గో బ్యాక్ అమిత్ షా
వామపక్షాలు, దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన
చింతూరు ( న్యూస్ తెలుగు): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ పై పార్లమెంట్ లో విద్వేషపూరిత, అనుచిత వ్యాఖ్యలు చేసి అవమానించిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తక్షణమే రాజీనామా చెయ్యాలని, నేడు రాష్ట్ర పర్యటన సందర్బంగా రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో గో బ్యాక్ అమిత్ షా పేరుతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా తూర్పు గోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం నగరంలో స్థానిక గోకవరం బస్టాండ్, అంబేద్కర్ విగ్రహం సెంటర్ లో వామపక్ష పార్టీల నాయకులు, దళిత సంఘాల నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్బంగా సిపిఎం తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి టి.అరుణ్, సీపీఐ (ఎం.ఎల్) న్యూ డెమోక్రసీ నాయకులు జె.సత్తిబాబు, దళిత సంఘాల నాయకులు కోరుకొండ చిరంజీవి, అంబటి సత్యనారాయణలు మాట్లాడుతూ పార్లమెంట్ లో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ పై అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. భారత పార్లమెంట్ వ్యవస్థకు ప్రజా స్వామ్యానికి మూల స్తంభం అయిన డాక్టర్ అంబేద్కర్ అంటే బీజేపీ ఆర్ ఎస్ ఎస్ శక్తులకు ఎంత ద్వేషం ఉందో షా వ్యాఖ్యలు అద్దంపడుతున్నాయని, ఈ శక్తులకు రాజ్యాంగం అన్నా అంబేద్కర్ అన్నా ద్వేషం అని, రాజ్యాంగం బదులు మనుస్మృతి పాలన కోసం రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు. దేవుల్ని నామం స్మరించుకోవటం వల్ల ఎవరికి ఏం జరిగిందో తెలియదు గానీ అంబేద్కర్ వల్ల మోడీ షాలు పార్లమెంట్ లో మాట్లాడగలుగుతున్నారని అన్నారు. కోట్లాది నిమ్న జాతుల ప్రజలు, మహిళలు ఆత్మ గౌరవానికి అంబేద్కర్ ప్రతిబింబం అని, అలాంటి అంబేద్కర్‌ను అవమానించిన షా రాజ్యాంగ పదవిలో కొనసాగడానికి అనర్హుడని అన్నారు. మోడీ షా ను సమర్ధించడాన్ని తీవ్రంగా తప్పు బట్టారు. షా వ్యాఖ్యలపై టీడీపీ, వైసీపీ, జనసేన నాయకులు కనీసం స్పందించలేదని ఆర్. ఎస్. ఎస్ భావజాలానికి దాసోహం అయ్యారని విమర్శించారు. ఓట్లు కోసం అంబేద్కర్ ను ఉపయోగించుకుంటున్న అధికార, ప్రతిపక్షాలు అంబేద్కర్ ను అవమానిస్తే ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. మునుధర్మ శాస్త్రాన్ని తగాలబెట్టి 95 శాతం ప్రజలకు రాజ్యాంగం ద్వారా హక్కులు కల్పించిన అంబేద్కర్ ను ప్రజలందరూ హక్కులు పొందిన ప్రతి సందర్బంలో అంబేద్కర్ ను స్మరించుకుంటారని దానిని ఎవ్వరు నిలువరించలేరని అన్నారు. అమిత్ షా అంబేద్కర్ కు క్షమాపణ చెప్పి, తక్షణమే రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి.పవన్, పి.తులసి, జిల్లా కమిటీ సభ్యులు కర్రి. రామకిష్ణ, పూర్ణిమరాజు, రాజా, నాయకులు ఎస్. ఎస్. మూర్తి, పి.మురళి, తాతారావు, కాంతారావు, పడాల. రామకృష్ణ, భాస్కర్, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పి లావణ్య , సీపీఐ నగర కార్యవర్గ సభ్యులు టి నాగేశ్వరరావు, ఏ ఐ వై ఎఫ్ జిల్లా నాయకులు త్రిమూర్తులు కొండవతి,సిపిఐ ఎం ఎల్ న్యూ డెమోక్రసీ జె.సత్తిబాబు, దళిత సంఘాల నాయకులు కోరుకొండ చిరంజీవి, అంబటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. (Story: గో బ్యాక్ అమిత్ షా)