జవాబుదారీతనం లేని అధికారులు శంకరగిరి మాన్యాలకే
పంచాయతీరాజ్ అధికారులతో చీఫ్ విప్ జీవీ సమీక్షా సమావేశం
న్యూస్ తెలుగు/వినుకొండ : ప్రజా సమస్యలపై అలసత్వం, విధులు, నిధుల పట్ల జవాబుదారీతనం లేని అధికారులు శంకర గిరి మాన్యాలు పడతారని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు కఠిన హెచ్చరికలు చేశారు. మరీ ముఖ్యంగా పంచాయతీ నిధుల్ని అభివృద్ధి కార్యక్రమాలకే వెచ్చించాలని, ప్రతి ఒక్క రూపాయికి లెక్క ఉండేలా చూడాలని స్పష్టం చేశారు. గురువారం వినుకొండలోని తన కార్యాలయంలో పంచాయతీరాజ్ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు మార్గనిర్దేశం చేశారు. అన్ని మండలాల ఎంపీడీవోలు, ఈవోఆర్డీలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన చీఫ్ విప్ జీవీ గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని, పల్లెలను ప్రగతి సీమలుగా తీర్చిదిద్దేందుకు అధికారులు తమవంతు సహకారం అందించాలని కోరారు. పల్లెల్లోని ప్రతి వీధిలో దీపాలు వెలగాలని, స్వచ్ఛత, పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. ఇంతకు ముందు మాదిరిగా స్థానిక సంస్థల నిధులు మళ్లించేది లేదని, వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, ఆ ఫలితాలన్నీ ప్రజలకు కనిపించాలన్నారు. ఈ విషయంలో ప్రభుత్వ కృషి – ప్రజల అవసరాల మధ్య అధికారులు సంధానకర్తలుగా ఉండి పల్లెల్లో కొత్త వెలుగులు నింపాలని కోరారు. కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి రాష్ట్రంలో ప్రతి పంచాయతీకో కార్యదర్శిని నియమించే విధానాన్ని కూటమి ప్రభుత్వం తీసుకురానుందన్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న 2, 3పంచాయతీలకో కార్యదర్శి ఉండే క్లస్టర్ విధానం రద్దుకానుందని ఆ మేరకు వారిపైనా పనిభారం తగ్గుతుందని సమర్థంగా సేవలు అందించే వీలు కలుగుతుందన్నారు . (Story : జవాబుదారీతనం లేని అధికారులు శంకరగిరి మాన్యాలకే)