మానవత్వం మరిచి విషాద ఘటనపై క్షుద్ర రాజకీయమా?..
చీఫ్ విప్ జీవీ ఆంజనేయుులు
న్యూస్‌తెలుగు/వినుకొండ : తిరుమలలో జరిగిన విషాద ఘటనపై మానవత్వం మరిచి విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నాయకులు క్షుద్ర రాజకీయం చేస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయుులు మండిపడ్డారు….. శవం కనిపిస్తే చాలు రాబందులా వాలిపోవడం ఒకటే అతడికి తెలిసిన రాజకీయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్థమాతో బాధపడుతున్న ఒక మహిళ ప్రాణం కాపాడాలని గేట్లు తెరిచిన సమయంలో దురదృష్టవశాత్తు చోటుచేసుకున్న తొక్కిసలాటను చిలువలు పలువుగా చేసి, రాజకీయ స్వార్థం కోసం రాద్ధాంతం చేయడం జగన్‌కు తగదని హితవు పలికారు. జరిగిన దుర్ఘటన అందర్నీ కలచి వేసిందని, అటు తితిదే, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా వేగంగా స్పందించి చర్యలు తీసుకోవడంతో పాటు బాధిత కుటుంబాలకు పరిహారం కూడా ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తిరుమల తొక్కిసలాటకు సంబంధించి గురువారం విడుదల చేసిన ప్రకటనలో వైకాపా, జగన్ తీరును తీవ్రంగా తప్పుబట్టారు చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు. స్వల్ప వ్యవధిలోనే ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి కూడా తిరుపతికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారని, తిరుమలలో ఎలాంటి ప్రమాదాలు, అవాంఛిత ఘటనలు జరగకూడదనే ప్రభుత్వం, తితిదే ఆలోచనగా చెప్పిన జీవీ జగన్ శవ రాజకీయాలు మాత్రం మానుకోవాలని సూచించారు. జగన్, వైపాకా నేతల స్పందనలో బాధితులపై పట్టింపు కంటే రాజకీయంగా బురదజల్లాలన్నదే వారి ఉద్ధేశంగా కనిపిస్తోందని వాపోయారు. ఊహాగానాలు, దుష్ప్రచారాలు కాకుండా విషాదానికి దారి తీసిన వాస్తవ పరిస్థితులను ప్రత్యక్ష సాక్షుల ద్వారా కూడా సీఎం చంద్రబాబు తెలుసుకున్నారని జీవీ ఆంజనేయులు తెలిపారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని చెప్పారు. (Story ; మానవత్వం మరిచి విషాద ఘటనపై క్షుద్ర రాజకీయమా?:)