విద్యుత్ ఛార్జీలు పెంచిన వాళ్లే ధర్నాలు
చేయడం హాస్యాస్పదం
జనసేన నేత గురాన అయ్యలు
న్యూస్‌తెలుగు/విజయనగరం : వైసీపీ పెంచిన విద్యుత్ ఛార్జీలకు వాళ్లే ధర్నాలు చేయడం హాస్యాస్పదమని జనసేన నేత గురాన అయ్యలు విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై వైసీపీ నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదన జగన్ రెడ్డి హయాంలోనే జరిగిందని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ తాను పెంచిన చార్జీలపై తానే ధర్నాలకు దిగుతున్నారని ఎద్దేవా చేశారు. 2019లో టిడిపి అధికారం కోల్పోయే నాటికి రాష్ట్రం మిగులు విద్యుత్ కలిగి ఉందని, జగన్ అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్రం అధోగతి పాలయ్యిందని ఆరోపించారు. ప్రజల సోమ్మును అప్పనంగా తన వారికి దోచిపెట్టేందుకు విద్యుత్ లోటును సృష్టించారని విమర్శించారు. అమలులో ఉన్న పిపిఎలను రద్దు చేయడంతోపాటు సోలార్, విండ్ ఎనర్జీ సంస్థల నిర్వాహకులను బెదిరించి వారిని రాష్ట్రం నుంచి వెళ్లగొట్టారని పేర్కొన్నారు. దీంతో 10 వేల మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్‌ను కోల్పోయినట్లు చెప్పారు. ఎపి జెన్కోను కావాలని దెబ్బతీసి, విద్యుత్ లోటు పేరుతో విజయసాయిరెడ్డి అండ్ కో నుంచి అధిక రేట్లకు విద్యుత్ కొనుగోలు చేశారన్నారు. యూనిట్ ధర రూ.5లకు అందుబాటులో ఉన్నా, కమీషన్ల కోసం బహిరంగ మార్కెట్‌లో రూ.8 నుంచి 14 వరకూ గత ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు . వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం తొలిసారి 2021-22కి ఎపిఇఆర్‌సి ఆమోదించిన ట్రూఅప్ చార్జీలు రూ.3,082 కోట్లు ప్రజలపై భారం వేశారన్నారు. 2022-23కి రూ.6,073 కోట్లు, 2023-24కి రూ.9,412 కోట్లు విద్యుత్ ట్రూఅప్ చార్జీలకు ఎపిఇఆర్‌సి ఆమోదం తెలిపిందని, ఎన్నికల ముందు భారం వేస్తే ప్రజల నుంచి వ్యతిరేక వస్తుందని వాయిదా వేస్తూ వచ్చారని తెలిపారు. ఆ చార్జీలనే ఇప్పుడు వసూలు చేస్తుంటే, వైఎస్‌ఆర్‌సిపి నాయకులకు ధర్నాలు చేయాలని జగన్ పిలుపునివ్వడాన్ని అయ్యలు తప్పుబట్టారు (Story : విద్యుత్ ఛార్జీలు పెంచిన వాళ్లే ధర్నాలు చేయడం హాస్యాస్పదం)