గీతమ్స్ లో ఘనంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు
న్యూస్ తెలుగు /వినుకొండ : స్థానిక సిద్ధార్థ నగర్ లోని గీతమ్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు ముందస్తు సంక్రాంతి సంబరాలు శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గీతమ్స్ విద్యాసంస్థల కరస్పాండెంట్ మాలపాటి కోటిరెడ్డి హాజరయ్యారు. ముందుగా చిన్నారులను భోగి పండ్లు పోసి ఆశీర్వదించారు. అనంతరం ముగ్గుల పోటీలు నిర్వహించి గెలుపొందిన విజేతలకు బహుమతి ప్రధానం చేశారు. పాఠశాలలో ఏర్పాటుచేసిన బొమ్మల కొలువు, హరిదాసు వేషధారణ విశేషంగా అలరించాయి. ఈ సందర్భంగా కరస్పాండెంట్ మాలపాటి కోటిరెడ్డి మాట్లాడుతూ. రైతులు కష్టపడి పండించిన పంట ఇళ్లకి చేరే సమయం ఇది. ధాన్యలక్ష్మికి స్వాగతం చెప్పేందుకు ఇంటి ముందు అందమైన రంగవల్లులు దర్శనమిస్తాయి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ముగ్గుల్లో గొబ్బెమ్మలను పెట్టి పూలతో అలంకరించి పాటలు పాడతారని తెలిపారు. ప్రస్తుత రోజుల్లో ఈ సాంప్రదాయాలు ఎక్కువగా పాటించకపోయినా కానీ కనుమరుగు మాత్రం కాలేదు. ఇప్పటికీ కొన్ని పల్లె ప్రాంతాల్లో హరిహర దాసులు ఇంటింటికీ తిరుగుతూ హరికథలు పాడుతూ ఉంటారు. జానపదులకి ఈ పండుగ చాలా ముఖ్యమైనది. సంక్రాంతి పండుగ వేడుకల్లో చెప్పుకోదగిన మరొకటి గంగిరెద్దుల ఆట. ఈ సంప్రదాయం నేడు పట్టణ ప్రాంతాలలోనూ కనబడుతూనే ఉంది. ఇది అతి ప్రాచీనమైన కళగా భావిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్, ప్రిన్సిపల్స్, విద్యార్థిని విద్యార్థులు, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. (Story : గీతమ్స్ లో ఘనంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు)