కార్యకర్తల శ్రమ, ప్రజల అభిమానానికి నిదర్శనం లక్ష సభ్యత్వాలు
వినుకొండలో లక్ష దాటిన తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు
న్యూస్ తెలుగు / వినుకొండ : కార్యకర్తల రాజీలేని శ్రమ, ప్రజల్లో రోజురోజుకీ పెరుగుతున్న ఆదరణ, అభిమానాలకు నిదర్శనమే నియోజకవర్గంలో లక్ష సభ్యత్వాల మార్కు దాటిందని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం బావుంటుంది, అందుకు తెలుగుదేశం పార్టీ బలంగా నిలబడాలనే ప్రజల ఆకాంక్ష సభ్యత్వాల రూపంలో ప్రతిఫలిస‌్తుండడం గర్వంగా అనిపిస్తోందన్నారు. అక్టోబర్ 26వ తేదీన ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదులు మొదట్నుంచీ వినుకొండ నియోజవర్గం దూకుడును ప్రదర్శిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా టాప్-10లో ఉంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ క్రమంలోనే సోమవారం నాటికి నియోజక వర్గంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వాల నమోదు లక్షా 4వేలకు చేరుకుంది. అందులో 25 జీవిత కాల సభ్యత్వాలు కూడా ఉన్నాయి. సోమవారం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఏడుగురు తెలుగుదేశం పార్టీ నాయకులు రూ.లక్ష చొప్పున చెల్లించి జీవీ ఆంజనేయులు చేతుల మీదుగా శాశ్వత సభ్యత్వాలు పొందారు. నూజెండ్ల మండలం పాతచెరుకుంపాలేనికి చెందిన జడ్డా రామయ్య, కమ్మవారిపాలేనికి చెందిన గంగినేని రాధాకృష్ణమూర్తి, ఈపూరు మండలం గుండేపల్లికి చెందిన జాగర్లమూడి నాగేశ్వరరావు, అబ్బూరి శ్రీనివాసరావు, అబ్బూరి ప్రశాంత్, బొగ్గరం గ్రామానికి చెందిన మోతుకూరి శ్రీనివాసరావు, నందిగం వెంకటకోటయ్య శాశ్వత సభ్యత్వం స్వీకరించారు. అనంతరం చీఫ్ విప్ జీవీ మాట్లాడుతూ. సభ్యత్వ నమోదు రికార్డుపై హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్ర బాబు, యువనేత మంత్రి లోకేష్ ఇచ్చిన పిలుపు మేరకు ఇంత భారీ ఎత్తున సభ్యత్వాలు నమో దు చేయగలిగినందుకు ఎంతో సంతృప్తిగా ఉందన్నారు. అధిష్ఠానం అండతో పాటు స్థానికంగా పార్టీ నాయకులు, కార్యకర్త అహర్నిశల కృషి, నిబద్ధత, పార్టీ పట్ల ఉన్న అంకితభావంతో ఇది సాధ్యమైందన్నారు. కార్యకర్తలను కుటుంబసభ్యులుగా భావించే పార్టీ తెలుగుదేశం మాత్రమేని, దేశంలో కార్యకర్తలకు బీమా అందిస్తున్న పార్టీ కూడా తమదే అని గర్వంగా చెప్పగలమన్నారు. (Story : కార్యకర్తల శ్రమ, ప్రజల అభిమానానికి నిదర్శనం లక్ష సభ్యత్వాలు)