ఉచిత పశు వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి
నడిగడ్డలో ఉచిత పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించనున్న
న్యూస్ తెలుగు/వినుకొండ : పశు సంరక్షణ లక్ష్యంగా సోమవారం నుంచి వినుకొండ నియోజకవర్గవ్యాప్తంగా ఉచిత పశు వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. ఈ నెల 20 నుంచి 31 వరకు నిర్వహించనున్న ఉచిత పశువైద్య శిబిరాలను పాడిరైతులు, పెంపకందారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో రోజూ మండలానికి 2 పంచాయతీల్లో పశు వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి పశువులకు వైద్య పరీక్షలు, చికిత్సలు చేసి మందులు అందిస్తామన్నారు. దీంతో పాటు పశు సంవర్ధక శాఖ పరిధిలో అమలు చేస్తున్న వివిధ పథకాలపై పాడి రైతులకు అవగాహన కల్పిస్తారని పేర్కొన్నారు. సోమవారం ఉదయం 8.30 గంటలకు వినుకొండ మండలం నడిగడ్డలో స్వయంగా ఆయనే ఉచిత పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించనున్నారు. పాడి పరిశ్రమకు ప్రోత్సాహం ఇవ్వడానికి ఈ కార్యక్రమం ఎంతో దోహద పడుతుందన్నారు చీఫ్ విప్ జీవీ. అంతేకాక పశు వైద్యం, గర్భకోశ వ్యాధులకు చికిత్స, వ్యాధి నిరోధక టీకాలు, నట్టల నివారణ మందుల పంపిణీ, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, శాస్త్రీయ యాజమాన్యంపై అవగాహన సదస్సులు ఉంటాయని చెప్పారు. మండలానికి రెండు బృందాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి బృందంలో ఒక పశువైద్యాధికారి, పారా వెటర్నరీ సిబ్బంది, గోపాలమిత్ర, పశుసంవర్ధక సహాయకులు, అటెండర్లు పాల్గొంటారన్నారు.(Story : ఉచిత పశు వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి )