ఆర్.టి.సి ఉద్యోగుల సమస్యలన్నిటినీ పరిష్కరిస్తాం
ప్రయాణీకుల భద్రతే ముఖ్యంగా బాధ్యతగా పని చేయాలి
రాష్ట్ర రవాణా శాఖామంత్రి మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి
న్యూస్‌తెలుగు/ విజయనగరం : ఆర్.టి.సి ఉద్యోగుల సమస్యలన్నిటినీ పరిష్కరిస్తామని, ఈ.ఎస్.ఐ పై కూడా త్వరలోనే నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని రాష్ట్ర రవాణా శాఖామంత్రి మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆర్.టి.సి డిపో లో మంత్రి 10 బస్సులకు జెండా ఊపి ప్రారంభించారు. రెండు బస్సు లు విజయనగరం నుండి శ్రీకాకుళం కు కాగా మిగిలినవి అనకాపల్లి, శ్రీకాకుళం డిపో లకు చెందినవి. అనంతరం కార్మికులనుద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల్లోనే ఆర్.టి.సి ఉద్యోగులకు నైట్ అవుట్ అలవెన్స్ మంజూరు చేసిన ముఖ్యమంత్రి కి అందరం రుణపడి ఉండాలన్నారు. ఎక్కువ ఉద్యోగులు పని చేసే పెద్ద సంస్థ ఆర్.టి.సి అని, ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం నిత్యం పని చేస్తోందని అన్నారు. కార్మికులు, ప్రయాణీకులు రెండు కళ్ళు వంటివని , వీరికి ఎటువంటి సమస్యలు వచ్చినా నిత్యం అందుబాటులో ఉంటామని ప్రభుత్వం వెంటనే ఆదుకుంటుందని అన్నారు. ఆర్.టి.సి ఉద్యోగుల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని, ప్రమాదాలు తగ్గేలా పని చేస్తూ ప్రయాణీకులను భద్రంగా చేరవేయడమే ప్రధాన ధ్యేయంగా బాధ్యతగా అందరూ పని చేయాలని తెలిపారు.
రాష్ట్ర ఎం.ఎస్.ఎం.ఈ , సెర్ప్ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ఒక సంస్థను నిలబెడితే ఆ సంస్థే మనకు భవిష్యత్తు నిస్తుందని తెలిపారు. భవిష్యతు లో ఎలక్త్రిక్ వాహనాలను ప్రవేశపెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉందని, ప్రజలకు మంచి సేవలను అందజేయడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.
శాసన సభ్యులు అదితి గజపతిరాజు మాట్లాడుతూ గత ప్రభుత్వం ఆర్.టి.సి ని నిరీర్యం చేసిందని, ఈ ప్రభుత్వం వచ్చిన నుండి బస్సు లను ప్రారంభించడం జరుగుతోందని ఎలిపారు.
ఆర్.టి.సి జోనల్ చైర్మన్ దున్ను దొర మాట్లాడుతూ ఆర్.టి.సి కార్మికుల శ్రమ ను ప్రభుత్వం గుర్తిస్తోందని , సంస్థ నాది అనే భావం తో కార్మికులు పని చేయాలనీ తెలియరు. ప్రయాణీకులను గౌరవిస్తూ, వారికీ నమ్మకం కలిగేలా పని చేయాలన్నారు.
కార్యక్రమం అనంతరం ఉత్తమ సేవలందించిన డ్రైవర్లకు , కండక్టర్లకు ప్రశంసా పత్రాలను, నగదు పారితోషికాన్ని మంత్రి చేతుల మీదుగా అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్.టి.సి ఈ.డి విజయకుమార్ , జిల్లా ప్రజా రవాణా అధికారి అప్పల నారాయణ , డిప్యూటీ సి.పి.ఎం సుధా బిందు ఆర్.టి.సి యూనియన్ ప్రతినిధులు , ఉద్యోగులు పాల్గొన్నారు. (Story : ఆర్.టి.సి ఉద్యోగుల సమస్యలన్నిటినీ పరిష్కరిస్తాం )