UA-35385725-1 UA-35385725-1

సెంటు భూమి క‌బ్జా చేసినా ఖ‌బ‌డ్దార్‌..

సెంటు భూమి క‌బ్జా చేసినా ఖ‌బ‌డ్దార్‌..

– భూ కబ్జాలు, మోసాలు, బెదిరింపుల‌కు పాల్ప‌డితే జైలే దిక్కు
– భూ స‌మ‌స్య ప‌రిష్కార‌మ‌య్యే వర‌కు ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంది
– స‌మ‌స్య‌ల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం చూపుతాం, రీస‌ర్వేలోని త‌ప్పుల‌నూ స‌రిచేస్తాం
– ప్ర‌తిఒక్క‌రికీ న్యాయం చేయాల‌నేది నా ఆలోచ‌న‌, ఎన్‌డీఏ ప్ర‌భుత్వం ఆలోచ‌న‌
– ఎంతో న‌మ్మ‌కంతో 57 శాతం ఓట్ల‌తో మ‌మ్మ‌ల్ని గెలిపించారు
– ప్ర‌జ‌ల ఆశ‌ల్ని నెర‌వేర్చేందుకు ఆర్నెళ్లుగా క‌ష్ట‌ప‌డుతున్నాం
– గ‌త ప్ర‌భుత్వం వ్య‌వ‌స్థ‌ల‌న్నింటినీ నిర్వీర్యం చేసింది
– ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌తో మ‌న భూమికి దిక్కులేకుండా చేసే ప‌రిస్థితిని తీసుకొచ్చారు
– రెవెన్యూ స‌ద‌స్సుల ద్వారా 95,263 పిటిష‌న్లు వ‌చ్చాయి
– దాదాపు 3 లక్ష‌ల మంది స‌ద‌స్సుల‌కు హాజ‌ర‌య్యారు
– పాస్‌పుస్త‌కంపై క్యూఆర్ కోడ్, జియో ట్యాగింగ్‌తో ఎప్ప‌టిక‌ప్పుడు రికార్డుల‌ను
ప‌రిశీలించుకునే అవ‌కాశం క‌ల్పిస్తాం
– ఈడుపుగ‌ళ్లు రెవెన్యూ స‌ద‌స్సులో రాష్ట్ర ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు
న్యూస్‌తెలుగు/కృష్ణాజిల్లా (ఈడుపుగ‌ళ్లు): కృష్ణా జిల్లా, పెన‌మ‌లూరు నియోజ‌క‌వ‌ర్గంలోని ఈడుపుగ‌ళ్లు గ్రామంలో శుక్ర‌వారం జ‌రిగిన రెవెన్యూ స‌ద‌స్సులో రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు పాల్గొన్నారు. ప్ర‌జ‌ల నుంచి రెవెన్యూ స‌మ‌స్య‌ల‌కు సంబంధించి పిటిషన్ల‌ను స్వ‌యంగా స్వీక‌రించారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడారు.

57 శాతం ఓట్ల‌తో గొప్ప మెజారిటీతో గెలిపించి ఎన్‌డీఏ ప్ర‌భుత్వంపై మీరు పెట్టుకున్న ఆశ‌ల‌ను నెర‌వేర్చేందుకు ఆర్నెళ్లుగా క‌ష్ట‌ప‌డుతున్నామ‌ని.. ఇంకా కష్ట‌ప‌డ‌తామ‌ని, ప్ర‌తి స‌మ‌స్య‌కు ప‌రిష్కారం చూపించాల‌నేది మా ఆలోచ‌న అని ముఖ్య‌మంత్రి అన్నారు. గ‌త ప్ర‌భుత్వం భూక‌బ్జాలతో మొదలుపెట్టి వ్య‌వ‌స్థ‌ల‌న్నింటినీ నిర్వీర్యం చేసింది. విధ్వ‌సం సృష్టించారు. మ‌న జీవితాల‌ను అంధ‌కారంలోకి నెట్టారు. గ‌తంలో ఎప్పుడూ ఇన్ని ఇబ్బందులు చూడ‌లేదు. ఇది ప్ర‌జా ప్ర‌భుత్వం.. ప్ర‌జ‌ల ఆశ‌ల మేర‌కు ప‌నిచేసే ప్ర‌భుత్వం ఇద‌ని స్ప‌ష్ట‌మైన హామీ ఇస్తున్నా. ఒక‌వైపు అవినీతి.. మ‌రోవైపు వ్య‌వ‌స్థ‌ల విధ్వంసం.. అధికార యంత్రాంగాన్ని నిర్వీర్యం చేయ‌డం.. ఇలా అనేక స‌మ‌స్య‌ల‌ను సృష్టించారు. ఇప్ప‌టివ‌ర‌కు ల‌క్షా 57 వేల 481 అర్జీలు నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చాయి. రికార్డ్ ఆఫ్ రైట్స్ కోసం 78,854 ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి. ఇంటి జాగా కోసం 9,830 వినతులు, ల్యాండ్ గ్రాబింగ్‌కు సంబంధించి 9,528 ఫిర్యాదులు వ‌చ్చాయి. ఇవికాకుండా గ‌వ‌ర్న‌మెంట్ భూమి కోసం 8,366 ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి. ఆక్రమణలకు సంబంధించి 8,227 వ‌చ్చాయి. అధికార యంత్రాంగంపైన ఫిర్యాదులు 8 వేలు వ‌చ్చాయి. 22ఏ ద్వారా అక్ర‌మాల‌కు పాల్పడ్డారు. ప‌ట్టా భూములను క‌బ్జాచేశారు. ఒక‌టి రెండు కాదు కొన్ని వంద‌ల కేసులు జ‌రిగాయి. ఇవ‌న్నీ చూసిన త‌ర్వాత నేను ఒక్క‌టే నిర్ణ‌యించుకున్నాను. మీ భూమిని మీకు ఇప్పించే బాధ్య‌త తీసుకొని ప‌ట్టుద‌ల‌తో ముందుకెళ్తున్నామ‌ని ముఖ్య‌మంత్రి అన్నారు.

భూమి అనేది భ‌విష్య‌త్తుకు సంబంధించిన అంశం:
భూమి అనేది ప్ర‌జ‌ల భ‌విష్య‌త్తుకు సంబంధించిన అంశ‌మ‌ని.. ఒక గ‌జ‌మైనా, సెంటు అయినా, ఎక‌రా అయినా ప్రాణంతో స‌మాన‌మ‌ని ముఖ్య‌మంత్రి పేర్కొన్నారు. స‌ర్వ‌స్వంగా భావించే భూమిని గ‌త ప్రభుత్వంలో అడ్డగోలుగా లాక్కున్నారని అన్నారు. భూమికి, మ‌న‌కు ఉన్న బంధాన్ని తెంచేయాలని చూశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారు. ఈ యాక్ట్‌తో ఆనాటి ముఖ్య‌మంత్రి గుమ‌స్తాల‌ను పెట్టుకొని మీ భూమిపై పెత్త‌నం చేసే ప‌రిస్థితికి వ‌చ్చార‌న్నారు. వార‌స‌త్వంగా వ‌చ్చిన లేదా క‌ష్ట‌ప‌డి భూమిని కొనుక్కొంటే దానిపైన ఆయ‌న బొమ్మ వేసుకున్నారు. రాజ‌ముద్ర ఉండాల్సిన చోట ఆయ‌న సొంత బొమ్మ వేసుకున్నారు. మ‌న‌ద‌గ్గ‌ర బ్రిటిష్ కాలం నుంచి చాలా పటిష్టంగా రికార్డులు ఉన్నాయి. నిజాం పాల‌న‌తో పాటు కొంద‌రు హైద‌రాబాద్ నుంచి పాకిస్తాన్ వెళ్లిపోవ‌డం వంటి కార‌ణాల వ‌ల్ల తెలంగాణలో రికార్డులకు సంబంధించి కొన్ని స‌మ‌స్య‌లు ఉంటాయి. కానీ.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మాత్రం బ్రిటిష్‌వారు చాలా ప‌క‌డ్బందీ రికార్డుల‌ను నిర్వహించారు. జ‌మాబందీలో మ‌నం డ‌బ్బులుక‌ట్టి మ‌న భూమి మ‌న పేరుతో ఉందో లేదో ఏటా చూసుకునేవాళ్లం. అలాంటి మంచి వ్య‌వ‌స్థ ఉన్న స్థితి నుంచి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌తో మ‌న భూమి మ‌న‌కు లేకుండా చేసే స్థితికి తీసుకొచ్చారు. అందుకే చెప్పిన మాట ప్ర‌కారం మొద‌టి క్యాబినెట్‌ సమావేశంలోనే చర్చించి ఆ చ‌ట్టాన్ని ర‌ద్దు చేశామ‌ని ముఖ్య‌మంత్రి వివ‌రించారు.

రాళ్ల‌పై ఉన్న ఫొటో తీయ‌డానికి రూ. 12 కోట్లు అయింది:
భూముల స‌ర్వే పేరుతో విధ్వంసం సృష్టించి.. రాళ్ల‌పై ఫొటోలు వేసుకున్నారని.. ఆ బొమ్మలు తీయ‌డానికి రూ. 12 కోట్లు అయింద‌ని ముఖ్య‌మంత్రి వివ‌రించారు. మొన్న‌టివ‌ర‌కు మీరు భ‌యంభ‌యంగా బ‌తికారని.. భూమిని క‌బ్జా చేసినా, 22ఏలో పెట్టినా, భూమి మీది కాద‌ని చెప్పినా మాట్లాడాలంటే భ‌య‌ప‌డే ప‌రిస్థితికి వ‌చ్చారు. కానీ.. ఇప్పుడు మీరు స్వేచ్ఛ‌గా ఇక్క‌డికి వ‌చ్చి, నేరుగా అడిగే అధికారం ఎన్‌డీఏ ప్ర‌భుత్వం మీకు ఇచ్చింది. దాదాపు అన్ని రెవెన్యూ గ్రామాల్లో రెవెన్యూ స‌ద‌స్సులు పెడుతున్నాం. ఈ స‌ద‌స్సుల ద్వారా 95,263 పిటిష‌న్లు వ‌చ్చాయి. డిసెంబ‌ర్ 6న ప్రారంభించి జ‌న‌వ‌రి 8 వ‌ర‌కు రెవెన్యూ స‌ద‌స్సులు పెడుతున్నాం. దాదాపు 3 లక్ష‌ల మంది ఈ స‌ద‌స్సుల‌కు హాజ‌ర‌య్యారు. ఎన్నో ఏళ్లుగా అప‌రిష్కృతంగా ఉన్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించి మీ భూమి మీకు ఇచ్చే బాధ్య‌త మాది. ఇందులో ఎలాంటి అనుమానం లేదని ముఖ్య‌మంత్రి స్ప‌ష్టం చేశారు.

అత్యంత పార‌ద‌ర్శ‌కంగా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం:
ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ యాక్ట్ – 2024 చ‌ట్టం తీసుకొచ్చామ‌ని.. ఎవ‌రైనా వేరేవాళ్ల భూమిని క‌బ్జాచేస్తే అలాంటి వారిపై చాలా క‌ఠిన చర్యలు ఉంటాయని ముఖ్య‌మంత్రి స్ప‌ష్టం చేశారు. ఎవ‌రైనా మోసం చేసి భూమిని లాక్కున్నా, బ‌ల‌వంతంగా బెదిరించి లాక్కున్నా కొత్త చ‌ట్టం వ‌ర్తిస్తుంద‌ని, జైల్లో పెట్టే అధికారం ఇచ్చాం. ఎవ‌రైనా ఒక‌సారి త‌ప్పుచేస్తే పీడీ యాక్టు కింద జైలుకు పంపించే హ‌క్కును చ‌ట్టం కింద తీసుకొచ్చాం. మ‌రోవైపు ఎక్క‌డ భూక‌బ్జా జ‌రిగినా.. భూక‌బ్జాకు పాల్ప‌డినా వారిని జైల్లో పెట్ట‌డ‌మే కాకుండా భూమి విలువ మేర‌కు జ‌రిమానా కూడా వేస్తున్నాం. ఎవ‌రైనా ఒక సెంటు భూమి క‌బ్జా చేసినా ఖ‌బ‌డ్దార్‌.. తాట‌తీస్తాం. ఎవ‌రినీ వ‌దిలిపెట్టం. ఎవ‌రైనా వేరేవారి భూమిపై కన్నేస్తే జైలు క‌నిపించాలి.. దాదాపు 16,816 గ్రామాల‌కుగాను 6,698 గ్రామాల్లో రీస‌ర్వే చేశారు. అయితే ఈ రీస‌ర్వేకి సంబంధించి త‌ప్పుడు స‌ర్వే జ‌రిగిందంటూ దాదాపు 2,79,148 మంచి ఫిర్యాదులు చేశారు. ఫిర్యాదుల‌పై సానుకూలంగా స్పందించి ప‌రిష్క‌రిస్తాం. 33 రోజుల‌పాటు రెవెన్యూ స‌ద‌స్సులు జ‌రుగుతాయి. ఎట్టిప‌రిస్థితుల్లోనూ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించే బాధ్య‌త మ‌నం తీసుకోవాలి. నా ద‌గ్గ‌రికి ఒక్క పిటిష‌న్ కూడా రాని రోజున స‌మ‌ర్థ‌వంతంగా పని చేసిన‌ట్టు లెక్క అని అన్నారు. ఒక‌వేళ నా ద‌గ్గ‌రికి ఒక పిటిష‌న్ వ‌చ్చినా.. అది ప‌రిష్కారం చేయ‌లేని స‌మ‌స్య అయి ఉండాల‌న్నారు. రెవెన్యూ స‌ద‌స్సుల ద్వారా ప్ర‌తి గ్రామంలో రెవెన్యూ మ్యాపు, ప్ర‌భుత్వ‌, ప్రైవేటు భూముల‌న్నింటినీ ప్ర‌ద‌ర్శిస్తున్నాం. అభ్యంత‌రాలుంటే చెప్ప‌మంటున్నాం. ఎస్ఎల్ఆర్‌, ఆర్ఆర్‌, 1బీ రిజిస్ట‌ర్‌, 22ఏ జాబితా అన్నింటినీ పార‌ద‌ర్శ‌కంగా పెడుతున్నామ‌ని ముఖ్య‌మంత్రి వివ‌రించారు. భూ కొల‌త‌ల్లో తేడాలు, స‌ర్వే నెంబ‌ర్ల‌లో మార్పులు, వార‌సుల పేర్ల న‌మోదు, స‌రిహ‌ద్దు స‌మ‌స్య‌లు, భూ విస్తీర్ణంలో తేడాలు, రీస‌ర్వేలో రికార్డు అయిన త‌ప్పులు, భూక‌బ్జాలు, అసైన్డ్ భూముల ప‌రాధీనం, నిషిద్ధ భూములు, 22ఏ నుంచి తొల‌గింపు.. వీట‌న్నింటినీ ప‌రిశీలిస్తాం. స‌మ‌స్య‌ల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం చూపుతాం. ఒక‌సారి రికార్డు అప్‌డేట్ అయిన త‌ర్వాత ప‌ట్టాదారు పాస్ పుస్త‌కాలిస్తాం. క్యూఆర్ కోడ్ కూడా పెట్టి, జియో ట్యాగింగ్ కూడా చేస్తామ‌ని వివ‌రించారు. ఎప్ప‌టిక‌ప్పుడు రికార్డుల‌ను ప‌రిశీలించుకునే అవ‌కాశం ల‌భిస్తుంద‌న్నారు. నిర్దిష్ట కాల‌ప‌రిమితి పెట్టుకొని అన్నింటినీ పూర్తిచేస్తామ‌ని తెలిపారు.

మీ ఇంటి జాగా మీకిచ్చే బాధ్య‌త మాది:
ఇక్క‌డ గ్రామంలో బీసీ కాల‌నీ.. అతిపెద్ద స‌మ‌స్య‌.. 176 ఇంటి జాగాలు.. ఎన్‌టీఆర్ గారి హ‌యాంలో ఇచ్చాం. ఈరోజు ఈ జాగాల‌ను 22ఏకి ఎక్కించి ఇది మీ భూమి కాదు.. ప్ర‌భుత్వ భూమి అని చెప్పి ఇబ్బందిపెట్టే ప‌రిస్థితికి వ‌చ్చారు. మీ అంద‌రికీ ఒక‌టే హామీ ఇస్తున్నాం.. మీకు భేష‌ర‌తుగా ప‌ట్టాలు ఇచ్చే బాధ్య‌త మేము తీసుకుంటామ‌ని ముఖ్య‌మంత్రి వెల్ల‌డించారు. 22ఏ జాబితాకు సంబంధించిన స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి చ‌ట్ట‌ప‌రంగా పరిశీలించి చేసి వారిప‌ట్టాలు వారికిచ్చేలా చేస్తాం. ప్ర‌తి ఒక్క‌రికీ న్యాయం చేయాల‌నేది తన ఆలోచ‌న‌ అని, స‌మ‌స్య ప‌రిష్కార‌మ‌య్యే వర‌కు ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంద‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు భ‌రోసా క‌ల్పించారు. (Story : సెంటు భూమి క‌బ్జా చేసినా ఖ‌బ‌డ్దార్‌..)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1