వినుకొండను చంబల్‌లోయగా మార్చిన నీచ చరిత్ర బొల్లాది
వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు
న్యూస్‌తెలుగు/వినుకొండ : వినుకొండ నియోజవర్గాన్ని ఐదేళ్లు చంబల్‌లోయగా మార్చిన నీచ చరిత్ర బొల్లా బ్రహ్మనాయుడుదని అని ధ్వజమెత్తారు ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. ఐదేళ్లు తప్పుడు కేసులు, దొంగతనాలు, హత్యలు, అత్యాచారాలకు వినుకొండను కేరాఫ్‌గా మార్చిన వ్యక్తి ఇప్పుడు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా కనిపిస్తోందంటూ చురకలు వేశారు. రషీద్ హత్య కేసు, వైకాపా వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారంటూ మాజీ ఎమ్మెల్యే బొల్లా శనివారం చేసిన వ్యాఖ్యలపై ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు జీవీ. బొల్లా హయాంలో ఏరోజైనా ప్రజాస్వామ్యాన్ని కాపాడారా అని ప్రశ్నించారు. రైతులపై హత్యాయత్నం కేసులు పెట్టిన నీచ చరిత్ర మరిచిపోయారా అని మండిపడ్డారు. బొల్లా ఒక అరాచకశక్తిగా మారాడు కాబట్టే ప్రజలు ఎవర్నీ ఓడించని మెజార్టీతో ఓడించారన్నారు. నిజానికి రషీద్, జిలానీ ఇద్దరూ ఒకప్పుడు పీఎస్ ఖాన్ అనుచరులు. అనుకోకుండా వారిద్దరి గొడవవస్తే జిలానీ ఇంటిమీద పడ్డారని ఆ సమయంలో జిలానీ లేకపోతే వాళ్ల అన్న జింజానీని కిరాతకంగా కొట్టారు. ఇంట్లో సామాను ధ్వంసం చేశారు. బుల్లెట్ బండి కాల్చేశారు. ఇంతకిరాతకం చేసిన వాళ్లపై కేసులు పెట్టనీయలేదన్నారు. ఆ రోజు సరైన చర్యలు తీసుకుంటే రషీద్ చనిపోయేవాడా జిలానీ జైలుకు పోయేవాడా అని ప్రశ్నించారు. వాటి అన్నింటికీ బొల్లానే కారణం కాదా అని నిలదీశారు. పైగా నాటి జింజానీ ఇంటిపై దాడి కేసులో వాళ్లే లొంగి పోయి, ఇప్పుడు వాళ్లే ఆరోపణలు చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. మొత్తం 22మంది నిందితుల్లో ముందు ఇద్దరు లొంగిపోయి బెయిల్ తెచ్చుకున్నారు. తర్వాత మరో 20మంది లొంగిపోయి, నేరం అంగీకరించి, రిమాండ్‌కు పెట్టమని కోరి ఇప్పుడు ఆరోపణలు చేయడం విచిత్రంగా ఉందన్నారు. తప్పు చేసిన వాడు ఏ పార్టీ అయినా శిక్షించాల్సిందే అని అమయాకులు బలికాకూడదనే తానెప్పుడు ఆలోచిస్తా అన్నారు. తెలుగుదేశం పార్టీ విధానం కూడా అదే అని తెలిపారు. కేసు సజావుగా దర్యాప్తు సాగనిచ్చి ఉంటే అమాయకులు ఉంటే బయటపడేవారు కదా… అందుకు అవకాశం ఇవ్వకుండా 20మంది ఒకేసా రి ఎందుకు లొంగిపోయారో చెప్పాలన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో రౌడీయిజం, గూండాయిజం చేసినా ఉపేక్షించే ప్రసక్తే లేదని, ఉక్కుపాదంతో అణచివేస్తామన్నారు. వల్లెపు శేషమ్మ అనే మహిళను బతికుండగానే చనిపోయినట్లు రికార్డుల్లో రాసేసి పింఛను తీసేశారని, ఇది దుర్మార్గం కాదా అని ప్రశ్నించారు. ఇది అన్యాయమని ఏనాడైనా మాట్లాడారా అని ప్రశ్నించారు. 70 ఏళ్ల వృద్ధురాలిపై అతి కిరాతకంగా మానభంగం చేస్తే ఆరోజు కనీసం పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. అలాంటి బొల్లా బ్రహ్మనాయుడు అధికార పార్టీని నోటికొచ్చినట్లు మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అతడి హయాంలో తప్పుడు కేసులు పెట్టిన దానికి క్షమాపణ చెప్పాలని, ఎంతోమంది తెదేపా కార్యకర్తలపై కేసులు పెట్టించి అన్యాయంగా జైలులో పెట్టించారన్నారు. ప్రజలకు క్షమాపణ చెప్పి తప్పులను సరిదిద్దుకోవాల్సిన బాధ్యత బొల్లాపై ఉందన్నారు. వక్ఫ్ బోర్డు, ముస్లిం మైనార్టీలు, క్రిస్టియన్ల ఆస్తులను కాపాడే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుందన్నారు. ఒక్క సెంటు కూడా అన్యాక్రాంతం కాకుండా ఎన్డీఏ ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతుందన్నారు. గత తెదేపా హయాంలోనూ దోపిడీలను అరికట్టామని, మధ్యలో వైసీపీ పాలన వచ్చినప్పుడు బొల్లా లాంటి వ్యక్తులు ఏబీఎం ఆస్తులను కొల్లగొట్టే ప్రయత్నం చేశారన్నారు. బొల్లా నరసరావుపేటలో ఏబీఎం ఆస్తులను అక్రమంగా ఎందుకు కొన్నారని, కారుచౌకగా ఏబీఎం ఆస్తులను కొట్టేశారని, కాదని చెప్పగలరా? అని ప్రశ్నించారు. తొలుత బొల్లా తన పేరుతో కొని తర్వాత కంపెనీ పేరుపైకి మార్చుకుంది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. క్రిస్టియన్ మైనార్టీల ఆస్తులు దోచుకున్న వ్యక్తి బొల్లా అని ఆరోపించారు. వినుకొండ ఏబీఎం ఆస్తులను కొనడానికి బొల్లా విశ్వప్రయత్నం చేశారని, కుదరకపోవడంతో బురద జల్లుతున్నారని మండిపడ్డారు. తాను ఏనాడు క్రిస్టియన్, మైనార్టీలకు చెందిన సెంటు భూమి కొనలేదన్నారు. బొల్లాకు చిత్తశుద్ధి ఉంటే నరసరావుపేటలో కొనుగోలు చేసిన భూములను వెనక్కి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. బొల్లా కల్లబొల్లి కబుర్లు చెప్పి ఎదుటివారిపై బురదజల్లే కార్యక్రమం పెట్టుకున్నారని, ఎంత బురదజల్లినా ప్రజలు నమ్మేందుకు సిద్ధంగా లేరన్నారు. వినుకొండలో శిలువ పగులగొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించామన్నారు. మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.(Story : వినుకొండను చంబల్‌లోయగా మార్చిన నీచ చరిత్ర బొల్లాది)