అన్ని పోటీ పరీక్షలూ ఆఫ్‌లైన్లోనే..
నిర్ణీత సమయంలో జాబ్ క్యాలెండరు
గ్రూప్1, 2 ఎంపికలో సంస్కరణలు
ఏపీపీఎస్సీ సంస్కరణల కమిటీ నివేదిక
న్యూస్ తెలుగు/అమరావతి : వివిధ ప్రభుత్వ శాఖల్లో నిర్వహించే అన్ని పోటీ పరీక్షలను ఆఫ్‌లైన్లోనే నిర్వహించాలని, ఆన్‌లైన్ విధానం ఒద్దు అని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) ఏపీపీఎస్సీ ఏర్పాటు చేసిన సంస్కరణ కమిటీ నిర్ణయించింది. ఆ దిశగా ప్రభుత్వానికి నివేదించింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ఏపీపీఎస్సీ చైర్మన్‌గా అనురాధాను నియమించారు. గత ప్రభుత్వ పాలనలో ఏపీపీఎస్సీలో ఎదురైన అనేక సమస్యల్ని దృష్టిలో ప్రభుత్వం గుర్తించింది. ఆ మేరకు ఒక సంస్కరణల కమిటీని ఏర్పాటు చేసింది.ఈ సంస్కరణల కమిటీకి వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ చైర్మన్‌గాను, సాధారణ పరిపాలనశాఖ కార్యదర్శి పోలా భాస్కర్ కన్వీనర్‌గా ఉన్నారు. మరో ఐదుగురు ఐఏఎస్ అధికారులు సభ్యులుగా ఇందులో ఉన్నారు. ప్రతి ఏడాది ప్యానల్ ఇయర్‌ను సెప్టెంబరు 1 నుంచి ప్రారంభించాలని, దాని ప్రకారం ఆగస్టు 31నాటికి ప్రభుత్వ శాఖల యూనిట్ ఆఫీసర్లు ఖాళీల వివరాలను ఆన్‌లైన్ ద్వారా పంపాలని పేర్కొంది. మంజూరైన పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ అనుమతి లేకుండానే..జూన్ నుంచి కసరత్తు ప్రారంభించాలని, ఇందుకు అనుగుణంగా ఏపీపీఎస్సీ జాబ్ క్యాలెండరును ఖరారు చేయాలని సూచించింది. మరుసటి సంవత్సరం డిసెంబరులోగా ఆయా నియామకాలు పూర్తి కావాలని వివరించింది. ఇక కమిషన్ ఎంపికచేసే అభ్యర్థులకు మార్చిలోగా నియామక ఉత్తర్వులు ఇవ్వాలని నివేదికలో పేర్కొంది. మౌఖిక పరీక్షలో మార్కులు 80శాతం దాటితే కారణాలు రికార్డులో నమోదుచేయాలని, మౌఖిక పరీక్షకు 15 నిముషాల ముందే పాల్గొనేవారికి..ఏ బోర్డుకు వెళ్లాలో చెప్పేలా సాఫ్ట్‌వేర్ ర్యాండమైజేషన్ విధానాన్ని తీసుకురావాలని సూచించింది. అనంతరం మెయిన్, మౌఖిక పరీక్షల్లో వచ్చిన మార్కులను కలిపి మెరిట్ జాబితా ప్రకటించాలని, ఈ విధానాల ద్వారా పారదర్శకత పెరుగుతుందని నివేదికలో తెలిపింది. ప్రభుత్వశాఖల్లో ప్రస్తుతం కొన్ని శాఖలు వాటికవే నియమించుకుంటున్నాయని, ఇక నుంచి ఆ తరహాగా నిర్వహణకు వీలులేదని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని మొత్తం 272 రకాల పోస్టులను నాన్ టెక్నికల్, టెక్నికల్ సర్వీసెస్ కేటగిరీలుగా విభజించి, నియామకాలు చేపట్టాలని భావిస్తోంది. నాన్-టెక్నికల్ విభాగంలో గ్రూప్1, గ్రూప్ 2, సర్వీసెస్ పోస్టులను చేర్చింది. టెక్నికల్ సర్వీసెస్‌లో ఏ, బీ, సీ కేటగిరీల కింద ఇంజినీరింగ్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులను ఉంచాలని సూచించింది. ఏపీ టీచింగ్ సర్వీసెస్‌లో ఏ, బీ కేటగిరీల వారీగా, ఏపీ టెక్నికల్ సర్వీసెస్‌లో ఇతర పోస్టుల భర్తీ చేపట్టాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేసింది.
అన్ని పోటీ పరీక్షలకూ ఏపీపీఎస్సీ ద్వారానే..
రాష్ట్ర ప్రభుత్వం అధ్వర్యంలోని వివిధ శాఖల్లో నియామక పరీక్షలన్నింటినీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ద్వారానే నిర్వహించాలని ప్రత్యేక కమిటీ తన నివేదికలో స్పష్టం చేసింది. ఆ దిశగా ప్రభుత్వానికి తన తుది నివేదికను స్పష్టం చేసినట్లు సమాచారం. ఏపీపీఎస్సీ ద్వారా గ్రూప్`1, గ్రూప్`2, గ్రూప్`3, జేఎల్- డీఎల్ అధ్యాపకులు, ఇంజినీరింగ్, ఇతర పోస్టుల భర్తీ ప్రక్రియను వేర్వేరుగా నిర్వహిస్తున్నారు. ఏపీపీఎస్సీ ద్వారా జరిగే నియామకాలు, పరీక్షా విధానం, ప్రతిపాదనల్లో ఉన్న పోస్టుల రీ-గ్రూపింగ్, ఇతర అంశాలపై కమిటీ అధ్యయనం చేసింది. దీనికోసం దిల్లీలోని యూపీఎస్సీ, రాజస్థాన్, కేరళ, బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లను సందర్శించి, అక్కడి కార్యకలాపాల తీరును సమీక్షించింది. వాటి ఆధారంగా ఏపీపీఎస్సీలో తీసుకురావాల్సిన సంస్కరణలపై తుది నివేదికను రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించినట్లు సమాచారం. (Story : అన్ని పోటీ పరీక్షలూ ఆఫ్‌లైన్లోనే..)