హామీల అమలు గురించి మాట్లాడే నైతిక అర్హత వైకాపాకు లేదు
బొల్లాపల్లిలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ప్రజా దర్బార్‌కు విశేష స్పందన
న్యూస్ తెలుగు /వినుకొండ : రాష్ట్రంలో మేనిఫెస్టోలు, హామీల అమలుపై మాట్లాడే నైతిక అర్హత జగన్, వైకాపాకు లేదని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మండిపడ్డారు . హామీలు ఇవ్వాలన్న అమలు చేయాలన్న అది సీఎం చంద్రబాబు, ఎన్డీఏ ప్రభుత్వానికే చెల్లుతుందని స్పష్టం చేశారాయన. మొన్నటి ఎన్నికల్లో కూటమి ఉమ్మడి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో ఇప్పటికే కొన్ని అమల్లోకి వచ్చాయని, చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తొలిరోజే రూ.3 వేలు ఉన్న పింఛను రూ. 4వేలు చేసిన చరిత్ర తమదన్నారు. జగన్‌లా 250 చొప్పున పెంచుకుంటూ 4ఏళ్లు సాగదీయలేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షలమందికి పింఛన్లు ఠంఛనుగా పింఛను అందిస్తామని గర్వంగా చెప్పగలమన్నారు. బొల్లాపల్లి ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో సోమవారం ప్రజా దర్బార్‌లో చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు. అర్జీదారుల సమస్యలు వింటూ వినతులు స్వీకరించి భరోసా కల్పించారు. వివిధ సమస్యలపై 236 మంది అర్జీలు అందచేయగా ఆయన వాటిని ఓపికగా పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని, అర్జీలు తిరిగి రాకుండా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన జీవీ ఇచ్చిన మాట ప్రకారం మహిళలకు ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, అన్న క్యాంటీన్ల పునఃప్రారంభం, ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్, చెత్తపన్ను రద్దు వంటివన్నీ అమలయ్యాయా లేదా అని ప్రశ్నించారు. ఈ జూన్ లోపే ఇంట్లో ఎంతమంది బడికి వెళ్తే అంతమందికి రూ.15 వేల చొప్పున తల్లికి వందనం అంది తీరుతుందని తెలిపారు. అలానే ఏప్రిల్ 1 నుంచి కోటి 43 లక్షల పేద కుటుంబాలకు 25 లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పించే పథకాన్ని అమలుచేయబోతున్నామని తెలిపారు. పోలవరం నిర్వాసితులపై ఇప్పుడు మాట్లాడుతున్న జగన్ తన ఐదేళ్ల పాలనలో ఏం చేశారని నిలదీశారు. చంద్రబాబు సీఎం అయిన 6 నెలల్లో పోలవరం నిర్వాసితులకు దాదాపు 1000 కోట్లు పరిహారం వారి ఖాతాల్లో జమ చేశారని, నిర్వాసితుల్లో ఒక్కొక్క కుటుంబానికి అర్హతలను బట్టి 10 లక్షల నుంచి 40 లక్షల వరకు పరిహారం అందించి ఆదుకున్నారని పేర్కొన్నారు. జగనన్న కాలనీలు కట్టిస్తామని, ఏడాదికి 5 లక్షల ఇళ్లు నిర్మించి ఇస్తామని, ఐదేళ్లలో 25 లక్షల ఇళ్లు నిర్మిస్తామని చెప్పారని, కనీసం ఊరికి 25 ఇళ్లు కట్టించలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో ఎక్కడైనా ఒక్క రోడ్డు అయినా వేశారా అని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ నిధులను కూడా దుర్వినియోగం చేశారని, ఒక్కరికి కూడా రాయితీపై రుణాలు ఇవ్వలేదని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీలు సహా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన జగన్‌రెడ్డికి తెదేపా, ఎన్డీఏ ప్రభుత్వ మేనిఫెస్టో గురించి మాట్లాడే నైతిక అర్హత ఉందా అని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో గ్రామాల అభివృద్ధికి బాటలు వేస్తున్నారని, గ్రామసీమల అభివృద్ధికి రూ.4,600 కోట్లు ఇచ్చారని, ఆనాడు జగన్ పాలనలో స్థానిక సంస్థల నిధులను కూడా పక్కదారి పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. (Story : హామీల అమలు గురించి మాట్లాడే నైతిక అర్హత వైకాపాకు లేదు)