నిత్యవసర సరుకుల ధరలు తగ్గించాలి
ప్రజాతంత్ర మహిళా సంఘం
న్యూస్ తెలుగు / వినుకొండ : పెరుగుతున్న నిత్యవసర ధరలతో మహిళలు ఇబ్బందులు గురవుతున్నారని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా )రాష్ట్ర కమీటీ సభ్యురాలు గద్దె ఉమశ్రీ అన్నారు. స్థానిక పుతుంబాక వెంకటపతి భవన్ సిపిఎం కార్యాలయంలో మహిళా సంఘం సమావేశం ఐద్వా పల్నాడు జిల్లా అధ్యక్షురాలు ఎస్.కె రంజాన్ బి అధ్యక్షతన శనివారం జరిగింది. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఉమశ్రీ మాట్లాడుతూ పెరుగుతున్న నిత్యావసర ధరలను అదుపు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు. దీనివల్ల మహిళలు ఒత్తిడికి గురవుతూ మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. దీనితోపాటు పెరిగిన విద్యుత్ ఛార్జీల వలన పేద కుటుంబాలు అప్పుల ఊబిలోకి నెట్టబడ్డారని అన్నారు. రోజువారి కుటుంబాలు గడుపుకోవటం కోసం అప్పులు చేయాల్సి వస్తుందని, వారాల వడ్డీలకు డబ్బులు తీసుకొని ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా అభ్యున్నతి కోసం కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మహిళలకు కుర్చీల ఆటల పోటీలు నిర్వహించి బహుమతులను పంపిణీ చేశారు. ఐద్వా పల్నాడు జిల్లా కార్యదర్శి జి రజని, సీఐటీయూ అధ్యక్షురాలు ఎం తిరుమలలక్ష్మి, నాసర్ బీ, కోటమ్మ, సారమ్మ, కృష్ణ వేణి, పద్మ, శివమ్మ, భాషాబిలు పాల్గొన్నారు. (Story : నిత్యవసర సరుకుల ధరలు తగ్గించాలి)