సావిత్రిబాయి పూలే స్ఫూర్తితో మహిళలు సమాజం కోసం పనిచేయాలి
న్యూస్ తెలుగు /వనపర్తి : సంఘసంస్కర్త సావిత్రిబాయి పూలే స్ఫూర్తితో సమాజ మార్పు, మహిళల అభ్యున్నతికి కృషి చేయాలని భారత జాతీయ మహిళా సమాఖ్య (NFIW) ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షురాలు ఈ కళావతమ్మ పిలుపునిచ్చారు. శుక్రవారం సిపిఐ ఆఫీసులో ఎన్ఎఫ్ఐ డబ్ల్యు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 194వ జయంతి వేడుకలను నిర్వహించారు. చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కళావతమ్మ మాట్లాడుతూ.. 1848లో పూణేలో తొలి బాలికల పాఠశాలను ఏర్పాటు చేసి దేశంలోని తొలి మహిళా టీచర్ గా చదువులు చెప్పారన్నారు. 20 పాఠశాలలు స్థాపించి దళితులు బాలికల విద్య కోసం కృషి చేశారన్నారు. స్త్రీ విద్య ద్వారా దేశ పురోగతి సాధ్యమవుతుందని భావించారన్నారు. కుల వివక్ష, అంటరానితనం, మూఢనమ్మకాలు, స్త్రీ విద్య కోసం ఎన్నో అవాంతరాలను ఎదుర్కొని పనిచేశారని ఆమె ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం జనవరి 3 ఆమె జన్మదినం సందర్భంగా రాష్ట్ర మహిళా ఉపాధ్యాయ దినోత్సవం గా ప్రకటించటం హర్షనీయమన్నారు. సిపిఐ జిల్లా నేత గోపాలకృష్ణ సావిత్రిబాయి పూలే చరిత్రను వివరించారు. వనపర్తి పట్టణ కన్వీనర్ జయమ్మ కో కన్వీనర్ శిరీష, నాయకులు జయశ్రీ, శ్రీదేవి, జ్యోతి, నాగమణి, సిపిఐ పట్టణ కార్యదర్శి రమేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీ రామ్, శ్రీహరి, గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.(Story : సావిత్రిబాయి పూలే స్ఫూర్తితో మహిళలు సమాజం కోసం పనిచేయాలి )