గిరిజన ప్రాంతాల్లో డోలీ మోతలు తప్పిస్తాం..
రూ. 46కోట్లతో గిరిజన గ్రామాల్లో రహదారుల నిర్మాణం
గిరిజన ప్రాంతాల్లో రహదారి, తాగునీరు, ఉపాధికల్పనకు కృషి
మక్కువ ప్రాంతమంటే నాకు మక్కువ
గిరిజన యువత నైపుణ్యాలు పెంపొందించుకోవాలి
గిరిజన యువతకు ఉపాధి కల్పించేందుకు బలమైన పరిష్కారం
ప్రతి రెండు మాసాల్లో 12 రోజులు మన్యంలోనే పర్యటిస్తా
రహదారుల నాణ్యతలో లోపం ఉంటే తెలియజేయండి
మహిళా సంఘాలకు రూ. 4కోట్ల 14లక్షల 72 వేల రుణాల పంపిణీ
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్
న్యూస్ తెలుగు/ సాలూరు : పార్వతీపురం, డిసెంబర్ 20 : గిరిజన ప్రాంతాల్లో డోలీ మోతలకు స్వస్తి పలికేందుకు అన్ని గిరిజన ప్రాంతాలకు రహదారి సౌకర్యం కల్పించనున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణ, అటవీ శాఖల మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు అయినప్పటికీ గర్భిణీలు,బాలింతలు డోలీల్లో వెళ్లడం బాధాకరమని తెలిపారు. మీకోసం పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకొన్నారని, రాష్ట్ర ముఖ్యమంత్రి దిశా నిర్దేశకత్వంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కింద అన్ని గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పిస్థామని అన్నారు. ఎక్కువ ప్రజలు నివాసం ఉండే ప్రాంతాలకు అధిక ప్రాధాన్యతను ఇవ్వనున్నట్లు వివరించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మక్కువ మండలం బాగుజోల నుంచి సీరివర గ్రామం వరకు రూ. 9.5 కోట్లతో 9 కి.మీ తారు రోడ్డుగా మార్చనున్నట్లు చెప్పారు. అలాగే రూ. 46కోట్లతో జిల్లాలో 19 రహదారులను వేయనున్నట్లు తెలిపారు.
ఒక రోజు జిల్లా పర్యటనలో భాగంగా ఉప ముఖ్యమంత్రి మక్కువ మండలం దుగ్గేరు పంచాయతీలోని బాగుజోల గ్రామాన్ని శుక్రవారం సందర్శించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రూ. 20.11 కోట్ల అంచనా వ్యయంతో జిల్లాలో చేపట్టనున్న 19 గ్రామాల్లోని బీటీ రోడ్ల నిర్మాణ పనులకు, రూ. 9.50 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న బాగుజోల నుంచి సిరివర గ్రామం వరకు తారురోడ్డు నిర్మాణ పనులకు ఉప ముఖ్యమంత్రి స్విచ్ ఆన్ చేసి శిలాఫలకాలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ 2017లో చేపట్టిన యాత్రలో గిరిజన ప్రాంతాల్లో రహదారులు, తాగునీరు, ఉపాధికల్పన అవసరమని గుర్తించినట్లు చెప్పారు. ప్రకృతి అందాలకు, సహజసిద్ద జలపాతాలకు మన్యం జిల్లా నెలవని, ee ప్రాంతంలో 20కి పైగా జలపాతాలు ఉన్నట్లు గుర్తుచేశారు. పర్యాటకంగా ఈ ప్రాంతాలను అభివృద్ధి చేయడం ద్వారా గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని సూచించారు. ఏ ప్రాంతమైన వృద్ధి చెందాలంటే
రోడ్లు అవసరమని, కాని గత ఐదేళ్లలో అది జరగలేదన్నారు.ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంలో నిధులు లేనప్పటికీ రహదారులుకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నామని, అన్ని గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించనున్నామని చెప్పారు. మన్యం ప్రజల కోసం ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో అహర్నిశలు పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. పాడేరు, అరకు, మన్యంలోని అనేక గిరిజన గ్రామాలను స్వయంగా సందర్శించి, గిరిజనుల సాదకబాధలు తెలుసుకున్నానని అన్నారు. బాగుజోల సిరివర తారురోడ్డు నిర్మాణానికి కొంత సమయం పట్టే అవకాశం ఉన్నందున, ఈలోగా గట్టి రోడ్డును తాత్కాలికంగా వేయాలని అధికారులను ఆదేశించారు. మక్కువ ప్రాంతమంటే నాకు మక్కువని, ఇక్కడి సహజ సిద్ద వాతావరణంలో పెరిగిన మిమ్మల్ని చూస్తే ఆనందంగా ఉందని అన్నారు. గిరిజన యువత నైపుణ్యాలను మరింత పెంపొందించు కోవాలని, ఇందుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని, గిరిజన పెద్దలతో మాట్లాడి యువతకు ఉపాధి కల్పించేందుకు బలమైన పరిష్కారం చూస్తామని అన్నారు. తాను అధికారంలో ఉన్నా, లేకున్నా గిరిజన ప్రజల కోసం అహర్నిశలు పాటు పడతానని హామీ ఇచ్చారు. గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి జరిగే వరకు స్వయంగా పర్యవేక్షణ చేస్తానని, ఇకపై ప్రతీ రెండు మాసాల్లో 12 రోజులు మన్యంలోనే పర్యటించి 2027లోగా అభివృద్ధి చేసి చూపిస్తానని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సారథ్యంలో అభివృద్ధి వేగంగా జరుగుతుందని, మీ ప్రాంతాల్లో జరిగే రోడ్లు, పాఠశాలలు, గిరిజన సంక్షేమ వసతి గృహాల నిర్మాణ పనుల్లో నాణ్యతలో లోపం ఉంటే తెలియ జేయాలని గిరిజనులను కోరారు. మీకోసం పనిచేసే మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారని, వారి దృష్టికి లోపాలను తీసుకురావడం ద్వారా మరింత మంచి జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కుల, మత, జాతితో సంబంధం లేకుండా యువత అభివృద్ధి చెందాలనేదే తన తపన అని పేర్కొన్నారు. అనంతరం పనసభద్ర పంచాయతీ పరిధిలోని మహిళా సంఘాలకు రూ.4కోట్ల 14 లక్షల 72 వేల చెక్కును ఉప ముఖ్యమంత్రి పంపిణీ చేశారు.
జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ రూ. 46కోట్లతో 19 రహదారులకు శంకుస్థాపన చేసుకోవడం జరిగిందని అన్నారు. బాగిజోల నుంచి సిరివరకు 9 కి.మీ తారు రోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్లు ఉప ముఖ్యమంత్రికి వివరించారు.
రాష్ట్ర గిరిజన సంక్షేమ, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, కురుపాం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి, శాసనసభ్యులు బోనెల విజయచంద్ర, నిమ్మక జయకృష్ణ, లోకం మాధవి కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యారు.
ఈ సమావేశంలో పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ కృష్ణతేజ, జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవరెడ్డి, జాయింట్ కలెక్టర్ ఎస్.ఎస్.శోబిక, పాలకొండ సబ్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి, సాలూరు, మక్కువ ఎంపీపీలు గురుగుబెల్లి రాములమ్మ, మర్రి పారమ్మ, మక్కువ జెడ్పీటీసి ఎం.శ్రీనివాస రావు నాయుడు, కొరమ, పనసభద్ర ఎంపీటీసీలు కూనేటి గింద, సామంతుల వెంకటి, సర్పంచులు తాడంగి సుసుమ, సీదరపు గంగమ్మ, కెఆర్ఆర్సి ప్రత్యేక ఉప కలెక్టర్ పి. ధర్మ చంద్రారెడ్డి,జిల్లా రెవిన్యూ అధికారి కె.హేమలత, డ్వామా, డీఆర్డిఏ పీడీలు కె.రామచంద్ర రావు, వై.సత్యం నాయుడు, జిల్లా అటవీ శాఖాధికారి జి.ఏ.పి. ప్రసూన, డిఎఫ్ఓ కె.శ్రీను బాబు, డీఐపీఆర్ఓ ఎల్.రమేష్, డీఈఓ ఎన్.తిరుపతి నాయుడు, వైద్య ఆరోగ్య శాఖ నోడల్ అధికారి డా. ఎం.వినోద్ కుమార్, జిల్లా ప్రణాళిక అధికారి పి.వీర్రాజు, జిల్లా గ్రామీణ నీటి సరఫరా అధికారి ఓ.ప్రభాకర రావు, జిల్లా సర్వే, భూరికార్డుల అధికారి కె.రాజకుమార్, ఏపీఈపిడీసిఎల్ ఎస్ఈ కె.చలపతిరావు, ఇతర జిల్లా అధికారులు, గిరిజన గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
(Story : గిరిజన ప్రాంతాల్లో డోలీ మోతలు తప్పిస్తాం..)