే దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దుచేసింది.అధికారులు రాసుకుని పోయారు.ప్రజాపాలన పేరుతో మళ్ళీ దరఖాస్తు చేయమంటే చేస్తే వస్తది అనుకున్న. గ్రామసభకు పోతే మా పేరు రాలేదన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం పేదలను మోసం చేసింది. ఇందిరమ్మ ఇండ్ల మంజూరీలో అర్హులను గుర్తించేలా మంత్రి పొన్నం ప్రభాకర్ చర్యలు తీసుకోవాలి. (Story : పైలట్ గ్రామాల్లో ఫైటింగ్.. ఉన్నోళ్లకే ఇండ్లు)

( ✍️ప్రత్యేక కథనం: న్యూస్ తెలుగు/ సిద్దిపేట జిల్లా ప్రతినిధి @ నారదాసు ఈశ్వర్ )

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1