అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో క్రీడా సౌకర్యాలు
* ఏపీని క్రీడాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడమే సీఎం లక్ష్యం
* దేశంలోనే అత్యుత్తమంగా ఏపీ స్పోర్ట్స్ పాలసీ
* నేషనల్స్, ఖేలో ఇండియా గేమ్స్ నిర్వహణకు సిద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం
* కేంద్రమంత్రులతో శాప్ ఛైర్మన్ రవినాయుడు
* కేంద్ర క్రీడాశాఖ మంత్రి మాండివ్య, విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడులకు వినతి
* స్పోర్ట్స్ ప్రాజెక్టులు, లైఫ్ సేవింగ్ కోర్సుల ఏర్పాటుపై భేటీ
* విశాఖలో వాటర్ స్పోర్ట్స్ నిర్వహించాలని విజ్ఞప్తి
న్యూస్‌తెలుగు/విజయవాడ: అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో కూడిన క్రీడాసౌకర్యాలను ఆంధ్రప్రదేశ్‌లో నెలకోల్పాలని ఏపీ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ అనిమిని రవినాయుడు యూత్ ఎఫైర్స్ అండ్ స్పోర్ట్స్ సెంట్రల్ మినిస్టర్ శ్రీ మన్షుక్ మాండివ్య గారిని కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా అమలాపురం ఎంపీ, ఏపీ స్పోర్ట్స్ పార్లమెంటరీ ఇన్‌ఛార్జ్ జీఎమ్ హరీష్, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుతో కలిసి కేంద్ర క్రీడాశాఖమంత్రి మాండివ్యను శుక్రవారం ఆయన కలిశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని క్రీడారంగానికి మంజూరు చేయాల్సిన ప్రాజెక్టులపై రవినాయుడు చర్చించారు. రూ.237 కోట్లతో మినిస్ట్రీ ఆఫ్ యూత్ ఎఫైర్స్ అండ్ స్పోర్ట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన 24 స్పోర్ట్స్ ఇన్‌ఫ్రా ప్రాజెక్టులను ఖేలో ఇండియా ద్వారా మంజూరు చేయాలని రవినాయుడు విన్నవించారు. సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు గతంలో ప్రతిపాదించిన రెండు నేషనల్ ఎక్స్‌లెన్సీ సెంటర్లను కాకినాడ, గుంటూరు పట్టణాలకు మంజూరు చేయాలని కోరారు. కాకినాడలో హాకీ, షూటింగ్, గుంటూరు ఏఎన్‌యూలో అథ్లెటిక్స్ ఆర్చరీ, వెయిట్ లిఫ్టింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏపీకి మంజూరు చేసిన 26 డిస్ట్రిక్ట్ లెవల్ ఖేలో ఇండియా సెంటర్లతోపాటు అదనంగా మరో 26 ఖేలో ఇండియా డిస్ట్రిక్ట్ లెవల్ సెంటర్లను మంజూరు చేయాలని ఆకాంక్షించారు. అలాగే తిరుపతిలోని ఖేలో ఇండియా రెసిడెన్సియల్ సెంటర్‌లో అథ్లెటిక్స్, రెజ్లింగ్ విభాగాలకు సంబంధించిన సెంటర్లను ఏర్పాటు చేయాలని, కోవిడ్‌కు ముందు నిలిపివేసిన క్రీడాకారుల రైల్వే రాయితీలను పునఃప్రారంభించాలని కేంద్ర క్రీడాశాఖ మంత్రి మాండివ్యను శాప్ ఛైర్మన్ కోరారు. నేషనల్ గేమ్స్, ఖేలో ఇండియా గేమ్స్ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఈసారి ఆ గేమ్స్‌ను ఏపీకి కేటాయించాల్సిందిగా ఆశించారు. దీనిపై కేంద్రమంత్రి మాండివ్య కూడా సానుకూలంగా స్పందించారని శాప్ ఛైర్మన్ వెల్లడించారు.
ఏపీలో లైఫ్ సేవింగ్ కోర్సు ఏర్పాటు చేయాలి…
ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారిని శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు కలిశారు. అమలాపురం ఎంపీ జీఎమ్ హరీష్, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, లైఫ్ సేవింగ్ స్పోర్ట్స్ కమిషన్ ఛైర్మన్ ప్రదీప్ నాయుడులతో కలిసి క్రీడారంగ అంశాలపై కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడితో ఆయన భేటీ అయ్యారు. ఏపీ నూతన స్పోర్ట్స్ పాలసీలో భాగంగా రాష్ట్రంలో క్రీడావసతుల ఏర్పాటుకు 10శాతం సీఎస్ఆర్ నిధులను సమకూర్చేందుకు సహకరించాలని మంత్రి రామ్మోహన్‌నాయుడుని శాప్ ఛైర్మన్ కోరారు. క్రీడా వసతులు, సదుపాయాలు, స్పోర్ట్స్ అకాడమీల ఏర్పాటుకు సీఎస్ఆర్ నిధులు ఉపయోగపడతాయన్నారు. ఎయిర్‌లైన్ ఆపరేటింగ్ కంపెనీల నుంచి స్పోర్ట్స్ పాలసీకి సీఎస్ఆర్ నిధులు కేటాయించాలని విన్నవించారు. ఎయిర్ హోస్టర్స్, ఎయిర్ గ్రౌండ్ స్టాఫ్‌కు లైఫ్ సేవింగ్‌పై రాష్ట్రీయ లైఫ్ సేవింగ్ సొసైటీ(ఇండియా) ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో లైఫ్ సేవింగ్ కోర్సు ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రికి ఆయన విజ్ఞప్తి చేశారు. దీనిపై రామ్మోహన్‌నాయుడు కూడా సానుకూలంగా స్పందించి తప్పకుండా అమలు చేద్దామని హామీ ఇవ్వడం పట్ల శాప్ ఛైర్మన్ హర్షం వ్యక్తం చేశారు.
లోక్‌సభ స్పీకర్‌ను కలిసిన శాప్ ఛైర్మన్..
ఢిల్లీ పర్యటన సందర్భంగా పార్లమెంటులోని స్పీకర్ కార్యాలయంలో లోక్‌సభ స్పీకర్ ఓమ్ బిర్లా గారిని విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు గారితో కలిసి శాప్ ఛైర్మన్ రవినాయుడు గారు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. అనంతరం ఏపీలో అమలు చేస్తున్న క్రీడాపాలసీ గురించి వివరించడం జరిగింది.
ఏపీలో వాటర్ స్పోర్ట్స్‌ను ప్రోత్సహించాలి
ఆంధ్రప్రదేశ్‌లో వాటర్ స్పోర్ట్స్‌ను ప్రోత్సహించాలని, వాటర్స్ గేమ్స్ నిర్వహణకు విశాఖపట్టణం అనుకూలంగా ఉంటుందని శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు ఆకాంక్షించారు. ఢిల్లీ పర్యటన సందర్భంగా స్పోర్ట్స్ సర్వీసెస్ కంట్రోల్ బోర్డు సెక్రటరీ టు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ శ్రీ కమోదర్ వరుణ్ సింగ్ గారిని శాప్ ఛైర్మన్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఏపీలో కెనాయింగ్ అండ్ కాయాకింగ్ ట్రైనింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని, దానికి కావాల్సిన నీటి వనరులను గుర్తించామని రవినాయుడు వివరించారు. త్వరలోనే దీనిపై చర్చిద్దామని, అలాగే ఎన్‌సీసీ నుంచి పూర్తి సహకారం అందిస్తామని వరుణ్ సింగ్ బదులిచ్చారు. అనంతరం ఈఈపీసీ ఇండియా డిప్యూటీ డైరెక్టర్ శ్రీ దీపక్ ఠాకూర్ గారిని శాప్ ఛైర్మన్ కలిసి ఆంధ్రప్రదేశ్‌కు సీఎస్ఆర్ ఫండ్స్‌ను కేటాయించాలని కోరగా ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. (Story : అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో క్రీడా సౌకర్యాలు)