వడ్డే ఓబన్న జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం
న్యూస్‌తెలుగు/వనపర్తి : మహనీయులు వడ్డే ఓబన్న జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు జిల్లెల చిన్నారెడ్డి అన్నారు.
శనివారం వడ్డె ఓబన్న జయంతి వేడుకల సందర్భంగా జిల్లా కలెక్టరేట్లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి పాల్గొన్నారు.
అనంతరం వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ స్వాతంత్య్ర ఉద్యమంలో భాగంగా వడ్డే ఓబన్న నిర్వహించిన పాత్ర, ఆయన జీవిత చరిత్ర ప్రాధాన్యతను తెలియజేశారు . తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడైన వడ్డే ఓబన్న జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందని, ఆయన అందించిన స్ఫూర్తిని అందరూ స్మరించుకోవాలన్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి ప్రధాన సహచరుడిగా బ్రిటిష్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా చేసిన పోరాటంలో ఆయన పోషించిన పాత్ర చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఆనాటి కాలంలోనే ఆయన నిస్వార్ధంగా మంచి విలువలను పాటిస్తూ దేశం కోసం పోరాటం చేశారని అన్నారు. ఓబన్న నిరంతరం కష్టపడే తత్వంతో జీవితాంతం చెడుపై పోరాటం చేస్తూ గడిపారని ఆయన చేసిన సేవలను గుర్తు చేసు కోవాలని తెలిపారు. వడ్డెరల అభివృద్ధికి ఎల్లవేళలా సహకారం ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో వడ్డెరల సంఘం జిల్లా నాయకులు దాసర్ల భూమయ్య, తిరుపతయ్య, తహసిల్దార్ రమేష్ రెడ్డి, వడ్డెర సంఘం నాయకులు, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు. (Story : వడ్డే ఓబన్న జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం)