Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ వచ్చే ఏడాదికి బాలికల జూనియర్ కళాశాల సాలూరులో ఏర్పాటు చేస్తాం

వచ్చే ఏడాదికి బాలికల జూనియర్ కళాశాల సాలూరులో ఏర్పాటు చేస్తాం

0

వచ్చే ఏడాదికి బాలికల జూనియర్ కళాశాల సాలూరులో ఏర్పాటు చేస్తాం

మంత్రి సంధ్యారాణి

న్యూస్ తెలుగు/ సాలూరు : పట్టణంలో వచ్చే ఏడాది విద్యాసంవత్సరం నాటికి బాలికల జూనియర్ కళాశాల ఏర్పాటు చేసి విద్యార్థినులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు రాష్ట్ర మహిళా శిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. శనివారం సాలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ ఇంటర్ విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకాన్ని జిల్లా కలెక్టర్ తో కలసి జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆర్థికపరమైన ఇబ్బందులు, పౌష్టికాహార లోపం కారణంగా ఉన్నత చదువులకు దూరం కాకుండా డ్రాపౌట్స్ ను తగ్గించాలన్న ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలుకు శ్రీకారం చుట్టిందన్నారు. విద్యార్థి దశ నుంచే మంచి ఆహార అలవాట్లు కూడా అలవడి పౌష్టికాహార లోపం తలెత్తదన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, మంచి ఆరోగ్యంతో అందరికీ ఉన్నత చదువుల అవకాశాన్ని కల్పించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లక్షా 48 వేలమంది విద్యార్థులకు ఉచిత మధ్యాహ్న భోజనం పథకాన్ని అందించనున్నామని, ఈ పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.28 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. జిల్లాలో ఉన్న 14 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 5800 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు
చేయనున్నామన్నారు. విద్యార్థుల ఆహారాలవాట్ల ప్రకారం జోనువారీగా మధ్యాహ్నం భోజన పథకం అందించనున్నామన్నారు. కేజీ నుండి పీజీ వరకు నాణ్యమైన విద్య, అవసరమైన రక్షణ కల్పించేందుకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక దృష్టి సారించారన్నారు. అలాగే విద్యార్థులు ఎన్ఐటి, ఐఐటి, ఇంజనీరింగ్ కళాశాలలో సీట్లు సాధించేలా ఐఐటి నుండి మంచి నిష్ణాతులైన లెక్చలర్లను రప్పించి పదో తరగతి, ఇంటర్ విద్యార్థులకు సబ్జెక్టులలో శిక్షణ అందించడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మనబడి మన భవిష్యత్తు కార్యక్రమం కింద ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించి విద్యార్థుల బంగారు భవితకు బాటలు వేస్తున్నారని స్పష్టం చేశారు. ప్రభుత్వ బడుల్లో విద్యను అభ్యసించి తను రాష్ట్ర మంత్రి స్థాయికి చేరుకున్నామని, జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్ హోదాలో పనిచేస్తున్న వారు ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఇంతటి స్థాయికి వచ్చారని గుర్తుచేస్తూ విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపారు. ఏకాగ్రత, లక్ష్యాన్ని సాధించాలన్న కార్యదీక్షతో విజయాలను సొంతం చేసుకోవాలని ఆమె ఆకాంక్షించారు. విద్యార్థులు మాదకద్రవ్యాలు గంజాయి వంటి చెడు వ్యాసనాలకు దూరంగా ఉండాలని బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని హితవుపలికారు. ఇష్టంగా చదివి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని పునరుద్ఘాటించారు.

జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ డొక్కా సీతమ్మ వంటిమహానీయుల పేరున మధ్యాహ్న భోజన పథకం అమలు చేయడం అందరికి గర్వకారణం అన్నారు. గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం పథకం ద్వారా బలవర్థక పౌష్టికాహారాన్ని అందించడం వలన పూర్తిస్థాయిలో చదువుపై దృష్టిసారించవచ్చన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం మెనూలో మార్పులు తీసుకువచ్చిందని విద్యార్థుల ఇష్టం మేరకు ఆయా మెనూ లను అమలు చేయనున్నామని తెలిపారు. పదవ తరగతిలో జిల్లా మొదటి స్థానంలో నిలిచిన విధంగా ఇంటర్మీడియట్ లోనూ జిల్లా మొదటి స్థానంలో నిలవాలన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.అనంతరం డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనం పథకంలో భాగంగా విద్యార్థులకు రాష్ట్ర మంత్రి, జిల్లా కలెక్టర్ స్వయంగా భోజనాన్ని వడ్డించారు. అలాగే విద్యార్థులు మధ్య నేలపై కూర్చుని సహపంక్తి భోజనాన్ని చేసారు.అంతకుముందు పలువురు విద్యార్థులు గంజాయి, డ్రగ్స్ వాడకం వలన కలిగే దుష్ప్రభావాలను, విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న స్కూల్ బ్యాగ్స్, నోట్ పుస్తకాలు, సానిటరీ ప్యాడ్స్ వంటి సౌకర్యాలపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో పార్వతీపురం సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా వృత్తి విద్య అధికారి వి. మంజులా వీణా, కళాశాల ప్రిన్సిపల్ బి. మురళీధర్, కళాశాల అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు. (Story : వచ్చే ఏడాదికి బాలికల జూనియర్ కళాశాల సాలూరులో ఏర్పాటు చేస్తాం )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version