రహదారి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత
న్యూస్‌తెలుగు/వనపర్తి : జిల్లాలో ప్రతి ఒక్కరికి రోడ్డు భద్రత పై అవగాహన కల్పించే విధంగా జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదర్ష్ సురభి ఆదేశించారు. జనవరి నెలను జాతీయ రోడ్డు భద్రత మాసంగా ప్రకటించిన నేపథ్యంలో మంగళవారం కలెక్టర్ ఛాంబర్ లో రోడ్డు భద్రత కు సంబంధించిన పోస్టర్లను అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంచిత్ గంగ్వార్, జిల్లా అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రహదారి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పారు. బైక్ పై వెళ్లేటప్పుడు హెల్మెట్, కారులో వెళ్లేటప్పుడు సీట్ బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలన్నారు.
జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా జనవరి 8న సాయంత్రం నాలుగు గంటలకి కలెక్టరేట్ ఐడిఓసి నుంచి భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నల్ల చెరువు వరకు చేరుకొని ర్యాలీ ముగిస్తుందని చెప్పారు. అందరికీ రోడ్డు భద్రత అవగాహన కల్పించేలా ప్రజలు, యువత బైకు హెల్మెట్ తో ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. వనపర్తి జిల్లాను యాక్సిడెంట్స్ రహిత జిల్లా గా తీర్చిదిద్దడంలో భాగస్వాములు కావాలని చెప్పారు. సమావేశంలో జిల్లా రవాణా శాఖ అధికారి మానస, డిపిఆర్ఓ సీతారాం, డివైస్ ఓ సుధీర్ రెడ్డి, డిఇఓ అబ్దుల్ ఘని, ఇండస్ట్రీస్ అధికారి నగేష్, తదితరులు పాల్గొన్నారు. (Story : రహదారి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత)