ఉపాధి పనులను మార్చిలోపు పూర్తి చేయాలి
న్యూస్‌తెలుగు/వనపర్తి : జిల్లాలో ఉపాధి హామీలో భాగంగా చేపట్టిన పనులను ఈ ఏడాది మార్చిలోపు పూర్తి చేసి, లక్ష్యాలను సాధించాలని అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంచిత్ గంగ్వార్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఉపాధి హామీ లక్ష్యాలపై ఎంపీఓలు, ఏపీఓలతో డి ఆర్ డి ఓ ఉమాదేవితో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధి హామీలో భాగంగా చేపట్టిన పనులను ఈ ఏడాది మార్చిలోపు పూర్తి చేయాలని ఆదేశించారు. ఉపాధి హామీ కూలీలకు వందరోజుల పని లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. అదేవిధంగా కూలీలకు సమయానుసారంగా పేమెంట్లు పూర్తి చేయడమే కాకుండా, వారితో నిర్దేశించిన పనులను కూడా సక్రమంగా చేయించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏ వారానికి ఆ వారం 100% పేమెంట్లు పూర్తయ్యేలా ఏపీవోలు చర్యలు తీసుకోవాలన్నారు. నర్సరీ పనులు అంతరాయం లేకుండా పూర్తి చేయాలన్నారు. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలకు తప్పకుండా నీరు అందించి సంరక్షించాలని ఆదేశించారు. నర్సరీలకు కూడా పేమెంట్స్ నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో డి ఆర్ డి ఓ ఉమాదేవి, ఎంపీఓలు, ఏపీఓలు హాజరయ్యారు. (Story : ఉపాధి పనులను మార్చిలోపు పూర్తి చేయాలి)