కొండలు ఎక్కుతూ… గుట్టలు దాటుకుంటూ…
• అడవి బిడ్డల సమస్యలు వింటూ… అధికారులకు పరిష్కారాలు సూచిస్తూ
• గిరిజనంతో మమేకం అయిన ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు
• రెండో రోజు ఉత్తరాంధ్ర ఏజెన్సీ ప్రాంతాల్లో విస్తృతంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారి పర్యటన
న్యూస్ తెలుగు/సాలూరు : కొండలు ఎక్కారు.. గుట్టలు దాటారు.. పచ్చటి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ.. గిరిజనం చెంతకు వెళ్లారు. గిరిపుత్రుల కష్టాలను వారి మాటల్లోనే విన్నారు.. ఎప్పటికప్పుడు అధికారులకు పరిష్కార మార్గాలు సూచిస్తూ.. ఆదేశాలు జారీ చేస్తూ.. అడవి బిడ్డలకు అండగా నేనున్నానంటూ భరోసా ఇచ్చారు రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. గిరిజన ప్రాంతాల్లో డోలీ కష్టాలు తీర్చేందుకు నూతన రహదారుల నిర్మాణానికి శ్రీకారం చుట్టేందుకు ఉత్తరాంధ్ర ఏజెన్సీలో పర్యటిస్తున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు, రెండో రోజు అల్లూరి సీతారామరాజు జిల్లా, అనంతగిరి మండల పరిధిలోని గిరిజన గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. వాహనం వెళ్లే వీలు లేని కొండ ప్రాంతాలకు కాలినడకన ఎక్కారు. రూ. ఐదున్నర కోట్లతో నూతనంగా రహదారి నిర్మిస్తున్న అనంతగిరి మండలం, గుమ్మంతి గ్రామం వైపు సుమారు మూడు కిలోమీటర్ల మేర రాళ్లు గుట్టల్లో నడిచారు. తమ కోసం వచ్చిన ఉపముఖ్యమంత్రివర్యులకు గుమ్మంతి గ్రామ మహిళలు ఎదురొచ్చి వారి గిరిజన ఆచార సంప్రదాయాలతో స్వాగతించారు. ఏజెన్సీలో పండే పూలు, ఆకులతో తయారు చేసిన పుష్ప గుచ్చాలు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అందించారు. తన కోసం గిరిజన మహిళలు తెచ్చిన ప్రతి పుష్పగుచ్చాన్ని స్వీకరించి, పేరు పేరునా వారికి పలుకరించి ఉత్సాహ పరిచారు.
• మా దేవుడు మీరంటూ గిరిపుత్రుల జేజేలు
కాలి నడకన వెళ్లేందుకు కూడా వీలు లేని తమ గ్రామానికి రోడ్డు మంజూరు చేసి, పనులు ప్రారంభించేందుకు వచ్చిన శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మా దేవుడు మీరు సర్ అంటూ గిరిజన మహిళలు జేజేలు పలికారు. స్వతంత్ర భారత చరిత్రలో తమ గ్రామాలకు వచ్చిన మొట్టమొదటి నాయకుడు మీరంటూ కొనియాడారు. గిరిజన దేవతల జాతర్లలో పాడే పాటలు పాడుతూ.. పసుపు కలిపిన బియ్యాన్ని నుదుటిన దిద్దారు. తమ గ్రామాన్ని డోలీ మోతలు లేని గ్రామంగా తీర్చిదిద్దుతున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. జీవితకాలం మీరు రుణపడి ఉంటామంటూ గిరిజన మహిళలు కొబ్బరికాయ కొట్టేందుకు ప్రయత్నించగా సున్నితంగా తిరస్కరించారు. మా ఇళ్ళలో మీ ఫోటో పెట్టుకుంటామని చెప్పారు. గిరిజన డప్పు కళాకారులు డప్పులు కొడుతూ ఆహ్వానం పలుకగా, వారితో ఫోటోలు దిగి ఉత్సాహపరిచారు.
• సమస్యలు చెప్పుకొన్న గిరిజనం
గిరి శిఖర గ్రామాల ప్రజలు తమ సమస్యలను శ్రీ పవన్ కళ్యాణ్ గారికి చెప్పుకున్నారు. రోడ్డు నిర్మాణంతో తమ సమస్యలు సగం తీరినట్టేనని చెప్పారు. అయితే గూడెల్లో ఇళ్లు మంజూరు అయినా ఫారెస్టు పట్టాల సమస్య కారణంగా ఇళ్లు కట్టుకోలేకపోతున్నామని చెప్పారు. రోడ్లతోపాటు తాగు నీటికి ఇబ్బందులు ఉన్నాయని కొండపై గ్రామాల ప్రజలు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి తెలిపారు. వాజంకి గ్రామంలో 2014లో ఇళ్లు మంజూరు అయ్యాయని, అటవీ అనుమతులు లేక నిర్మాణానికి తెచ్చిన రేకులు పాడయ్యాయని మరో గిరిజనుడు వాపోయారు. మా గ్రామంలో మట్టి రోడ్డు కూడా లేదు అంటూ కొండ శిఖర గ్రామం అయిన మడ్రేవులకు చెందిన శ్రీ వెంకటేశ్వర్లు పాత్రుడు అనే గిరిజనుడు చెప్పారు.
గిరిజన ప్రాంతాల్లో ఇళ్ల పట్టాల సమస్య పరిష్కరించాలని కలెక్టర్ తోపాటు అటవీ అధికారులకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు. పాడేరు డివిజన్ మొత్తం ఎన్ని ఇళ్లు మంజూరయ్యాయో పరిశీలన చేసి అన్నింటికీ ఒకేసారి పట్టాలు ఇచ్చే విధంగా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.
• గిరిజనుల హక్కులు కోల్పోకుండా ఉపాధి అవకాశాలు : శ్రీ పవన్ కళ్యాణ్ గారు
అనంతరం శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ.. ‘గిరిజనులకు ఉపాధి అవకాశాలు మెరుగు పడాలి.. ఆదాయం రావాలి.. అదే సమయంలో అడవుల సంరక్షణను బాధ్యతగా తీసుకోవాలి. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులు వారి హక్కులు కోల్పోకుండా అభివృద్ధి చెందే మార్గాలు అన్వేషిస్తాము. పర్యాటక అభివృద్ధి ద్వారా గిరిజనులకు అదనపు ఆదాయం వచ్చే ఏర్పాటు చేస్తాం. గిరిజనులు గంజాయి పండించడం, రవాణా వైపు వెళ్లకుండా యువత అవగాహన కల్పించాలి. విదేశాల నుంచి పర్యాటకులు మీ గూడెల్లోకి వచ్చే విధంగా ప్రణాళికులు రూపొందిస్తాం.. మీ గూడెంలోనే మీకు ఆదాయం లభించే విధంగా చర్యలు తీసుకుంటాం. గత ప్రభుత్వం అప్పులు చేయడం మినహా అభివృద్ధి చేయలేదు. ప్రజల సమస్యలు పరిష్కరించలేదు. 2008లో ఆదిలాబాద్ తాండాల్లో నీటి సమస్య నా దృష్టికి వచ్చినప్పుడు సొంత డబ్బుతో ఆ సమస్యను పరిష్కరించా. ఈ రోజు ప్రభుత్వంలో ఉన్నాం. శాయశక్తులా కృషి చేసి మీ సమస్యలు తీరుస్తాం. చాలా గిరిజన గ్రామాల్లో డోలీ మోతలు ఉన్నాయని గౌరవ ముఖ్యమంత్రి గారికి చెబితే తక్షణం రూ. 49 కోట్లు ఇచ్చారు. సమస్య అధికంగా ఉన్న చోట ఆ నిధులతో రోడ్లు వేస్తున్నాం. మరో 450 పంచాయతీలు ఉన్నాయి. సమీపంలో జూనియర్ కాలేజీ నిర్మాణానికి కూడా చర్యలు తీసుకుంటామ’ని అన్నారు.
• అటవీ ఉత్పత్తులు, చిరుధాన్యాల గుత్తులతో ఆహ్వానం
అంతకు ముందు అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు వచ్చిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జిల్లా కలెక్టర్ తో పాటు అటవీశాఖ అధికారులు చిరుధాన్యాల కంకులతో ప్రత్యేకంగా తయారు చేసిన గుచ్చాలతో స్వాగతం పలికారు. గుమ్మంతి గ్రామం వైపు బయలుదేరిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి గిరిజనులు తమ ప్రాంతంలో సహజ సిద్ధంగా పండించిన కూరగాయలతో రూపొందించిన గుచ్చాలను అందించారు. అంతకు ముందు జీనపాడు అటవీ చెక్ పోస్టు దాటిన తర్వాత అటవీశాఖ అధికారులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అటవీ ఉత్పత్తులతో చేసిన గుచ్చాలతో స్వాగతం పలికారు. వేసవి అడవులు తగులబెట్టకుండా గిరిజనులకు అవగాహన కల్పించేందుకు పాడేరు రేంజ్ అధికారులు రూపొందించిన పోస్టర్ ను తిలకించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు అటవీశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కొత్త అడవులు పెంచేందుకు తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా అధికారులు ఆయనకు వివరించారు. తిరుగు ప్రయాణంలో దేవరపల్లి పినకోట మార్గంలో సరుగుడు పంటను పరిశీలించారు. గిరిజన రైతులతో ముచ్చటించి పంటల వివరాలు అడిగి తెలుసుకున్నారు.
• శిథిలావస్థలోని అంగన్వాడీ కేంద్రం పరిశీలన
తిరుగు ప్రయాణంలో – కొర్రపత్తి గ్రామం వద్ద రోడ్డు పక్కన తన కోసం వేచి ఉన్న చిన్నారులు, గ్రామస్తులను శ్రీ పవన్ కళ్యాణ్ గారు పలుకరించారు. గ్రామంలో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. స్కూలు భవనాలు, రహదారులు సరిగాలేవని గ్రామస్తులు చెప్పగా, పాఠశాల భవనంలోనికి వెళ్లి తరగతి గదులను పరిశీలించారు. పాఠశాలకు ప్రహరీ నిర్మించాలని, శ్లాబు వేయించాలని గ్రామస్తులు కోరారు. శిధిలావస్థలో ఉన్న అంగన్వాడీ భవనాన్ని పరిశీలించి తక్షణం వేరే భవనంలోకి అంగన్వాడీ కేంద్రాన్ని మార్చాలని ఆదేశించారు. ఆ గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం యుద్ధప్రాతిపదికన చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అంతకు ముందు వెలగలపాడు గిరిజన గ్రామానికి చెందిన మహిళలు తాగునీటి కష్టాలు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువచ్చారు. గ్రామంలో ఉన్న బోరు పని చేయడం లేదని, కొండ వాలులో ఉన్న గడ్డ నుంచి నీరు తెచ్చుకుని తాగుతున్నామని తెలిపారు. గ్రామంలో ఉన్న బోరును శ్రీ పవన్ కళ్యాణ్ గారు పరిశీలించారు. గ్రామం చివర్లో కొండవాలులో ఉన్న నీటి గడ్డ వద్దకు మహిళలు తీసుకువెళ్లారు. నీటిని తోడేందుకు తక్షణం మోటరు సౌకర్యం కల్పించాలని, వెలగలపాడు తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
• విశాఖ, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో జననీరాజనం
గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించేందుకు వెళ్తున్న ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి విశాఖ, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలికారు. సింహాచలం, పెందుర్తి జంక్షన్, కొత్తవలస, దేవరపల్లి తదితర ప్రాంతాల్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలికేందుకు వచ్చిన జనంతో కిటకిటలాడాయి. సాయంత్రం తిరుగు ప్రయాణంలోనూ భారీ ఎత్తున ప్రజలు రోడ్ల మీదకు వచ్చి పూల వర్షం కురిపించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై పూల వర్షం కురిపించారు. వాహన శ్రేణి నుంచి బయటకు వచ్చి ప్రతి ఒక్కరికీ అభివాదం చేస్తూ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముందుకు సాగారు.(Story : కొండలు ఎక్కుతూ… గుట్టలు దాటుకుంటూ )